• తాజా వార్తలు
  •  

స్మార్ట్ ఫోన్ ల రాజ్యం లో రూ 3333/- ల ధరలో లావా ఫీచర్ ఫోన్ సక్సెస్ అవుతుందా?

నేటి మొబైల్ ప్రపంచం లో స్మార్ట్ ఫోన్ లదే హవా! స్మార్ట్ ఫోన్ లు మొబైల్ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. అని అనుకుంటాము కదా! కానీ ఇది ఏ మాత్రం వాస్తవం కాదు. స్మార్ట్ ఫోన్ ల పట్ల వినియోగదారులలో విపరీతమైన క్రేజ్ ఉన్నమాట నూటికి నూరుపాళ్ళు వాస్తవం. కానీ వినియోగం విషయానికి వచ్చేసరికి స్మార్ట్ ఫోన్ లకంటే ఫీచర్ ఫోన్ లనే ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఒక సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. మొత్తం మొబైల్ వినియోగదారులలో ఫీచర్ ఫోన్ ల వాటా 54% ఉండగా స్మార్ట్ ఫోన్ ల వాటా కేవలం 46% మాత్రమే ఉండడం విశేషం. ఫీచర్ ఫోన్ లు ఉపయోగించడానికి చాలా సులువుగా ఉంటాయి. ప్రత్యేకించి కాలింగ్, మెసేజింగ్ సులువుగా ఉంటాయి. ఈ రెండు ఫోన్ లకూ అనుసంధానంగా కొన్ని ఫీచర్ లు ఉన్నప్పటికీ బ్యాటరీ లైఫ్ విషయం లో స్మార్ట్ ఫోన్ లతో పోలిస్తే ఫీచర్ ఫోన్ లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

ఈ నేపథ్యం లో ప్రముఖ మొబైల్ కంపెనీ అయిన లావా ఇంటర్నేషనల్ లేటెస్ట్ గా 4 జి కనెక్టివిటీ తో ఉండే ఫీచర్ ఫోన్ ను లాంచ్ చేసింది. లావా 4 జి కనెక్ట్ M1 గా పిలువబడే దీని ధర రూ 3,333/- లు ఉంటుంది. ఇది కేవలం మరొక ఫీచర్ ఫోన్ మాత్రమే కాదు, ఇదొక ప్రత్యేకమైన ఫోన్. మొబైల్ పరిశ్రమలో మొట్టమొదటి VoLTE సపోర్టేడ్ ఫీచర్ ఫోన్. ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్ లకు కనెక్టివిటీ విషయం లలో ఏ మాత్రం తీసిపోకుండా దీనిని తయారుచేశారు.

ఇది 4 జి కనెక్టివిటీ తో వస్తుంది, కానీ ఇందులో 3 జి సపోర్ట్ ఉండదు. అంటే మీరు ఇందులో రిలయన్స్ జియో సిమ్ ను ఉపయోగించవచ్చు అన్నమాట. తద్వారా మీరు అపరిమిత వాయిస్ కాల్ లను ఏ రకమైన యాప్ లను ఇన్ స్టాల్ చేయకుండానే పొందవచ్చు.

ఇది 2.4 ఇంచ్ డిస్ప్లే ను కలిగిఉంటుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్, 512ఏంబీ ర్యామ్ ,8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, వి జి ఎ కెమెరా, బ్లూ టూత్ మొదలైనవి దీని విశిష్టతలు. ఇక దీని బ్యాటరీ విషయానికొస్తే ఐ ఫోన్ 7 కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. 1750 mAh బ్యాటరీ ని కలిగిఉంటుంది. ఇక ధర విషయానికొస్తే ఇది లభించే ధర లో మనకు నేడు అనేకరకాల స్మార్ట్ ఫోన్ లు కూడా లభిస్తున్నాయి. రిలయన్స్ యొక్క lyf సిరీస్ లో కూడా స్మార్ట్ ఫోన్ లు మనకు ఈ ధరలో అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వాటిలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఉంటుంది కాబట్టి వాటిని స్మార్ట్ ఫోన్ లు అంటున్నారు అంటే తేడా!

అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. స్మార్ట్ ఫోన్ లు రాజ్యం ఏలుతున్న ఈ మొబైల్ ప్రపంచం లో ఈ లావా యొక్క ఫీచర్ ఫోన్ ఈ ధర లో విడుదల అయ్యి నిలబడగలుగుతుందా? విజయవంతం అవుతుందా? అయితే ఖచ్చితంగా ఈ ఫోన్ విజయవంతం అవుతుంది అని లావా ధీమా గా ఉంది. కొన్ని విశ్లేషణలు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

      దేశం లో చాలా మందికి స్మార్ట్ ఫోన్ ను వాడడం రాదు. నిరక్షరాస్యత వలన కావచ్చు, స్మార్ట్ ఫోన్ టచ్ లో ఉండే కన్ఫ్యూజన్ వలన కావచ్చు చాలా మంది స్మార్ట్ ఫోన్ ను వాడడం ఇబ్బందిగా భావిస్తారు. కొంతమంది సోషల్ మీడియా నుండి దూరంగా ఉండడానికి ఫీచర్ ఫోన్ లను ఉపయోగిస్తారు. చాలా మందికి అసలు స్మార్ట్ ఫోన్ ను వాడవలసిన అవసరమే ఉండదు. అలాంటపుడు దానిని కొనడం ఎందుకు అనే భావనలో ఉంటారు. గ్రామీణ ప్రాంతాలలో ఫీచర్ ఫోన్ ల హవా నే ఇంకా నడుస్తూ ఉంది. ఈ నేపథ్యం లో ఇన్ని రకాలుగా చూసుకుంటే ఈ ఫీచర్ ఫోన్ విజయవంతం కావడం పెద్ద విషయం ఏమీ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే రిలయన్స్ కూడా ఇదే విధంగా అలోచించి అతి తక్కువ ధరలో అతి త్వరలో ఒక ఫీచర్ ఫోన్ ను అందుబాటులోనికి తీసుకురానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి సవివరమైన వ్యాసాన్ని కంప్యూటర్ విజ్ఞానం ఇంతకుముందే ప్రచురించడం జరిగింది. ఈ పరిస్థితులలో లావా 4 జి కనెక్ట్M1 ఫోన్ తప్పకుండా విజయం సాధిస్తుందని యాజమాన్యం ధీమాగా ఉంది. ఇది కనుక విజయవంతం అయితే ఈ సంవత్సరాంతం కల్లా సరికొత్త టెక్నాలజీ లతో కూడిన అనేకరకాల ఫీచర్ ఫోన్ లను మనం చూడబోతున్నాము అన్నమాట!

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు