• తాజా వార్తలు

ఏపీలో హైటెక్ నిఘా

ఏపీలో హైటెక్ నిఘా వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇజ్రాయేల్‌లో రూపొందించిన స్కై స్టార్‌- 180 ఏరోస్టాట్‌ అనే నూతన నిఘా వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఒకేసారి వెయ్యి అడుగుల ప్రాంతాన్ని 360 డిగ్రీల కోణంలో ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలు, సెన్సార్ల, అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో కెమెరాలో బంధించగలగడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. చిన్న రవాణా వాహనంలో ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే ఈ నిఘా పరికరం హీలియంతో పని చేస్తుంది. ఏకధాటిగా 72 గంటలు పని చేస్తుంది. కేవలం ఇద్దరు సుశిక్షితులైన సిబ్బంది దీన్ని రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆపరేట్‌ చేయొచ్చు. నేల మీదా, సముద్రపైనా దీనిని వినియోగించుకునే వెసులుబాటుంది. ఆటోమేటిక్‌ స్కానింగ్‌తో పాటు రియల్‌టైమ్‌లో కచ్చితమైన సమాచారాన్ని వ్యవస్థ చేరవేయగల్గుతుంది. ఇజ్రాయెల్‌లో తయారైన ఈ పరికరాలను ఇప్పటికే అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌లో విజయవంతంగా వినియోగించినట్లు చెబుతున్నారు.
ఇండియాలో ఫస్ట్ టైం
మావో ప్రభావిత ప్రాంతాల్లో ఈ నిఘా వ్యవస్థను ఉపయోగించే అవకాశం ఉందంటున్నారు. ఇంతవరకు దేశంలోనే ఇలాంటి వ్యవస్థ లేదని తెలుస్తోంది. గంజాయి సాగు, ఎర్ర చందనం స్మగ్లింగ్‌ వంటి వాటిని మరింత సమర్థవంతంగా ఈ వ్యవస్థతో అడ్డుకునే వీలుందంటున్నారు. భారీ ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడినప్పుడు వేర్వేరు ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించే ఏర్పాటుకూ ఈ వ్యవస్థ ఇచ్చే సమాచారం వినియోగపడుతుందంటున్నారు. బంద్‌లు, ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు, రాజకీయ సభలు, ఉద్యమాలు జరిగే సమయాల్లోనూ ఈ వ్యవస్థ ద్వారా పూర్తి స్థాయి నిఘా వేయడానికి, ప్రతిపక్షాలను మరింత కట్టడి చేయడానికి ప్రభుత్వం పావులు కదుపుతోంది.
ఇజ్రాయెల్ లో పరిశీలన
సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్స్‌లో స్కై స్టార్‌ 180 ఏరోస్టాట్‌లను విదేశాల్లో వినియోగిస్తున్నారు. స్కై స్టార్‌ 180 ఏరోస్టాట్‌ నిఘా వ్యవస్థ పనితీరును పరిశీలించేందుకు ఇప్పటికే ఏపీ నుంచి ఉన్నత స్థాయి అధికారుల బృందం ఇజ్రాయెల్ వెళ్లింది.