• తాజా వార్తలు
  •  

ఆగ్మెంటెడ్ రియాలిటీ... స్మార్టు ఫోన్లలో కొత్త శకానికి నాంది

ప్రపంచంలోని సమస్త సాంకేతికతలను తమలో నింపుకొంటున్న స్మార్టు ఫోన్లు ఇప్పుడు మరో కొత్త టెక్నాలజీని నింపుకొని సరికొత్త అనుభూతులను, అనుబంధ సేవలను అందించడానికి రెడీ అవుతున్నాయి.  ‘లెనోవో’  సంస్థ తాజాగా రిలీజ్ చేస్తున్న ‘ఫ్యాబ్ 2 ప్రో’తో స్మార్టు ఫోన్లలో సరికొత్త శకం ఆరంభం కానుంది. ‘ఆగ్మెంటెడ్ రియాలిటీ’(ఏఆర్) సాంకేతికతతో వస్తున్న తొలి స్మార్టు ఫోన్ గా టెక్ ప్రియుల్లో ఆసక్తి నింపుతున్న లెనోవో ఫ్యాబ్ 2 ప్రో రానే వస్తోంది.. ఒక్క లెనోవోయే కాదు ఈ ఏడాది ఆసస్ కూడా ఆగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికతతో ఫోన్ ను రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల నిర్వహించిన కంజ్యూమర్ ఎలక్ర్టానిక్ షోలో ప్రకటించింది కూడా.  మిగతా సంస్థలూ ఇదే బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ అసలు సంగతేంటన్నది తెలుసుకుంటే కొద్దికాలంలోనే ఇది ప్రపంచాన్ని కమ్మేయడం ఖాయమన్న భావన కలుగుతోంది.

వినడానికి వర్చువల్ రియాలిటీలా అనిపిస్తున్నా దానికీ ఆగ్మెంటెడ్ రియాలిటీకీ తేడా ఉంది. అదే సమయంలో సారూప్యతలూ ఉన్నాయి.  వర్చువల్ రియాలిటీతో పరిచయం చాలామందికి పరిచయం, అనుభవం ఉన్నా ఆగ్మెంటెడ్ రియాలిటీ గురించి మాత్రం చాలా కొద్దిమందికే తెలుసు.  రెండేళ్ల కిందటే దీనికి ప్రాణం పోసినా గత ఏడాది ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన పోకేమాన్ గో గేమ్ తరువాత మాత్రమే ఈ పేరు బాగా వినిపిస్తోంది.  అయితే, ఇది కేవలం గేమింగ్ కు మాత్రమే పనికొచ్చే సాంకేతిక అనుకోవడానికి వీల్లేదు. యుటిలిటీ బేస్డ్ సర్వీసెస్ కోసం ఆగ్మెంటెడ్ రియాలిటీని వినియోగించుకోవడానికి అన్ని అవకాశాలూ కనిపిస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో ఏఆర్ మన జీవితంలో కీలక సాంకేతికతగా మారే సూచనలూ ఉన్నాయి.

వర్చువల్ రియాలిటీకి, ఆగ్మెంటెడ్ రియాలిటీకి జనరల్ నాలెడ్జికి, జనరల్ అవేర్ నెస్ కు ఉన్నంత తేడా ఉంది. ఒక విషయం గురించి ఒకట్రెండు సమాచారాలు మాత్రమే తెలిస్తే అది జనరల్ నాలెడ్జి.. అలా కాకుండా ఆ విషయానికి సంబంధించిన అనుబంధ నాలెడ్జి కూడా ఉంటే అది జనరల్ అవేర్ నెస్ అని చెప్పొచ్చు. ఆగ్మెంటెడ్ రియాలిటీ కూడా అలాంటిదే.  అంతేకాదు... వర్చువల్‌ రియాలిటీ అంతా కల్పన. ఊహా ప్రపంచం.. వాస్తవానికి అక్కడ చోటే లేదు.  కానీ, ఆగ్మెంటెడ్ రియాలిటీలో నిజంగానే కొంత రియాలిటీ  ఉంటుంది. వాస్తవిక ప్రపంచంతో ఇది ముడిపడి ఉంటుంది. ఒక్క మాటతో చెప్పాలంటే కంటితో పూర్తిగా చూడలేనిది, ఆగ్మెంటెడ్ రియాలిటీలో చూడొచ్చన్నమాట. మరో ప్రపంచాన్ని మన కళ్లముందు నిలబెట్టే సాంకేతికత ఇది.

