• తాజా వార్తలు

రిలయెన్స్ జియొ అత్యవసరంగా పరిష్కరించాల్సిన 5 సమస్యలు

భారత టెలికాం రంగాన్నిఒక ఊపు ఊపేస్తున్న అంశం రిలయన్స్ జియో. అవును గత కొన్ని రోజుల నుండీ ఈ రిలయన్స్ జియో సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతాకాదు. సాంకేతిక మీడియా అయితే టెక్నాలజీ లో ఇక వేరే వార్తలు ఏవీ లేనట్లు కొన్ని రోజుల నుండీ పాఠకులకు జియో భోజనమే వండి వారుస్తుంది. ఇక మన తెలుగు సాంకేతిక మీడియా అయితే రిలయన్స్ జియో కి తామే బ్రాండ్ అంబాసిడర్ అన్న రీతిలో రోజూ అవే వార్తలు రాస్తూ తెలుగు పాఠకుల సహనానికి పరీక్షపెడుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే అసలు ఈ జియో రాక గురించీ అది ప్రవేశ పెట్టబోయే పథకాల గురించీ తెలుగు సాంకేతిక పాఠకులకు మొట్టమొదట గా అందించింది కంప్యూటర్ విజ్ఞానమే. అయితే ప్రగల్భాలు చెప్పడం మా నైజం కాదు కాబట్టి మేము ఎక్కడా మేమే చేసాం అని చెప్పుకోవడం లేదు, మాకు అంత అవసరం లేదు కూడా.
http://www.computervignanam.net/fullnews.php?number=103

ఇప్పటికే 50 లక్షల మంది వినియోగదారులను కలిగి ఉండి,10 కోట్ల వినియోగదారులే లక్ష్యం గా జియో  దూసుకుపోతుంది. ఇక్కడ వరకూ బాగానే ఉంది, కానీ రిలయన్స్ జియో ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతుందా? జియో ప్రకటించిన ఆఫర్ లను చూసి ఆ లక్ష్యాన్ని చేరడం పెద్ద కష్టమేమీ కాదు అని అందరూ భావించారు. అయితే కొన్ని సమస్యలు జియో ను చుట్టుముడుతున్నాయి. అట్టహాసంగా లాంచ్ చేసినప్పటికీ అదే స్థాయి లో కొనసాగించడం లోనే అసలు సమస్య అంతా ఉంది. అర్జంటుగా రిలయన్స్ జియో పరిష్కరించ వలసిన కొన్ని సమస్యల గురించి ఇక్కడ ఇస్తున్నాం. వీటిని అతి త్వరలోనే జియో యాజమాన్యం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం.లేని పక్షం లో ఎదో ఒక రూపం లో ఈ సమస్యలను మా కంప్యూటర్ విజ్ఞానం ప్రస్తావిస్తూనే ఉంటుంది.

వాయిస్ కాల్ ల వైఫల్యం

ఇంటర్ కనెక్టివిటీ కి సంబందించిన అంశం లో ప్రస్తుతం ఉన్న టెలికాం ఆపరేటర్ లైన ఎయిర్ టెల్, వోడా ఫోన్, ఐడియా లతో జియో కి వివాదం ఉంది. ఇవి కాల్ డ్రాప్ లకు పాల్పడుతున్నాయని ట్రాయ్ కి వీటి పై జియో ఫిర్యాదు చేసింది.సెప్టెంబర్ 22 న జియో సమర్పించిన నివేదిక ప్రకారం జియో వినియోగదారులు చేసిన 15 కోట్ల ఫోన్ కాల్ లలో 12 కోట్లు ఫెయిల్ అయ్యాయి. ఎయిర్ టెల్ కు జియో నుండి వచ్చిన కాల్ లలో సుమారు 4.8 కోట్ల కాల్ లు అంటే 78.4 శాతం ఫెయిల్ అయ్యాయి. ఈ వరుసలో వోడా ఫోన్ ముందంజ లో ఉంది. దానికి జియో నుండి వచ్చిన 4.69 కాల్ లలో 84.1 శాతం అంటే 3.95 కోట్ల కాల్లు ఫెయిల్ అయ్యాయి.ఐడియా కి వచ్చిన 4.39 కోట్ల కాల్ లలో 3.36 కాల్ లు ఫెయిల్
అయినట్లు ఆ నివేదికలో జియో పేర్కొంది. అయితే జియో కాల్ ల వైఫల్యం లో తమ తప్పేమీ లేదు అనీ అది కేవలం జియో యొక్క స్వయం కృతాపరాధం అనీ లాంచ్ చేసినంత అట్టహాసం గా  నెట్ వర్క్ను సిద్ద పరచకపోవడం వల్లనే ఈ సమస్య అని తేల్చి చెప్పేసింది. ఇదంతా ప్రీ లాంచ్ స్టేజి లో చూసుకోకుండా ఇప్పుడు వేరే వాళ్ళ ను నిందించడం సరికాదని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ జియో ఈ వాయిస్ కాల్ ల వైఫల్యం నుండి బయటపడక పోతే అది మామూలు టెలికాం ఆపరేటర్ లానే మిగిలి పోయే అవకాశం ఉంది.

