• తాజా వార్తలు

ఫిట్ నెస్ దారిలో వర్చువల్ రియాలిటీ


మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా శరీరానికి వ్యాయామం కరవవుతోంది. సో... పని గట్టుకుని వ్యాయామం చేస్తేనే ఫిట్ నెస్ సొంతమవుతుంది. జిమ్ కు వెళ్లడానికి, బయట వాకింగ్ కు వెళ్లడానికి సమయం లేనివారంతా ఇంట్లోనే ఫిట్ నెస్ సైకిల్ తొక్కుతుంటారు. ఇలాంటివారికి క్రమేణా ఆసక్తి తగ్గుతుంటుంది. ఏదో ఒక వంకతో, ఇతర పనుల వలనో మానేస్తుంటారు. ఇంట్లోనే ఇలా సైక్లింగ్ చేసేవారు బోర్ కొట్టి డ్రాపౌట్లుగా మారుతుంటారు. ఇలాంటివారి కోసం ప్రత్యేకంగా, బోర్ కొట్టకుండా వర్చువల్ రియాలిటీ సదుపాయం ఉన్న సైకిల్ ఒకటి రూపొందించారు హైదరాబాద్ కుర్రాళ్లు సూరజ్, జిగ్నేశ్. ఇప్పుడిది సెన్సేషన్ గా మారిపోయింది. ఫిట్ నెస్ కు ఫిట్ నెస్, ఎంజాయ్ మెంట్ కు ఎంజాయ్ మెంట్ అన్నట్లుగా ఉన్న ఈ వర్చువల్ రియాలిటీ సైకిల్ కు క్రేజ్ పెరుగుతోంది.
ఫుల్లీ టెక్నికల్..
ఈ వర్చువల్ రియాలిటీ సైకిల్ ఒక చోట ఫిక్స్డ్ గా ఉంటుంది. దీని వెనుక చక్రానికి లూప్ రియాలీటి కిట్ ఉంటుంది. సైకిల్ తొక్కేటప్పుడు వెనుక చక్రం తిరుగుతుంటుంది... బ్యాక్ వీల్ కు కంప్యూటర్ కనెక్ట్ చేసి ఉంటుంది. దీంతో సైకిల్ పై కూర్చుని వీఆర్ హెడ్ సెట్ పెట్టుకుని తొక్కుతుంటే చాలు.. ఊహా ప్రపంచంలోకి వెళ్లిపోవచ్చు. ఎత్తయిన కొండలు, సముద్ర తీరాలు, నగర వాతావరణం, రేసింగ్ ట్రాకులు.. ఇలా రకరకాల థీమ్స్ ప్రీలోడెడ్ గా ఉంటాయి. దీంతో నచ్చిన మోడ్ సెలక్ట్ చేసుకుంటే సైకిల్ తొక్కుతున్నప్పుడు అచ్చం అదే లొకేషన్ లో విహరిస్తున్నట్టు ఉంటుంది. సైకిల్ కదలికలను బట్టి రియల్ టైంలో ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. వీఆర్ సైకిల్ వెనక చక్రానికి అమర్చిన సిస్టమ్ కు సెన్సర్లు ఉంటాయి. అవి మనిషి కదలికలను గుర్తిస్తాయి. కొండలు ఎక్కుతున్నప్పుడు సైకిల్ కుదుపులకు గురైన ఫీలింగ్ కలుగుతుంది. ఇందుకోసం హై ఎండ్ గ్రాఫిక్స్ ఉపయోగించారు.
క్యాలరీల లెక్క కరెక్టుగా చెప్పేస్తుంది..
ఈ వర్చువల్ ఆనందంతో పాటు శరీరానికి కూడా ఇది మంచిదే. దీనికి లింక్ చేసిన కంప్యూటరే మీ వర్కవుట్ ఎజెండా రూపొందిస్తుంది. రోజుకు ఎన్ని క్యాలరీలు ఖర్చు చేయాలి. ఏ రోజు ఎన్ని క్యాలరీలు కరిగించారు.. ఫిట్ నెస్ టార్గెట్ రీచ్ అవడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది వంటి సమాచారమంతా కంప్యూటర్ ఎప్పటికప్పుడు చూపిస్తుంది.
ఇంకోగొప్ప విషయం ఏంటంటే సైకిల్ తొక్కుతూ తొక్కుతూ చెమటలు బాగా కారిపోయి శరీరం డీహైడ్రేట్ అయితే ఈ కంప్యూటరు పసిగట్టేస్తుంది. వెంటనే అది తిరగడం ఆగిపోతుంది. అంటే ఆటోమేటిగ్గా లాక్ అయిపోతుందన్నమాట. మళ్లీ మీరు నీరు తాగిన తరువాతే అది పనిచేస్తుంది.
టీహబ్ సాయంతో...
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ నుంచి ఈ స్టార్టప్ కు అండ దొరికింది. అంతర్జాతీయ వేదికలపైనా దీన్ని ప్రదర్శించి వీరు అవార్డులు గెలుచుకున్నారు. వీటిని పూర్తిస్థాయిలో కమర్షియల్ గా డెవలప్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

జన రంజకమైన వార్తలు