• తాజా వార్తలు

ఏపీలో యాపిల్ ఫోన్ల తయారీ?

యాపిల్ ఫోన్లంటే ఇంటర్నేషనల్ గా యమ క్రేజ్. అలాంటి సంస్థ ఇండియాలో కొత్తగా తయారీ యూనిట్ పెట్టబోతోంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో అని తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఇది ఏర్పాటు చేసేలా ప్రభుత్వం వైపు నుంచి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
5 లక్షల మంది ఉద్యోగాలు
యాపిల్ పరిశ్రమ ఏర్పాటైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదు లక్షలమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చంద్రబాబు చెబుతున్నారు. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల (హార్డ్‌వేర్) తయారీ యూనిట్ ఏర్పాటు ద్వారా ఐదు లక్షలమందికి లబ్ధి చేకూరుతుందన్నది ఆయన మాట.
షియామీ ఇక్కడే..
ఏపీలో ఇప్పటికే మొబైల్ ఫోన్ల తయారీ జరుగుతోంది. అంతర్జాతీయంగా పేరున్న ఫ్యాక్స్ కాన్ సంస్థ ఏపీలో స్మార్టు హ్యాండ్ సెట్లను తయారుచేస్తోంది. మేక్ ఇన్ ఇండియా.. మేక్ ఇన్ ఎపి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో తయారైన తొలి దేశీయ షియామీ మొబైల్ ఫోనును చంద్రబాబు రెండేళ్ల కిందట మార్కెట్లోకి విడుదల చేశారు... ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి సంస్థలకు మొబైల్ ఫోన్లను తయారుచేసి ఇచ్చే తైవాన్ కు చెందిన ఈ ఫాక్స్ కాన్ సంస్థ, నెల్లూరు జిల్లాలోని శ్రీ సిటీలో ఈ మొబైల్ ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు ఆ పక్కనే చిత్తూరు జిల్లాలో యాపిల్ తయారీ కేంద్రం వస్తే ఏపీ స్మార్టు ఫోన్ల హబ్ గా మారిపోవడం ఖాయం.