• తాజా వార్తలు

డేటా చౌర్యం నిరోధానికి రష్యా తెచ్చింది టైగా స్మార్ట్‌ఫోన్‌

స్మార్ట్‌ఫోన్‌... దీంతో ఎంత ప్ర‌యోజ‌నం ఉందో అంత అన‌ర్థం కూడా ఉంది. మ‌నం ఎంతో విలువైన స‌మాచారం దీనిలో దాస్తాం. ఎన్నో లావాదేవీలు ఈ ఫోన్ల ద్వారా నిర్వ‌హిస్తాం. కానీ మ‌నం ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా హ్యాక‌ర్ల బారిన ప‌డ‌కుండా ఉండ‌డం అనేది అదృష్ట‌మే. ఎందుకంటే ఒక‌సారి మ‌న ఫోన్ ఇంట‌ర్నెట్‌తో క‌నెక్ట్ అయిన త‌ర్వాత డివైజ్ మ‌న చేతుల్లో ఉన్నా.. దాన్ని న‌డించే అవ‌కాశం వేరే వాళ్ల‌కు ఇచ్చిన‌ట్లే. ఈ ఇబ్బంది నేప‌థ్యంలో ర‌ష్యా ఒక కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. మ‌న ఫోన్‌లో డేటాను భ‌ద్రంగా ఉంచ‌డానికి, నిఘా క‌ళ్ల‌కు చిక్క‌కుండా చేయ‌డానికి టైగా స్మార్ట్‌ఫోన్ల‌ను బ‌రిలో దించింది ర‌ష్యా.

ఐ ఫోన్ క‌న్నా ధ‌ర తక్కువే...
హ్యాక‌ర్లు, అంత‌ర్ శ‌త్రువుల నుంచి దేశ స‌మాచారం బ‌య‌ట‌కు పొక్క‌కుండా ఉండ‌టానికి ర‌ష్యా ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ఫోన్ల ద్వారా విలువైన స‌మాచారం బ‌య‌ట‌కు వెళ్లే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో టైగా స్మార్ట్‌ఫోన్ నిరోధిస్తుంద‌ని ఆ దేశం భావిస్తోంది. ఇన్ఫోవాచ్ గ్రూప్ ఈ కొత్త త‌ర‌హా స్మార్ట్‌ఫోన్‌ను త‌యారు చేసింది.  దీని ధ‌ర 15,000 రూబుల్స్ (260 డాల‌ర్లు). అంటే ఐఫోన్ కన్నా త‌క్కువ ధ‌రే.  కార్పొరేట్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఫోన్‌ను త‌యారు చేసిన‌ట్లు కాస్ప‌ర్‌స్కై ల్యాబ్ కో ఫౌండ‌ర్ న‌ట‌ల్యా తెలిపారు.  ర‌ష్యాలోని ద‌ట్ట‌మైన అడ‌వుల‌కు గుర్తుగా ఈ ఫోన్‌ను పూర్తిగా ఆకుప‌చ్చ రంగులో త‌యారు చేశారు.

యూఎస్ వ్యూహాల‌ను తిప్పి కొట్టేందుకు..
కాస్ప‌ర్‌స్కై కొత్త ఫోన్ వెనుక రాజ‌కీయ ఆలోచ‌న‌లు కూడా ఉన్నాయి. గ‌త కొన్ని నెల‌లుగా ఈ సంస్థ విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతోంది. అమెరికాలో దీన్ని నిషేధించారు కూడా. కార‌ణం సున్నిత‌మైన స‌మాచారాన్ని ఈ సాఫ్ట్‌వేర్ చేర‌వేస్తుంద‌నే ఆరోప‌ణ‌లే.  దీంతో యుఎస్ త‌న అప్రూవ్డ్ వెండ‌ర్స్ జాబితా నుంచి కాస్ప‌ర్‌స్కైను తొల‌గించింది. అమెరికా చ‌ర్య‌ల‌ను నిర‌సిస్తూ త‌మ దేశంలో ఎంత ప‌టిష్ట‌మైన నిఘా ఉందో తెలియ‌జెప్ప‌డానికి ర‌ష్యా వ్యూహ‌ర‌చ‌న చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ల నుంచే ఆ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగానే  ఈ కొత్త ఫోన్‌ను విడుద‌ల చేసింది. 

జన రంజకమైన వార్తలు