• తాజా వార్తలు

రైల్వే ప్రయాణికులకు వరం – IRCTC వికల్ప్

మీలో చాలా మంది రిజర్వు ట్రైన్ లలో ప్రయాణించే ఉంటారు కదా! ఒక్కోసారి మనం రిజర్వు టికెట్ వెయిటింగ్ లిస్టు లో ఉంటే మనకు బెర్త్ దొరక్కపోవచ్చు.అలా మీ లాంటి ఎంతోమంది ప్రయాణికులు వెయిటింగ్ లిస్టు కన్ఫం అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే సమయం లో మీరు వెళ్ళవలసిన మార్గం లో మరొక ట్రైన్ ఖాళీగా వెళ్తూ ఉంటుంది. ఇలాంటి సంఘటనలు మన భారత రైల్వే లో తరచూ జరుగుతూనే ఉంటాయి.
ఇలాంటి పరిస్థితుల ను అధిగమించి ప్రయాణికులకు మేలు చేయడానికి irctc వికల్ప్ అనే ఒక పథకాన్ని ప్రారంభించింది. దాదాపు అందరు వెయిటింగ్ లిస్టు లో ఉన్న ప్రయాణికులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే అనేక పత్రికలు మరియు వెబ్ సైట్ లు ఈ వికల్ప్ పథకం గురించి రాసాయి కానీ మరింత సమగ్రంగా మా కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల కోసం దీనిని ఈ రోజు ఆర్టికల్ లో ఇస్తున్నాం.
వికల్ప్ గురించి ప్రతి రైల్వే ప్రయాణికుడు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు
1. ఉదాహరణకు మీరు విజయవాడ నుండి చెన్నై వైపుకు వెళ్ళే రైలు కి టికెట్ రిజర్వు చేసుకున్నారు అనుకోండి. అయితే అది వెయిటింగ్ లిస్టు లో మీకు దొరికింది. మీ వెయిటింగ్ లిస్టు సుమారు 35 గా ఉంది. మీరు వెళ్ళవలసిన ట్రైన్ విజయవాడ నుండి ఉదయం 7.30 ని. లకు బయలు దేరుతుంది అనుకోండి. అయితే చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత చూసుకుంటే మీ టికెట్ కన్ఫం అవ్వలేదు. మీరేం చేస్తారు. ఏదోలా టిసి ని బతిమలాడుకుని వెళ్దాం లే అనుకుంటారు. అయితే ఇకపై మీకు ఈ తిప్పలు ఉండవు. ఈ వికల్ప్ స్కీం ద్వారా విజయవాడ నుండి చెన్నై వైపుకు ఉదయం 7.30 తర్వాత వెళ్ళే ఏ రైల్ లో ఖాళీ ఉంటే ఆ ట్రైన్ లో మీకు టికెట్ లభిస్తుంది. అది ఏ క్లాస్ అయినా సరే మీకు టికెట్ తప్పనిసరిగా కన్ఫం అవుతుంది.
2. దీనికోసం మీరు ఏ విధమైన అదనపు ఛార్జ్ లు చెల్లించవలసిన అవసరం లేదు. మీరు స్లీపర్ క్లాస్ లో బుక్ చేసుకుంటే మీకు స్లీపర్ రావచ్చు లేదా మీ అదృష్టం బాగుంటే AC లో కూడా బెర్త్ లభించవచ్చు. దీనికి మీరు ఏమీ అదనంగా చెల్లించవలసిన అవసరం లేదు.
3. అంటే మీరు మామూలు ఎక్స్ ప్రెస్ ట్రైన్ లలో బుక్ చేసుకున్నా సరే మీకు ప్రీమియం ట్రైన్ లు అయిన శతాబ్ది మరియు రాజధాని లాంటి ట్రైన్ లలో కూడా టికెట్ లభించవచ్చు.
