• తాజా వార్తలు
  •  

ఇక వాట్సప్ నుంచి కూడా పేమెంట్స్ చేసుకోవ‌చ్చు

వాట్స‌ప్‌... ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది ఉప‌యోగిస్తున్న యాప్ ఇది. సుల‌భంగా మెసేజ్‌లు పంపుకోవ‌డానికి, ఫొటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవ‌డానికి.. వీడియోలు పంపుకోవ‌డానికి దీనికి మించిన యాప్ మ‌రొక‌టి లేదు.అందుకే దీని డౌన్‌లోడింగ్ సంఖ్య బిలియ‌న్ దాటింది. వినియోగ‌దారుల అవ‌స‌రాలు, అభిరుచులకు త‌గ్గ‌ట్టే వాట్స‌ప్ కూడా ఎప్ప‌టిక‌ప్ప‌డు త‌మ యాప్‌లో మార్పు చేర్పులు చేస్తోంది. వాట్స‌ప్‌ను ఫేస్‌బుక్ టేక్ ఓవ‌ర్ చేశాక ఈ యాప్‌లో అప్‌డేష‌న్స్ చాలా వేగంగా జ‌రుగుతున్నాయి. ఇటీవ‌లే స్టేట‌స్‌లో ఫొటో పెట్టుకునే ఆప్ష‌న్ కూడా క‌ల్పించింది ఈ యాప్‌. ఐతే ఇప్ప‌డు న‌డుస్తోంది డిజిట‌ల్ యుగం. ఆర్థిక లావాదేవీలు ఎక్కువ‌గా ఆన్‌లైన్ ద్వారా చేయ‌డానికే వినియోగ‌దారులు ఇష్ట‌ప‌డుతున్నారు. పేటీఎం, జియో మ‌నీ, మొబిక్‌విక్ లాంటి సంస్థ‌లు ఆన్‌లైన్ పేమెంట్స్‌కు గేట్‌వేలుగా మారాయి. ఈ నేప‌థ్యంలో వాట్స‌ప్ కూడా త్వ‌ర‌లోనే పేమెంట్స్ ఆప్ష‌న్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. దీంతో సుల‌భంగా డ‌బ్బులు పంప‌డం, తీసుకోవ‌డం చేయ‌చ్చ‌ని ఆ సంస్థ వ‌ర్గాలు తెలిపాయి.
కీలక నిర్ణయం
భార‌త్‌లో ఆన్‌లైన్ మ‌నీ వాలెట్‌లను ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తుండ‌డంతో తాను కూడా అదే దారిలో వెళ్లాల‌ని వాట్ప‌ప్ యోచిస్తోంది. ప్ర‌పంచంలో వాట్సప్ వాడుతున్న వినియోగ‌దారుల్లో ఎక్కువశాతం భార‌త్‌లోనే ఉండ‌డం దీనికి కార‌ణం. పేటీఎం, మొబిక్‌విక్‌లు మ‌నీ వాలెట్ పెట్టి విజ‌య‌వంతం కావ‌డంతో తాము కూడా వాలెట్ పెట్టాల‌నే ఆలోచ‌న వ‌చ్చిన‌ట్లు వాట్ప‌ప్ కంపెనీ సోర్సులు చెప్పాయి. నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాకు మ‌ద్ద‌తుగా తాము ఈ వాలెట్ పెట్టబోతున్నామ‌ని తెలిపింది. డిజిట‌ల్ ఇండియాలో తాము భాగ‌స్వాములు కావాల‌ని ఆశిస్తున్న‌ట్లు భార‌త్‌లో వాట్ప‌ప్ ప్ర‌తినిధి చెప్పాడు. ఇటీవ‌లే భార‌త్‌ను సంద‌ర్శించిన వాట్స‌ప్ ఫౌండ‌ర్ బ్రెయ‌న్ య‌క్ష‌న్ డిజిట‌ల్ వాలెట్ విష‌|యంపై భార‌త ప్ర‌భుత్వ అధికారుల‌తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.
భార‌త్‌లో ప్ర‌స్తుతం వాట్స‌ప్‌కు 200 మిలియ‌న్ల మంది వినియోగదారులు ఉన్నారు. డిజిట‌ల్ వాలెట్ పెట్ట‌డం ద్వారా వీరింద‌ని త‌మ వైపు తిప్పుకోవాల‌నేది ఆ సంస్థ వ్యూహం. పేటీఎం లాంటి మొబైల్ వాలెట్‌ల‌ను అధిగ‌మించి తాము ఎలా ముందుకెళ్లాల‌న్న దాని మీదే వాట్ప‌ప్ ఇక్క‌డ బ్యాంకు అధికారులు, వ్యుహ‌క‌ర్త‌ల‌తో చ‌ర్చిస్తోంది. భార‌త ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బీహెచ్ఐఎం యాప్‌ను కూడా ఎక్కువ‌మందే డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో వీట‌న్నిటి పోటీని త‌ట్టుకుని వాట్స‌ప్ వాలెట్ ఎలా నిల‌బ‌డుతుందో చూడాలి.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు