మన కంప్యూటర్ మానిటర్ ఎంత ఉన్నా సీపీయూ మాత్రం సేమ్ సైజ్. ఒక డబ్బాలా దాన్ని మనం ఊహించుకుంటాం. లేటెస్ట్ పీసీలు కొద్దిగా కాంపాక్ట్ డిజైన్‌తో మన డెస్క్‌టాప్ పక్కన ముచ్చటగా కొలువుదీరుతున్నాయి. కానీ చైనా కంపెనీ చువీ మాత్రం చాలా చిన్న పీసీని తయారుచేసింది. అరచేతిలో దీన్ని పెట్టుకుని గుప్పిట మూస్తే ఎవరికీ కనపడదు కూడా. అంత చిన్న పీసీలో ఉన్న పెద్ద విషయాలేంటో సరదాగా ఓ లుక్కేద్దామా
సైజు మిల్లీమీటర్లే
చైనా బేస్డ్ చువీ కంపెనీ ప్రపంచపు అతి చిన్న 4కే మినీ పీసీని తయారుచేసినట్లు ప్రకటించింది. ట్విటర్‌లో వీడియోలు, ఇమేజ్‌లు కూడా ట్వీట్ చేసింది. దీని సైజ్ 61 x 61 x 43 మిల్లీమీటర్లు మాత్రమే. అంటే మన పెన్ డ్రైవ్ కంటే కాస్త పెద్దగా ఉంటుందేమో . కంప్యూటర్ అంటే ఇంతే ఉండాలి, చిన్నగా ఉండదు అనుకునేవారికి మా సమాధానమే ఈ లార్క్‌బాక్స్ అని కంపెనీ దీనికి పేరు పెట్టింది.
పవర్‌ఫుల్లే
సైజ్‌లో చిన్నదైనా పెర్‌ఫార్మెన్స్ ఆలోచించాల్సిన పనే లేదట. అదిరిపోయే ఫీచర్లున్నాయంటోంది కంపెనీ. మీరు మీ పీసీలో డైలీ చేసే పనులన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసే కెపాసిటీ దీనిలో ఉందని గ్యారంటీ ఇస్తోంది. ఇంకేం మరి చక్కగా జేబులో పెట్టుకుని వెళ్లిపోయి మీకు కావాల్సిన చోట మానిటర్‌కు కనెక్ట్ చేసి వాడేసుకోండి.
వారెవ్వా.. ఏం ఫీచర్లు
* ఇంటెల్ 8 జనరేషన్ క్వాడ్‌కోర్ ఎన్4100 ప్రాసెసర్.
* 6జీబీ LPDDR4 ర్యామ్
* 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్.
* అల్ట్రా సౌండ్ కూలింగ్ ఫ్యాన్
* 4కే డిస్‌ప్లే
* యూఎస్‌బీ ఏ, సీ పోర్ట్‌లు, హెచ్‌డీఎంఏ పోర్ట్,
* 3.5 మి.మీ. ఆడియో జాక్
* కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0 సపోర్ట్