తెలుగు నేలపై పురుడుపోసుకుని 95 సంవత్సరాల పాటు దిగ్విజయంగా ముందుకు సాగిన అచ్చ తెలుగు బ్యాంకు ఆంధ్రా బ్యాంకు కనుమరుగు కాబోతోంది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరైన భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923, నవంబరు 20న కృష్ణా జిల్లా మచిలీపట్నం (బందరు) కేంద్రంగా స్థాపించిన ఆంధ్రా బ్యాంకు ఇప్పుడు యూనియన్ బ్యాంకులో విలీనమైపోయింది. ఆంధ్రా బ్యాంకు ఘన విజయాలను ఓ సారి గుర్తు చేసుకుందాం.
భారత దేశానికి మొదటగా క్రెడిట్ కార్డులను పరిచయం చేసింది అచ్చ తెలుగు ఆంధ్రా బ్యాంకే. 1981లోనే క్రెడిట్ కార్డులను ఇష్యూ చేసింది. దీంతో పాటు 2007లో బయోమెట్రిక్ ఏటిఎంలను భారతదేశానికి పరిచయం చేసింది.
ఆంధ్రా బ్యాంక్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తుండటం గమనార్హం. ఈ బ్యాంక్ 2003 నాటికి వంద శాతం కంప్యూటరీకరణ సాధించింది. ఆంధ్రా బ్యాంక్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,904 శాఖలు ఉన్నాయి. బ్యాంకులో 2018 సెప్టెంబర్ చివరి నాటికి 21,740 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఈ బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరైన భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923, నవంబరు 20న ఆంధ్రాబ్యాంకును కృష్ణా జిల్లా మచిలీపట్నం (బందరు) కేంద్రంగా స్థాపించారు. ఇందిరాగాంధీ 1980లో ఆంధ్రా బ్యాంక్‌ను జాతీయికరణ చేశారు. దీంతో ఇది ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా అవతరించింది. జాతీయం చేసినప్పుడు ఆంధ్రాబ్యాంకు 974 పూర్తిస్థాయి శాఖలు, 40 క్లస్టర్ బ్యాంచ్‌లు, 76 ఎక్స్‌టెన్షన్ కౌంటర్లు ఉండేవి.
1923 నవంబర్ 20న ఈ బ్యాంకు పేరు రిజిస్టర్ అయింది. లక్ష రూపాయల మూలధనం, రూ. 10 లక్షల అధీకృత మూలధనం (ఆథరైజ్డ్ క్యాపిటల్)తో 1923 నవంబర్ 28న కార్యకలాపాలు ప్రారంభించింది.
ఆంధ్రాబ్యాంకు లోగోలో పెద్ద ఇన్ఫినిటీ ( అనంతం ) చిహ్నం ఉంటుంది. అది వినియోగదారుల కోసం ఏ పని చేయడానికైనా, ఎంత దూరం వెళ్ళటానికైనా సిద్ధం అనే అనే సందేశాన్ని సూచిస్తుంది. గొలుసు మాదిరిగా కనిపించే తమ లోగో ఐక్యతను సూచిస్తుందని, ఎరుపు, నీలం రంగులు చైతన్యాన్ని, దృఢత్వాన్ని సూచిస్తాయని ఆంధ్రాబ్యాంకు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఇప్పుడు ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌లను విలీనం చేయనున్నారు. విలీనం తర్వాత ఏర్పాటయ్యే బ్యాంక్ ఐదో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా ఆవిర్భవిస్తుంది. దీన్ని కార్యకలాపాలను యూనియన్ బ్యాంక్ చూసుకుంటుంది. దీంతో ఆంధ్రా బ్యాంక్ కనుమరుగు అవుతుంది.