• తాజా వార్తలు

ఆరోగ్యసేతు యాప్‌..ఆల్‌టైమ్ రికార్డ్‌లన్నీ ఎలా తుడిచిపెట్టేసిందంటే.. 

బ‌య‌టికెళ్లాలంటే భ‌యం.. ఏమో ఎవ‌రికైనా కరోనా ఉండి.. ఆ వ్య‌క్తి రోడ్డు మీదకు వ‌చ్చి పొర‌పాటున తుమ్మితే, ద‌గ్గితే  వైర‌స్ మ‌న‌కూ అటాక్ అవుతుందేమో ఇప్పుడు అంద‌రిలోనూ ఇదే భ‌యం.  అందుకే మీకు స‌మీపంలో క‌రోనా రోగి ఉంటే మిమ్మ‌ల్ని అల‌ర్ట్ చేసే ఓ విశిష్ట‌మైన ఫీచ‌ర్‌తో వచ్చింది ఆరోగ్య‌సేతు యాప్. విశేష‌మేమిటంటే ఇది కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా వైర‌స్‌పై ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డానికి త‌యారుచేయించిన యాప్.  ఇప్పుడు ఈ యాప్ మొబైల్ యాప్స్ రంగంలో పెను సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఏకంగా 13 రోజుల్లో 5 కోట్ల‌కు పైగా డౌన్‌లెడ్స్‌తో  దూసుకుపోతుంది. అంటే రోజుకు దాదాపు 40 ల‌క్ష‌ల డౌన్‌లోడ్స్‌తో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టిస్తోంది.  

మోడీ పిలుపు మామూలుగా లేదుగా
క‌రోనా బారి నుంచి కాపాడుకోవడానికి అంద‌రూ ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇది సూప‌ర్ ఫ‌లితాలిస్తోందని నీతి ఆయోగ్ టీమ్ ప్ర‌క‌టించింది.  మోదీ పిలుపునిచ్చిన గంటల్లోనే కోటీ పది లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.  మొత్తం13 రోజుల్లో ఈ యాప్‌‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్ల నుంచి 5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.  క‌రోనాకు సంబంధించి సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఇచ్చే అధికారిక‌మైన‌, న‌మ్మ‌ద‌గిన స‌మాచారం ఉంటుంద‌న్న న‌మ్మ‌కం ఈ యాప్ ఇంత హిట్ట‌వ‌డానికి కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. అదీకాక మ‌న స‌మీపంలో క‌రోనా రోగి ఉన్నాడంటే అల‌ర్ట్ చేసే ఫీచ‌ర్ దీని స‌క్సెస్‌కు కార‌ణం.

నిమిషానికి ల‌క్ష రిజిస్ట్రేష‌న్లు
ఈ నెల 14వ తేదీ ఉదయం పది గంటలకు మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని చెప్పారు. అంతే ప్లేస్టోర్‌, యాప్ స్టోర్‌ల్లో అత్య‌ధికంగా సెర్చ్ అయిన యాప్ ఆరోగ్య‌సేతు. ఆ తర్వాత నిమిషానికి లక్షమంది చొప్పున రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, సగటున నిమిషానికి 20 వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని నీతి ఆయోగ్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ప్రోగ్రామ్ డైరక్టర్, ఆరోగ్య సేతు యాప్ డెవ‌ల‌ప్‌మెంట్ టీంలో మెంబ‌ర్ కూడా అయిన అర్నబ్ కుమార్ తెలిపారు. 

పోకేమాన్ గో యాప్‌ను దాటేసింది
సాధార‌ణంగా గేమింగ్ యాప్స్‌కే ఇంత క్రేజ్ ఉంటుంది.  2016లో పోక్‌మాన్ గో గేమింగ్ యాప్‌ను 19 రోజుల్లో 5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.  దాన్ని ఆరోగ్య‌సేతు యాప్ 13 రోజుల్లోనే దాటేసింది. ప‌బ్‌జీ లాంటి యాప్స్‌కు కూడా కోట్ల డౌన్‌లోడ్స్ దొరుకుతాయి. కానీ ఓ హెల్త్ యాప్ ఇప్ప‌టివ‌ర‌కు యాప్స్ చరిత్ర‌లో ఉన్న రికార్డుల‌న్నీ తిరగ‌రాసిందంటే క‌రోనా దెబ్బ మామూలుగా లేద‌నిపిస్తోంది.

జన రంజకమైన వార్తలు