• తాజా వార్తలు

సెకండ్ హ్యాండ్ యాపిల్ మ్యాక్ కొంటున్నారా? అయితే ఈ 5 విష‌యాలు మ‌ర్చిపోకండి

యాపిల్ మ్యాక్ బుక్‌.. దాని పనితీరే వేరు. మ్యాక్ బుక్‌లందు యాపిల్ మ్యాక్‌బుక్‌లు వేర‌యా అని పాటందుకుంటారు దాని ఫ్యాన్స‌యితే. పెర్‌ఫార్మెన్స్‌, బ్యాట‌రీ బ్యాక‌ప్‌, లుక్ ఇలా అన్నింటిలోనూ దానిక‌దే సాటి. కానీ ధ‌ర వింటే సాధార‌ణ యూజ‌ర్ల‌కు  వామ్మో అనిపిస్తుంది. యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ లేటెస్ట్ మోడ‌ల్ కావాలంటే 60 వేలు పైన పెట్టాలి. ఇక మ్యాక్ బుక్ ప్రో కొనాలంటే ల‌క్షా 75 వేల రూపాయ‌లు కావాలి. అంతంత పెట్టి కొన‌లేం.. మ్యాక్‌బుక్‌పై మోజు వ‌దులుకోలేం అనేవారికి సెకండ్ హ్యాండ్ కొనుక్కోవ‌చ్చు.  ఎందుకంటే యాపిల్ ప్రొడ‌క్ట్స్ చాలాకాలంపాటు ఒకే క్వాలిటీతో ప‌నిచేయ‌డానికి డిజైన్ చేసిన‌వే ఉంటాయి. అయితే ఇండియాలో మీరు ఓఎల్ఎక్స్‌, ఈబే, క్విక‌ర్ లాంటి సైట్ల‌లో సెకండ్ హ్యాండ్ మ్యాక్ చూసి కొనాల‌నుకుంటే మాత్రం ఈ  5 విష‌యాలు క‌చ్చితంగా గుర్తు పెట్టుకోండి.

ముందే తెలుసుకోండి
మీరు ఆ మ్యాక్ కొన‌డానికి వెళ్లే ముందు మార్కెట్లో యాపిల్ మ్యాక్ లేటెస్ట్ మోడ‌ల్ ఎంత ఖ‌రీదు ఉంది?  మీరు చూద్దామ‌నుకున్న మోడ‌ల్ కొత్త‌ది కొంటే ఎంత‌వుతుంది, స్పెక్స్ ఏమి ఉంటాయి అన్నీ వీలైనంత తెలుసుకోండి. అప్పుడే మీరేం కొంటున్నారు?  దానికి ఎంత ధ‌ర పెట్టొచ్చు అనేది అవ‌గాహ‌న వ‌స్తుంది. వీలైతే మ్యాక్‌లు, పీసీల‌గురించి అవ‌గాహ‌న ఉన్న ఫ్రెండ్స్ ఎవ‌రైనా ఉంటే వెంట తీసుకెళ్లండి.  అమ్మే వ్య‌క్తి ఎంత ధ‌ర‌యినా చెప్ప‌నివ్వండి.. కానీ సెకండ్ హ్యాండ్ అంటే బేరం ఆడొచ్చ‌ని మాత్రం మ‌ర్చిపోకండి.

ప‌నిచేస్తుంటేనే కొనండి
మ్యాక్ ప‌నిచేస్తున్న‌ద‌యితేనే కొనండి.  దాన్ని స్విచ్ ఆన్‌చేసి చూడండి. వెంట‌నే ఆన్ అవుతుందా, బూటింగ్‌లో ఏమ‌న్నా ప్రాబ్లం ఉందా అన్నీ చూసుకోండి. మ్యాక్ ఆన్, ఆఫ్‌లో ఏమైనా ప్రాబ్ల‌మ్స్ ఉన్నాయా? స‌్క్రీన్ క‌రెక్ట్‌గా ఉందా? ఏమైనా డ్యామేజ్ అయిందా? బ‌్ల‌ర్ అవుతుందా?  పిక్సెల్స్‌, బ్రైట్‌నెస్ అన్నీ బాగున్నాయా లేదా చెక్ చేయండి.  కీబోర్డు మీద టైప్‌చేసిచూడండి. యూఎస్‌బీ, ఛార్జింగ్‌, హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, డీవీ డ్రైవ్‌లు, వైర్‌లెస్ క‌నెక్ష‌న్స్ అన్నీ క‌రెక్ట్‌గా ప‌నిచేస్తున్నాయా లేదా చూసుకోండి.వెబ్‌క్యామ్‌, స్పీక‌ర్స్ కూడా చెక్ చేసుకోండి. ఇంట‌ర్న‌ల్ పార్ట్స్ ర్యామ్‌, హార్డ్‌డ్రైవ్ అన్నీ ఉన్నాయా లేదా సెల్ల‌ర్‌ను అడిగి తెలుసురోండి.

