• తాజా వార్తలు

ఇకపై ఆంధ్రప్రదేశ్ లో హోటల్ లో దిగారా ? వెంటనే పోలీసులకు మెసేజ్ వెళ్ళిపోతుంది ?

మీకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ గురించి తెలుసా? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో గత సంవత్సరం నుండీ జరుగుతున్న టెక్నాలజీ అప్ డేట్స్ ను పరిశీలిస్తున్నారా? అయితే ఖచ్చితంగా మీకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ గురించి తెలిసే ఉంటుంది. విశాఖపట్నం కు చెందిన స్టార్ట్ అప్ అయిన జెబీ డేటా ఇండియా ( జెబీ ) యొక్క పేరు గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ స్టార్ట్ అప్ తన యొక్క ఫ్లాగ్ షిప్ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సొల్యూషన్ ను ఆతిధ్య రంగం కోసం డెవలప్ చేస్తుంది. జెబీ AI చెయిన్ గా పిలువబడే ఈ టెక్నాలజీ హోటల్ కు వచ్చే అతిధుల డేటా సెక్యూర్ గా ఉంచడమే గాక క్రిమినల్ లకు చెందిన కార్యకలాపాలు విస్తరించకుండా పోలీసులకు కూడా సహకరిస్తుంది. దీనికి కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హోటల్ లు అన్నింటికీ ఈ బ్లాక్ చెయిన్ సెక్యూరిటీ సొల్యూషన్ డిప్లోయ్ చేసుకోవాల్సిందిగా పోలీసులు ఆదేశించడం జరిగింది. ఈ మేరకు బ్లాక్ చెయిన్ యాజమాన్యం తరపున మరియు పోలీసు డిపార్టుమెంటు తరపున వేరు వేరు స్టేట్ మెంట్ లను కూడా విడుదల చేయడం జరిగింది.

ఇది ఎలా పనిచేస్తుంది ?

ముందుగా అన్ని హోటల్ లు తమ దగ్గర ఈ టెక్నాలజీ ని అందుబాటులో ఉంచుకోవాలి. హోటల్ లో ఎవరైనా దిగిన వెంటనే వారియొక్క పూర్తి వివరాలు అడ్రస్ ప్రూఫ్ లతో సహా తీసుకోవాలి. ఇది దాదాపుగా అన్ని హోటల్ ల లోనూ ప్రస్తుతం జరుగుతున్నదే. అయితే ఈ జెబీ AI చెయిన్ టెక్నాలజీ హోటల్ లో దిగిన ప్రతీ ఒక్కరి వివరాలను పోలీసు డిపార్టుమెంటు వారికి పంపిస్తుంది. పోలీసులు ఈ వివరాలను తమ దగ్గర ఉన్న నేరస్తుల జాబితాలతో సరిపోల్చడం ద్వారానూ మరియు ఇతర మార్గాల లోనూ పరిశీలిస్తారు. ఏమైనా అనుమానాస్పదంగా అనిపించినా సరే వారి మీద ఒక నిఘా కన్ను వేసి ఉంచుతారు. సాధారణంగా రాష్ట్రం లో గానీ , వివిధ నగరాలలో కానీ నేరాలకు పాల్పడే వారు లేదా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించే వారు ఎక్కువగా వివిధ ప్రాంతాల నుండి వచ్చి హోటల్ లలోనే దిగే అవకాశం ఉండడం తో పోలీసులు ఈ తరహా టెక్నాలజీ ని ఆశ్రయించడం జరిగింది. దీనివలన కస్టమర్ ల ప్రైవసీ ఏ విధమైన ఆటంకం ఉండదు. ఇది చాలా సెక్యూర్డ్ సిస్టం.

దీని అవసరం ఎంతవరకూ ఉంది ?

ప్రస్తుతం మన దేశం లో ఉన్న చట్టాల ప్రకారం దేశం లో ఉన్న అన్ని హోటల్ లూ తమ హోటల్ లో దిగే కస్టమర్ ల యొక్క వివరాలను పోలీసు డిపార్ట్ మెంట్ వారికి ప్రతీరోజూ అందించవలసి ఉంటుంది. జాతీయ భద్రత దృష్ట్యా హోటల్ లు ప్రతీరోజూ ఈ పనిచేయవలసి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇది కేవలం నామమాత్రం గానే జరుగుతుంది. అదికూడా మాన్యువల్ గా జరుగుతుంది. అంటే కస్టమర్ ల దగ్గరనుండి సేకరించిన డాక్యుమెంట్ లను మరియు సంబందిత పేపర్ లను పోలీసువారికి ఇస్తూ ఉన్నాయి. అయితే ఇకపై ఇది ఆన్ లైన్ లో జరుగనుంది. అందుకే ఈ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా ఎవరైనా హోటల్ లో దిగిన వెంటనే క్షణాల్లో వారి వివరాలు పోలీసువారికి చేరడం జరుగుతుంది. ఈ విషయం లో జెబీ AI చెయిన్ టెక్నాలజీ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

ఇందులో ఆంధ్ర ప్రదేశ్ పాత్ర ఏమిటి ?

 టెక్నాలజీ కి సంబంధించి ఏ అప్ డేట్ వచ్చినా దేశం లో మొట్టమొదటిసారిగా అందిపుచ్చుకునే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి టెక్నాలజీ పక్షపాత వైఖరి కూడా దీనికి కారణం కావచ్చు. గత సంవత్సరం విశాఖపట్నం లో జరిగిన బ్లాక్ చెయిన్ బిజినెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నాన్ని ఇండియా లో ఫిన్ టెక్ లేదా బ్లాక్ చెయిన్ టెక్నాలజీ కి రాజధాని చేయడమే తమ లక్ష్యమనీ అది మాత్రమే గాక గ్లోబల్ కమ్యూనిటీ కి కేంద్రంగా కూడా విశాఖ ను మార్చనున్నామనీ తెలిపారు.

గత అక్టోబర్ లోనే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు డిపార్టుమెంటు లలో వినియోగించడం జరిగింది. అలా చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం.  ల్యాండ్ రికార్డు లు మరియు రవాణా రంగం లో ఇప్పటికీ ఈ టెక్నాలజీ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగిస్తుంది. పైలట్ ప్రాజెక్ట్ గా ఎపి ప్రభుత్వం దీనిని చేపట్టింది.