• తాజా వార్తలు

ఏపీ సీఎంకు సలహాలు ఇవ్వడానికి యాప్


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పడానికి కొత్త వేదిక అందుబాటులోకి వస్తోంది. సమస్త ప్రపంచం సాహో అంటున్న స్మార్ట్ ఫోన్ వేదిక. అవును.. స్మార్టు ఫోన్ యాప్ సహాయంతో ఏపీ ప్రభుత్వాన్ని రివ్యూ చేసే... సలహాలు అందించే అవకాశం ప్రజలకు దక్కుతోంది. ఇలాంటి అవకాశం కల్పించేలా సరికొత్త యాప్ ఒకటి ఈ రోజు నుంచి అందుబాటులోకి తెస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మైక్రోసాఫ్ట సంస్థ సహాయంతో దీన్ని అభివృద్ధి చేసింది.
ప్రభుత్వం తీరు ఎలా ఉంది? బాగుందా? లేదా?.. మీ అభిప్రాయం ఏదైనా కానీ.. ఇక నుంచి నిర్మొహమాటంగా చెప్పేయవచ్చు. ప్రజా సమస్యలు తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ‘కనెక్ట్ ఏపీ సీఎం’ అనే ఈ యాప్ సిద్ధమైంది.
డౌన్లోడ్ ఎలా..?
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునేవారు తొలుత ఏపీ ప్రభుత్వం కోసమే అభివృద్ధి చేసిన కైజాలా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానిని ఓపెన్ చేయగానే ‘కనెక్ట్ ఏపీ సీఎం’ ఐకాన్ కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేయగానే తొలుత ‘ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది?’ అన్న ప్రశ్న కనిపిస్తుంది. సమాధానంగా చాలా బాగుంది, బాగుంది, ఫర్వాలేదు, బాగాలేదు అన్న ఆప్షన్లు కనిపిస్తాయి. తద్వారా మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు.
ఫిర్యాదులూ చేయొచ్చు..
అలాగే ఏదైనా శాఖలో సమస్యలు ఉంటే ఫిర్యాదు కూడా చేయవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహించడానికి ముందురోజు ఈ యాప్‌ల ద్వారా ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను తెలుసుకుని సమీక్షలో వెల్లడిస్తారు. ఏ జిల్లా నుంచి ఎటువంటి అభిప్రాయాలు వచ్చాయన్న విషయాన్ని కూడా వెల్లడిస్తారు. ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరుచుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.