సాఫ్ట్‌వేర్ చెక్ చేయండి
సాఫ్ట్‌వేర్ చెక్ చేసుకోకుండా తీసుకోకండి.  ఓఎస్ మిస్స‌య్యిందంటే మీ జేబుకు చిల్లు ప‌డ్డ‌ట్టే. మ్యాక్‌తోపాటు వ‌చ్చిన ఒరిజిన‌ల్ సాఫ్ట్‌వేర్ సీడీలు, డ్రైవ‌ర్లు ఉంటే ఇమ్మ‌ని అడ‌గండి. మ్యాక్‌కి బ్యాట‌రీ బ్యాక‌ప్ ప్రాణం. కాబ‌ట్టి బ్యాట‌రీ ఎలా ప‌నిచేస్తుందో చూడండి. బ్యాట‌రీ స‌రిగా ఛార్జ్ అవుతుందా?ఎన‌్ని గంట‌లు బ్యాక‌ప్ వ‌స్తుంది? ఏమైనా స‌మ‌స్య‌లున్నాయా ముందే తెలుసుకోండి.అన్‌యూజ్డ్ డెడ్ బ్యాట‌రీ వ‌స్తే బోల్డంత ఖ‌ర్చ‌వుతుంది.
 

మ్యాక్ ఎన్నాళ్ల కింద‌టిదో తెలుసుకోండి
సెకండ్ హ్యాండ్ మ్యాక్ త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తుండ‌వ‌చ్చు. అలాగని చాలా పాత మ్యాక్ కొంటే రెగ్యుల‌ర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌, సెక్యూరిటీ ప్యాచెస్ రావు. కాబ‌ట్టి మ్యాక్ ఏజ్ వివ‌రాలు తెలుసుకోండి.

జెన్యూన్ అయితేనే కొనండి
ఫేక్ మ్యాక్‌బుక్ అమ్మే మాయ‌గాళ్లు కూడా ఇలాంటి ఆన్‌లైన్ సైట్ల‌లో చాలామంది ఉంటారు.కాబ‌ట్టి ఒరిజిన‌ల్ ప్రొడ‌క్టా కాదా తెలుసుకోండి. మ్యాక్ కొన్న బిల్లు లేదా ఏదైనా ప్రూఫ్‌, వారంటీ కార్డు ఉన్నాయా అని అడ‌గండి.వాళ్లు లేవంటే మోడ‌ల్ నెంబ‌ర్‌, సీరియ‌ల్ నెంబ‌ర్‌ను బ‌ట్టి అది ఒరిజిన‌లా కాదా మీరే చెక్ చేయొచ్చు. మ్యాక్ ఆన్ చేశాక స్క్రీన్ మీద ఎడ‌మ చేతి వైపున టాప్‌లో క‌నిపించే యాపిల్ ఐకాన్‌ను క్లిక్‌చేయండి. డ్రాప్ డౌన్ మెనూ వ‌స్తుంది. దాన్ని కిందికి లాగి About This Mac ఆప్ష‌న్ మీద క్లిక్ చేయండి. ఓ విండో ఓపెన్ అయి మ్యాక్ డిటెయిల్స్‌, సీరియ‌ల్ నెంబ‌ర్‌, మోడ‌ల్ నెంబ‌ర్‌, డిటెయిల్స‌న్నీ వ‌స్తాయి. మ్యాక్  అడుగు భాగంలో కూడా దాని సీరియ‌ల్ నెంబ‌ర్‌, మోడ‌ల్ నెంబ‌ర్ ఉంటాయి.
ఇవ‌న్నీచెక్ చేసుకుని ఆ త‌ర్వాతే బేరమాడుకుని కొనుక్కోండి. ఏదైనా లోటుపాట్లుంటే వాటికి త‌గ్గ‌ట్లు ధర త‌గ్గించ‌మ‌నండి.

జన రంజకమైన వార్తలు