ప్రస్తుతం లెనోవో ఫోన్లో ఉన్న ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫీచర్ కొంత పరిమిత సేవలే అందిస్తున్నా ఈ టెక్నాలజీ మాత్రం నిత్యజీవితంతో ముడిపడి ఉన్న అన్ని రంగాల్లోనూ విస్తారంగా ఉపయోగపడే సత్తా ఉన్నది.  ఏఆర్ టెక్నాలజీలో 3డీ విజువల్స్ మనకు విషయాలను వాస్తవాలుగా చూపిస్తుంది. ఉదాహరణకు... ఈ ఏఆర్ టెక్నాలజీ ఉన్న ‘లెనొవొ ఫ్యాబ్‌2 ప్రో’ ఫోన్ కెమెరా తో  ఏదైనా ఫోటో తీశాం అనుకోండి. అ ఫొటో సాధారణ ఫొటోల్లా కనిపించదు. 3డీ రూపంలో కనిపిస్తుంది. ఇందులో గూగుల్ టాంగో టెక్నాలజీతో పనిచేసే సెన్సార్లు, ఫిష్ ఐ కెమేరా చిత్రాన్ని 3డీ రూపంలో చూపిస్తాయి. అంతేకాదు.. ఫొటో తీసిన  వస్తువు యొక్క ఎత్తు, పొడవు, పరిమాణం వంటివన్నీ లెక్కించేస్తాయి.

వర్చువల్ రియాలిటీ అనేది కృత్రిమ పరిసరాలను సృష్టించి చూపిస్తుంది. కానీ, ఆగ్మెంటెడ్ రియాలిటీలో పరిస్థితి వేరు..  ఉన్న పరిసరాలను డిజిటల్ రియాలిటీలో చూపడమే కాకుండా వస్తువుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని వెల్లడిస్తుంది.   ఉదాహరణకు ఒక పెద్ద భవనంలోని పదో అంతస్తులో ఉన్న ఒక ఆఫీసుకు మీరు వెళ్లాలనుకున్నారనుకోండి... ముందుగా అక్కడకు వెళ్లి రిసెప్టన్ లో వివరాలు కనుక్కుంటే కానీ వెళ్లాల్సిన చోటికి వెళ్లలేరు. కానీ.. ఫోన్లో ఏఆర్ యాప్ ఉంటే  ఆ భవనాన్ని దూరం నుంచి ఫొటో తీస్తే చాలు. అందులో ఎన్ని అంతస్తులున్నాయి.. ఏ అంతస్తులో ఏముంది.. వంటి పూర్తి విరాలు ఫోన్లో ప్రత్యక్షమవుతాయి.  అయితే... మీరు ఫొటో తీసిన భవనానికి ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ సపోర్టు ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది.  పలు దేశాల్లో ఇలాంటి టెక్నాలజీ ఇప్పటికే స్పీడందుకుంది. చాలా చోట్ల వాణిజ్య భవనాలు, భారీ కాంప్లెక్సులకు ఏఆర్ టెక్నాలజీ ఎనేబుల్ చేస్తున్నారు.

ఏఏ రంగాల్లో వాడుతున్నారు..

ఏఆర్ ను గేమింగ్ లో బాగా వినియోగిస్తున్నారు. పోకేమాన్ గో తరువాత ఈ రంగంలో ఏఆర్ విపరీతంగా స్ప్రెడ్ అయింది.
హెల్త్ కేర్, పబ్లిక్ సేఫ్టీ, గ్యాస్, ఆయిల్, టూరిజం, మార్కెటింగ్ వంటి రంగాల్లోనూ చాలా దేశాల్లో ఏఆర్ టెక్నాలజీని వాడుతున్నారు.
విద్యా బోధన స్మార్టుగా మారుతున్న క్రమంలో ఆ రంగంలో ఏఆర్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు.
హైదరాబాదుకు చెందిన ఇన్నోవేర్ ఐటీ సొల్యూషన్స్ అనే సంస్థ  ఆర్నిమల్ అనే ఏఆర్ ప్రాడెక్టు కొద్దికాలం కిందట లాంచ్ చేసింది. సైఫికిడ్స్ అనే యాప్ ద్వారా ఆల్పాబెట్ కార్డుల్లో పొందుపరిచిన త్రీడీ చిత్రాలు చిన్నారులను ఆకట్టుకుంటూ తొందరగా నేర్చుకునేలా చేస్తున్నాయి. సాధారణంగా ఏ ఫర్ యాంట్, బీ ఫర్ బఫెలో అంటూ పిల్లలకు ఆల్ఫబెట్సు, పదాలు నేర్పిస్తుంటరారు. కానీ.. ఈ ఏఆర్ ప్రాడెక్టు మరింత ప్రభావవంతంగా పిల్లలను విద్యవైపు మళ్లిస్తోంది.  ఇందులో సీ అనగానే క్యాట్ వ్తుంది.. అది పిల్లలతో ఇంటరాక్ట్ కూడా అవుతుంది. రన్ బటన్ నొక్కితే పరిగెత్తుతుంది. వాక్ ప్రెస్ చేస్తే నడుస్తుంది. హిస్టరీ టచ్ చేస్తే దాని చరిత్ర అదే చెప్తుంది. అలా ఏ టు జడ్  వరకు ప్రతి అక్షరానికి ఒక జంతువు లేదా పక్షితో కనెక్ట్ చేసి ఏఆర్ టెక్నాలజీని విద్యారంగంలో వాడుతున్నారు.

