ఆన్‌లైన్ మ్యూజిక్ రూపురేఖలు మార్చేసిన ఐట్యూన్స్ యాప్ ఇకపై చరిత్రపుటల్లోకి వెళ్లనుంది. ఆపిల్‌లో ఫేమస్ యాప్ ఐట్యూన్స్. పాటలు కావాలన్నా, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌తో కనెక్ట్ కావాలన్నా ఐట్యూన్స్ చాలా అవసరం. అలాంటి ఐట్యూన్స్‌ను తీసేస్తున్నట్టు ఆపిల్ అధికారికంగా ప్రకటించింది. దీని స్థానంలో మూడు యాప్స్‌ను ప్రవేశపెడుతున్నట్లు అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ ప్రకటించింది. ఆపిల్ మ్యూజిక్, పాడ్‌కాస్ట్స్ ఆపిల్ టీవీ ఇందులో ఉంటాయని వివరించింది. 2001లో తొలిసారిగా ఐట్యూన్స్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఇంటర్నెట్ మాధ్యమంగా మ్యూజిక్, ఆన్ డిమాండ్ వీడియోలు మొదలైనవి ప్రాచుర్యంలోకి వచ్చాయి.
తాజాగా ఐట్యూన్స్‌ను మూడు వేర్వేరు యాప్‌ల కింద తీసుకురావడం ద్వారా ఈ ఏడాదే ప్రవేశపెట్టబోయే టీవీప్లస్ సర్వీసులకు మరిన్ని హంగులు అద్దేందుకు ఆపిల్ ప్రయత్నిస్తోంది. ఆపిల్ టీవీ యాప్‌ను స్మార్ట్ టెలివిజన్స్‌లో పొందుపర్చడంతో పాటు రోకు, అమెజాన్ ఫైర్ టీవీ మొదలైన థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్‌ల్లో కూడా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రెగ్ ఫెడరిగి తెలిపారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కనెక్ట్ అయిన వాళ్లు ఐట్యూన్స్‌ను వాడుకునేలా వెసులుబాటు కల్పించింది. ఐట్యూన్స్ మ్యూజిక్ స్టోర్ కూడా అందుబాటులోనే ఉంటుందని చెప్పంది. వీటితో పాటు ఆపిల్ మ్యాప్స్నూ తెచ్చింది.
ఇక దీంతో పాటు మరో సరికొత్త ఫీచర్ ను ఆపిల్ తీసుకురానుంది. ఇప్పటివరకు ఫేస్బుక్, జీమెయిల్లోకి లాగిన్ అవ్వాలంటే యూజర్‌ఐడీ, పాస్వర్డ్ కచ్చితంగా టైప్ చేయాలి. కానీ, అవేవీ లేకుండా వాటిలోకి లాగిన్ అయితే ఎట్లా ఉంటుంది? అది నిజం కాబోతోంది. కానీ, అందరికీ కాదు. కేవలం ఆపిల్ యూజర్లకే. వ్యక్తిగత సమాచారం ఇవ్వకుండా కేవలం ఆపిల్ ఐడీతో లాగిన్ అయిపోతే చాలు. వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రత, ప్రైవసీకి పెద్దపీట వేస్తూ ‘సైన్ ఇన్ విత్ యాపిల్’ అనే కొత్త యాప్‌ను సంస్థ తీసుకొచ్చింది. దాని వల్ల వినియోగదారుల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుందని కంపెనీ చెప్పింది.
శాన్‌జోస్‌లో నిర్వహించిన డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ క్రెయిగ్ ఫెడెరిగి యాపిల్‌లో కొత్త ఫీచర్లను వివరించారు. సైన్ఇన్ విత్ ఆపిల్‌లో యూజర్లు ఫేస్ ఐడీతోనూ లాగిన్ అయ్యే అవకాశం కల్పించారు.