• తాజా వార్తలు

గుడ్ మార్నింగ్ మెసేజ్‌ల వ‌ల్ల ఫోన్‌కు ఇంత పెద్ద స‌మ‌స్యా?

పొద్దునే నిద్ర లేవ‌గానే ఇది వ‌ర‌కు దేవుడి ఫొటో చూసేవారు. ఇప్పుడు  చాలామంది స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారు. ఉద‌యం వాట్సాప్‌లో ప్రైవేట్‌గా, గ్రూప్స్‌లో గుడ్ మార్నింగ్ మెసేజ్‌లు అప్ప‌టికే చాలా వ‌చ్చేసి ఉంటాయి.  వీటిని చూసుకుని అబ్బా మ‌న‌కు ఎంత మంది గుడ్‌మార్నింగ్ చెప్పేస్తున్నారో అని మురిసిపోయేవారికి చిన్న ఝ‌ల‌క్‌.. కేవ‌లం ఈ గుడ్ మార్నింగ్‌, గుడ్ నైట్ మెసేజ్‌ల వ‌ల్లే ఇండియాలోని మూడో వంతు స్మార్ట్‌ఫోన్లు అవుటాఫ్ మెమ‌రీ (స్పేస్ లేక‌పోవ‌డం) అయిపోతున్నాయ‌ని ఓ రిపోర్ట్  తేల్చిచెప్పింది. 
10 రెట్లు పెరిగిన గూగుల్ సెర్చ్‌
డేటా చౌక‌వడంతో ఇండియాలో స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌లో ఇంట‌ర్నెట్ యూసేజ్ బాగా పెరిగింది. పెద్ద‌గా చదువురానివారు కూడా వాట్సాప్‌, ఫేస్‌బుక్ వాడుతున్నారు.  ఇలా కొన్ని కోట్ల మంది యూజ‌ర్ల‌లో ఎక్కువ మంది గుడ్‌మార్నింగ్‌, గుడ్‌నైట్ మెసేజ్‌లు ఒక‌రికి ఒక‌రు పంపుకుంటున్నారు.  సూర్యుడు ఉద‌యిస్తున్న‌వి, సూర్యాస్త‌మ‌యం బొమ్మ‌లు, టీ క‌ప్పులు, పువ్వులు, ప‌సిపిల్ల‌లు, ప‌క్షులు, ర‌క‌ర‌కాల గ్రాఫిక్స్‌తో కూడిన‌వి ఇలా ర‌క‌ర‌కాల మెసేజ్‌లు పంపిస్తున్నారు. గ‌త ఐదేళ్ల‌లో గుడ్‌మార్నింగ్ మెసేజ్‌ల కోసం గూగుల్‌లో సెర్చ్‌ల సంఖ్య 10 రెట్లు పెరిగిందంటే ఎంత ఎక్కువ‌గా మెసేజ్‌లు పంపుకుంటున్నారో అర్ధ‌మ‌వుతోంద‌ని వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ చెప్పింది. వీట‌న్నింటితో ఇండియాలోని ప్ర‌తి మూడు సెల్‌ఫోన్ల‌లో ఒకదానిలో స్పేస్ నిండిపోతుంద‌ని  డేటా స్టోరేజ్ కంపెనీ వెస్ట్ర‌న్ డిజిట‌ల్ కార్పొరేష‌న్ తేల్చింది. ఈ ప్రాబ్ల‌మ్ క్లియ‌ర్ చేయ‌డానికే వాట్సాప్ స్టేట‌స్ ఫీచ‌ర్‌ను తెచ్చింది.   దీంతో యూజ‌ర్ త‌న స్టేట‌స్లో గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజ్ పెడితే అత‌ని కాంటాక్స్ట్ అంద‌రికీ క‌నిపిస్తుంది.
న్యూ ఇయ‌ర్ గ్రీటింగ్స్‌లోనూ మ‌న‌దే రికార్డ్‌
న్యూఇయ‌ర్ గ్రీటింగ్స్ విష‌యంలోనూ ఇండియ‌న్ల‌దే రికార్డ‌ని వాట్సాప్ ప్ర‌క‌టించింది. న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా విషెస్ చెప్పుకోవ‌డానికి ఇండియ‌న్స్ వాట్సాప్‌లో 20 బిలియ‌న్స్ (2వేల కోట్ల‌) మెసేజ్‌లు పంపుకున్నార‌ని, ప్ర‌పంచంలో మ‌రే దేశం ఈ ద‌రిదాపుల్లోకి కూడా రాలేద‌ని చెప్పింది.

జన రంజకమైన వార్తలు