4. అయితే ఈ వికల్ప్ స్కీం అనేది irctc వెబ్ సైట్ ద్వారా రిజర్వు చేసుకున్న టికెట్ లకు మాత్రమే వర్తిస్తుంది. చార్ట్ ప్రిపేర్ అయిన వెంటనే మీ టికెట్ వెయిట్ లిస్టు లో ఉంటే మీకు వెంటనే sms వస్తుంది. వికల్ప్ స్కీం యాక్టివేషన్ గురించిన వివరాలు మరియు మీ కొత్త ట్రైన్ , కోచ్ , బెర్త్ నెంబర్ లకు సంబందించిన వివరాలు ఈ sms లో ఉంటాయి.
5. మీరు వికల్ప్ స్కీం ను ఉపయోగించవచ్చు లేదా వేరే ట్రైన్ లో కూడా ట్రావెల్ చేయవచ్చు. లేదా మీ టికెట్ ను కాన్సిల్ కూడా చేసుకోవచ్చు. కాన్సిల్ చేసుకున్న టికెట్ లకు మామూలు నిబంధనల ప్రకారం డబ్బు రిఫండ్ అవుతాయి.
6. ఒక్కసారి వికల్ప్ స్కీం ను ఎంచుకున్న తర్వాత మీ కొత్త ట్రైన్ లో మీ క్లాస్ ను అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. మీరు చేసుకునే అప్ గ్రేడ్ లకు నిబంధనల ప్రకారం ఛార్జ్ లు వర్తిస్తాయి. ఉదాహరణకు మీకు మీ దగ్గర 3AC టికెట్ ఉంది. అయితే వికల్ప్ స్కీం క్రింద మీకు క్రొత్త ట్రైన్ లో స్లీపర్ క్లాస్ లభించింది. అయితే మీరు 3AC కి తగ్గ డబ్బు చెల్లించడం ద్వారా క్రొత్త ట్రైన్ లో 3 AC కి మారవచ్చు. ( బెర్త్ లు అందుబాటులో ఉంటేనే ). అయితే వికల్ప్ ద్వారా డిఫాల్ట్ గా వచ్చే బెర్త్ లకు మాత్రం ఏం చెల్లించవలసిన అవసరం లేదు.
7. మీరు వికల్ప్ స్కీం కు ఎస్ చెప్పి కాన్సిల్ చేసుకుంటే సదరు కాన్సిలేషన్ అనేది కన్ఫర్మడ్ బెర్త్ లాగే పరిగణించబడుతుంది కానీ వెయిటింగ్ లిస్టు ఛార్జ్ లు వర్తించవు.
8. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత వికల్ప్ స్కీం ను ఎంచుకున్న వెయిటింగ్ లిస్టు లో ప్రయాణికులకు వేరొక ట్రైన్ లో టికెట్ ఇవ్వబడుతుంది. ఇక మీరు పాత ట్రైన్ లో ఎక్కడానికి వీలు లేదు.
irctc ద్వారా టికెట్ బుక్ చేసుకున్న ప్రతీవారికీ వారు వెయిటింగ్ లిస్టు లో ఉన్న సరే ఎవరికీ ఇబ్బంది కలుగకుండా అందరికీ టికెట్ లభించేలా చేయడమే ఈ వికల్ప్ స్కీం యొక్క ఉద్దేశం గా రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇది ఏప్రిల్ 1 నుండి భారత రైల్వే లలో అమలులోనికి వచ్చింది. అయితే మొదటిగా ప్రయోగాత్మకంగా ఢిల్లీ-లక్నో, ఢిల్లీ – జమ్మూ, మరియు ఢిల్లీ – ముంబై లాంటి కొన్ని రూట్ లలో నవంబర్ 1 నుండీ ప్రారంభించారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే irctc ఎకౌంటు క్రియేట్ చేసుకోండి, ఇకపై మీ టికెట్ వికల్ప్ ద్వారా బుక్ చేసుకోండి. వెయిట్ లిస్టు లో ఉండకండి.

జన రంజకమైన వార్తలు