అత్యధిక ధర ఉన్న స్మార్ట్‌ఫోన్ ఏమిటి?.. అందరికి యాపిల్ ఫోన్ మాత్రమే తడుతుంది. కానీ యాపిల్‌కు పోటీగా చాలా ఫోన్లు బరిలో ఉన్నాయి. భారీ ధరలతో ముందుకొస్తున్నాయి. కానీ కాస్ట్లీ ఫోన్లు అనగానే గుర్తుచ్చేది మాత్రం యాపిలే. అయితే శాంసంగ్ ఒక కొత్త ఫోన్‌ను రంగంలోకి తీసుకొస్తోంది దాని ధర 940 డాలర్లు. అంటే దాదాపు 1000 డాలర్లు! మరి 1000 డాలర్ల ఫోన్లు పుట్టడం దేనికి సంకేతం. ఇంత విలువైన ఫోన్లు జనరేట్ కావడం వెనుక ఆంతర్యం ఏమిటి?
యాపిల్ వర్సెస్ శాంసంగ్
యాపిల్, శాంసంగ్ కంపెనీల మధ్య చాలా కాలంగా భారీ వార్ నడుస్తోంది. ముఖ్యంగా ఫోన్ల విషయంలో ఒకదాన్ని మించి మరొకటి ముందుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నువ్వంతంటే నేనింత అన్నట్లుగా ఫోన్లను తయారు చేసి మార్కెట్లో వదులుతున్నాయి. యాపిల్ ఐఫోన్లు ఇప్పటికే ఎక్కువ ధర శ్రేణికి చెందిన వాటిగా గుర్తింపు సంపాదించాయి. శాంసంగ్‌లో గెలాక్సీ ఫోన్లు ఎక్కువ ధర పలుకుతున్న ఫోన్లుగా నిలిచాయి. శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ధరను ఆ సంస్థ ఏకంగా 940 డాలర్లు పెట్టడమే చర్చనీయాంశం అయింది. ఈ శాంసంగ్ మొబైల్‌కు పోటీగా యాపిల్ కూడా మరింత ధరతో ఐఫోన్‌ను తీసుకురావాలని యాపిల్ ప్రయత్నాలు చేస్తోంది. దీని ధర యూఎస్‌లో 1000 డాలర్లు ఉండే అవకాశాలు ఉన్నాయని ఆ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఐఫోన్ పదో వార్షికోత్సవం సందర్భంగా భారీ ధరలతో ఫోన్లను మార్కెట్లోకి తీసుకు రావడానికి యాపిల్ వ్యూహరచన చేస్తోంది.
టెక్నాలజీయే కారణం
ఇంత ధరలు పెట్టి యాపిల్, శాంసంగ్ ఫోన్లను తయారు చేయడానికి ఏంటి కారణం? .. దీనికి ప్రధాన కారణం ఆ ఫోన్లలో వాడే టెక్నాలజీనే. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగానే ఈ ఫోన్లలో అధునాతన టెక్నాలజీని వాడడమే ఫోన్ ధరలు పెరగడానికి కారణమైంది. ఇవి ల్యాప్‌టాప్, కంప్యూటర్లకు రీప్లేస్మెంట్స్ కాకపోయినా.. దాదాపు అవి చేసే అన్ని పనులను ఫోన్లే చేయడం వీటి ప్రత్యేకత. మెమరీ దగ్గర నుంచి ఫీచర్ల వరకు ఏదీ ల్యాప్‌టాప్‌కు తగ్గకుండా ఉండడమే ఈ ఫోన్ల స్పెషాలిటీ. శాంసంగ్ నోట్ 8లో 6.3 అంగుళాల స్క్రీన్ ఉంది. ఇదే ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెద్ద ఫోన్ స్క్రీన్. యాపిల్‌లోనూ ఓఎల్ఈడీ సూపర్ షార్ప్ స్క్రీన్ ఉంది. ఇవి మచ్చకు కొన్ని ఫీచర్లు మాత్రమే ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో ఎక్స్క్యూజివ్ ఫీచర్లు ఈ ఖరీదైన ఫోన్ల సొంతం. మరీ వార్ ఎక్కడి వరకు వెళుతుందనేది ఆసక్తికరం.