ఏఆర్ యాప్ లూ వచ్చేశాయి..

ఏఆర్ ఎనేబుల్డ్ తొలి ఫోన్ లెనోవో ఫ్యాబ్ 2 ప్రో అయినప్పటికీ ఏఆర్ టెక్నాలజీ మాత్రం ఇప్పటికే స్మార్టుఫోన్లలోకి వచ్చేసింది. యాప్ ల రూపంలో ఇప్పటికే ఏఆర్ టెక్నాలజీ ఉంది.  కొత్త అనుభూతిని కలిగించేవ, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించే ఏఆర్‌ యాప్‌లు ఇప్పటికే ఉన్నాయి.

ఫీల్డ్‌ ట్రిప్‌:  ఇది టూరిజం యాప్‌.  దీంతో ప్రముఖ ప్రదేశాలను.. కట్టడాలను చూస్తే వాటి గురించి పూర్తి వివరాలను పక్కనే చూపిస్తుంది. ఉదాహరణకు.. ఈ యాప్‌ను ఓపెన్‌ చేసి తాజ్‌మహల్‌ను కెమెరాతో చూస్తే.. స్క్రీన్‌పైనే తాజ్‌మహల్‌కు సంబంధించిన చరిత్ర, ప్రత్యేకతలు డిస్‌ప్లే అవుతాయి.  ఏదైనా హోటల్ ను ఫొటో తీస్తే  అక్కడి మెనూ, గదుల వివరాలు అన్నీ వచ్చేస్తాయి. దీంతో కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు గైడ్‌ లేకున్నా అన్ని వివరాలను తెలుసుకునే వీలుంటుంది.

స్కై గైడ్‌:   నక్షత్రాలు..  గ్రహాలు.. ఉపగ్రహాల విశేషాలను.. కక్ష్యల్లో వాటి స్థానాల గురించి పూర్తి వివరాలను ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు.  అంతేకాదు.. మనం వాటి మధ్య విహరిస్తున్న ఫీల్ కూడా ఉంటుందట.

యెల్ప్:  ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీతో పనిచేసే ఈ యాప్‌ ను  మనం ఎక్కడికైనా కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఉపయోగించుకోవచ్చు.  వెళ్లే దారిలో ఫోన్‌లో ఈ యాప్‌ను తెరిచి కెమెరాతో చుట్టూ చిత్రీకరిస్తే మన చుట్టూ ఉన్న భవనాల్లో ఏది రెస్టారెంటు? అందులో ఏ పదార్థాలు దొరుకుతాయి? అన్న విషయాలు చెప్పేస్తుంది.  ఫోన్‌ను భూమికి సమాంతరంగా ఉంచితే  దగ్గరలోని రెస్టారెంట్లకు రూట్‌ మ్యాప్‌లను చూపిస్తుంది.

ఇవేకాదు.. గూగుల్ కూడా లెనోవో ఫోన్ కు పనికొచ్చేలా 32 ఏఆర్ యాప్ లను రిలీజ్ చేసింది.  వాటిని గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
లండన్ కు చెందిన బ్లిప్లర్ సంస్థ స్మార్ట్‌ఫోన్లకు ఏఆర్ యాప్ లను రిలీజ్ చేయడంలో ముందుంది. రీసెంటుగా అది ఏఆర్ సహాయంతో వ్యక్తుల ముఖాన్ని మీ స్మార్ట్‌ఫోన్ గుర్తించగలిగే సదుపాయాన్ని తీసుకొచ్చింది.  ‘ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫేస్ ప్రొఫైల్’ అనే ఈ ఫీచర్ తో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్త సెలబ్రిటీలను గుర్తించే వీలుంది.

"

జన రంజకమైన వార్తలు