నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా తొలిసారి ఏపీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేటాయింపులు మెరుగ్గా ఉండడమే కాకుండా బడ్జెట్ సమర్పణ, సభ్యులు దాన్ని చూడడం నుంచి ప్రతి దశలోనూ టెక్నాలజీ ముద్ర కనిపించింది. బడ్జెట్ ప్రతులతో పాటు బడ్జెట్ సాఫ్టు కాపీలున్న ట్యాబ్‌లను సైతం సభ్యులకు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా బడ్జెట్ ప్రసంగాన్ని ట్యాబ్ లోనే వీక్షించారు. దీంతో ఏపీ బడ్జెట్ ను స్మార్టు బడ్జెట్ గా అభివర్ణిస్తున్నారు.
బడ్జెట్ సమర్పణ సందర్భంగా... ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తాజా బడ్జెట్‌లో ఇందుకు ఐటీ, కమ్యూనికేషన్లకు రూ.364 కోట్లు కేటాయించారు. 2020 నాటికి ఏపీని టెక్నాలజీ పరంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే 2014లో సరికొత్త ఐటీ, ఎలక్ట్రానిక్స్ విధానంతో ముందుకు వచ్చిందని వివరించారు. దీని ద్వారా ఇప్పటివరకూ 4,755 మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పించినట్టు తెలిపారు.
ఇంకా ఏం చెప్పారంటే..
1. 2017-18 సంవత్సరానికి ఐటీ, ఎలక్ర్టానిక్స్, కమ్యూనికేషన్లకు రూ.364 కోట్లు కేటాయించాం.
2. ఈ ఏడాది రూ.570 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు ఉంటాయని అంచనా..
3. 1526 ఎకరాల్లో 9 ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్లర్లు ఏర్పాటు చేస్తున్నాం.
4. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ రంగంలో ఏపీ అంతర్జాతీయ స్థాయికి చేరుతోంది. 2014-20 కాలానికి ఏపీ రూపొందించిన ఐటీ, ఎలక్ర్టానిక్స్ విధానాలకు మంచి రెస్పాన్సు వచ్చింది.
5. రూ.3,649 కోట్ల పెట్టుబడులతో 4,755 మందికి ఉపాధి చూపేలా ఐటీ రంగ పరిశ్రమల ఏర్పాటు వివిధ స్థాయిల్లో ఉన్నాయి.
6. డిజిటల్ సాంకేతికత ఆధారిత ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు గాను తిరుపతిలో ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ డిజిటల్ టెక్నాలజీని ప్రారంభించాం. సైబర్ సెక్యూరిటీ, డాటా అనాల్సిస్ నిపుణులు ఇక్కడ తయారవుతారు.
7. అడ్మినిస్ర్టేషన్లో క్వాలిటీ కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఐటీని విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఇందులో భాగంగా పలు ఈ-గవర్నెన్సు విధానాలు అమలు చేస్తున్నాం. బిజినెస్ టు కంజ్యూమర్, గవర్నమెంటు టు సిటిజన్, మీసేవ, మీకోసం వంటివన్నీ ఇందులో భాగమే.
8. స్మార్టు పల్స్ సర్వే ద్వారా ప్రజలకు సంబంధించిన సాంఘిక, ఆర్తిక సమాచారం మొత్తం సేకరించి.. దాన్ని డిజిటలైజ్ చేసి పౌరసేవలను మెరుగుపరిచేందుకు ఉపయోగిస్తున్నాం.
9. 2017-18ని ఈ-ప్రగతి సంవత్సరంగా ప్రకటించాం.
10. ఈ-ప్రగతి ద్వారా అన్ని శాఖలకు సంబంధించిన ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలను సమగ్రంగా అనుసంధానించి డాటా విజువలైజ్ చేస్తున్నాం.
11. పౌర సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఐవోటీ ఇకో సిస్టమ్ ఉపయోగించుకునే దిశగా ఏర్పాట్లు చేస్తున్నాం.
12. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్ట్రీట్ లైట్ల నిర్వహణలో టెక్నాలజీని వాడుతున్నాం. సెన్సార్ ఆధారిత సాంకేతిక విధానాల్లో వాటి నిర్వహణ చేపడుతున్నారు.
"