అమెరికా దిగ్గజం ఆపిల్ ఇటీవల విడుదల చేసిన మాక్‌బుక్ ప్రో డివైస్‌లు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాక్‌బుక్ ప్రో యూనిట్లను ఆపిల్ కంపెనీ భారీగా రీకాల్ చేస్తోంది. 15 అంగుళాల మాక్‌బుక్ ప్రో బ్యాటరీ ఓవర్ హీట్ అయ్యి ప్రమాదానికి గురుకావచ్చనే ఆందోళనతో వాటిని రీకాల్ చేస్తోంది. ఈ మేరకు వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రభావితమైన 15 అంగుళాల మాక్‌బుక్ ప్రో యూనిట్లను ఉపయోగించడం మానేయాలని ఆపిల్ వినియోగదారులను కోరింది. అలాగే వీటి బ్యాటరీని ఉచితంగా రీప్లేస్ చేసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది.
2015 మ్యాక్ బుక్ ప్రో, రెంటినా డిస్ ప్లే కలిగిన ల్యాపీలను రీకాల్ చేస్తున్నట్టు ఆపిల్ ప్రకటించింది. సెప్టెంబర్ 2015, 2017 ఫిబ్రవరిలో రిలీజ్ అయిన కొన్ని మ్యాక్ ప్రో ప్రొడక్ట్ సీరియల్ నెంబర్ కలిగిన యూనిట్లలో బ్యాటరీ హీటింగ్ సమస్య అధికంగా ఉన్నట్టు కంపెనీ గుర్తించింది. బ్యాటరీ రీప్లేస్‌మెంట్ వివరాల కోసం ‘ఆపిల్.కామ్/సపోర్ట్ /15-ఇంచ్-మ్యాక్‌బుక్-ప్రో-బ్యాటరీ-రికాల్ ’ లో సంప్రదించవచ్చని ప్రకటించింది.
ప్రత్యేకించి 15 అంగుళాల rMBP మోడల్ మ్యాక్ ప్రో ల్యాపీల్లో బ్యాటరీలు ఫైర్ రిస్క్ ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. అందుకే ఎఫెక్ట్ అయిన బ్యాటరీలను రీకాల్ చేస్తున్నట్టు పేర్కొంది. 15 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో బ్యాటరీల స్థానంలో కస్టమర్లకు ఉచితంగా కొత్త బ్యాటరీలను రీప్లేస్ చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. బ్యాటరీ ఓవర్ హీటింగ్ సమస్యలేని ఇతర 15 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో యూనిట్లు, ఇతర మ్యాక్ నోట్ బుక్స్ లోని బ్యాటరీలను రీకాల్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.
15 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో యూనిట్లను వాడటం వెంటనే ఆపివేయాలని కస్టమర్లకు ఆపిల్ సూచించింది. బ్యాటరీ రీకాల్ కు ఎలాంటి ఛార్జ్ చేయడం లేదని కంపెనీ వెల్లడించింది. బ్యాటరీ ఎక్స్ ప్యాన్షన్ కు సంబంధించి 2018 ఏడాదిలో ఆపిల్.. 13 అంగుళాల ప్రో యూనిట్లలో బ్యాటరీ రీప్లేస్ మెంట్ ప్రొగ్రామ్ ను కూడా ఇదే తరహాలో ప్రకటించింది.