తగ్గిపోయిన ఇంటర్ నెట్ స్పీడ్

రోజురోజుకీ జియో యొక్క వినియోగ దారులు పెరిగి పోతూ ఉండడంతో దాని ప్రభావం నెట్ వర్క్ స్పీడ్ పై పడింది. జియో లాంచ్ అయిన మొదట్లో 50mbpsగా ఉన్న ఇంటర్ నెట్ స్పీడ్ క్రమక్రమం గా 6-10 mbpsకు పడిపోయింది.పేపర్ మీద చూస్తే ఈ వ్యత్యాసం చాలా ఎక్కువగా కనిపించినప్పటికీ వినియోగదారుని కోణంలో చూస్తే 8 mbps స్పీడ్ అంటే చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఈ స్పీడ్ తరచుగా మారుతూ ఉండడంతో వినియోగదారులకు కొంచెం ఇబ్బందిగా ఉందనేది మాత్రం వాస్తవం. ఒక్కోసారి లొకేషన్ లో మార్పు లేకపోయినా సరే ఇంటర్ నెట్ స్పీడ్లో భారీ వ్యత్యాసం కనపడుతుంది. 

చికాకు పెట్టె జియో యాప్స్ 

రిలయన్స్ జియో యొక్క యాప్స్ ఏవీ ఒక స్థిరమైన ప్రదర్శన ను ఇవ్వడం లేదు. కాకపోతే ఉచిత కాంటెంట్ అనే ఆలోచన మాత్రం భారతీయ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. జియో టీవీ యాప్ అయితే తరచూ క్రాష్ అవుతూ ఉంది.ఇది ఈ యాప్ ఒక్కదానికే పరిమితం కాదు దాదాపు గా అన్ని యాప్ లూ ఇదే సమస్యను ఎదుర్కొన్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. జియో 4 జి వాయిస్ అనే యాప్ అన్నింటి కంటే ఇబ్బంది పెట్టె యాప్ తయారయింది అనేది వినియోగదారుల వాదన. ఇది ఒక్కోసారి లోడ్ అవ్వడానికి ఫెయిల్ అవుతూ ఉంటుంది.

పాత మోడల్ ఫోన్ లలో లోపించిన VOLTE

VOLTE టెక్నాలజీ ఉన్న ఫోన్ లేక్ జియో సపోర్ట్ చేస్తుంది అని మొదట్లో ప్రకటించారు, అయితే ఆ తర్వాత జియో 4 జి వాయిస్ యాప్ ద్వారా ఈ టెక్నాలజీ లేకపోయినా సరే పాత మోడల్ ఫోన్ లు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని జియో ప్రకటించింది. అయితే మనం పైన ప్రస్తావించినట్లు ఈ యాప్ అత్యంత చికాకు పెడుతున్న నేపథ్యం లో సహజంగానే పాత మోడల్ లనుండి చేసే వాయిస్ కాల్ లు ఫెయిల్ అవుతున్నాయి. ఎక్కువ మంది భారత వినియోగదారులు ఇప్పటికీ 3 జి ఫోన్ లనే వాడుతూ ఉండడం తో ఈ జియో వలన వారికి ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది.

బాటరీ సమస్య 

రిలయన్స్ జియో తన ఇంటర్ నెట్ సేవలను 4జి బ్యాండ్ పై ప్రారంభించింది. అదికూడా 2 జి 3 జి రేట్ ల లోనే.కొత్త వినియోగదారులందరూ జియో వైపే మొగ్గుతున్నారు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ 4 జి అనేది బాటరీపై చాలా ప్రభావం చూపుతుంది. జియో 4జిని వాడడం వలన బాటరీ తొందరగా అయిపోతుందని ఫిర్యాదులు అందుతున్నాయి.దీనికి ఒకే ఒక్క పరిష్కారం రిలయన్స్ టెలి కం యొక్క 2 జి 3 జి సర్వీస్ లను 4 జి లో కలిపివేయడమే. ఈ పై సమస్య లన్నింటికీ అతిత్వరలోనే జియో పరిష్కారం చూపుతుందని ఆశిద్దాం.

 

జన రంజకమైన వార్తలు