ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ఇప్పుడు ప్రతి సెగ్మెంట్లోనూ చైనా వస్తువులే కనిపిస్తున్నాయి. తాజాగా ల్యాప్ టాప్ మార్కెట్‌పై వాటి దృష్టి పడింది. ఇందులో ముందు అడుగు వేసింది షియోమి . ఎంఐ నోట్ బుక్14 , ఎంఐ నోట్ బుక్ 14 హారిజాన్ మోడల్స్ ల్యాప్‌టాప్స్ వారం క్రితమే లాంచ్ చేసింది. అయితే వాటి ధరలు 45 వేల పైనే. అందుకే సగటు ఇండియన్ యూజర్ల కోసం బడ్జెట్ ధరలోనే ల్యాప్ టోపీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే గనక నిజమైతే 20వేల రూపాయల్లోపే రెడ్‌మీ ల్యాప్‌టాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
స్టూడెంట్స్, బడ్జెట్ యూజర్లే టార్గెట్
ఇప్పటికే లాంచ్ చేసి ఎంఐ నోట్‌బుక్ హై రేంజ్ ధరల్లో ఉన్నాయి. స్టూడెంట్స్, బడ్జెట్ యూజర్ల కోసం రెడ్‌మీ బుక్స్ 20వేల నుంచి 33వేల రూపాయల్లోపు ధరలో షియోమి లాంచ్ చేయనుందని టెక్నాలజీ బిజినెస్ మార్కెట్లో వినపడుతోంది.
ఇలా ఉండొచ్చు
ఆ రిపోర్ట్ ప్రకారం రెడ్‌మీ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్‌తో రావచ్చు. వీటి ధర 20వేల నుంచి 33వేల రూపాయల వరకు ఉంటుందని చెబుతోంది. రెడ్‌మీ ల్యాప్‌టాప్ 25వేల రూపాయల ధరలో ఐ3 ప్రాసెసర్‌తో రావచ్చని, అంతకంటే తక్కువ ధరలో వచ్చేవాటిలో పాత జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌తో రావచ్చని చెప్పింది.ఇవి కొత్త జనరేషన్ ఇంటెల్ చిప్స్ కంటే తక్కువ సామర్థ్యంతో వస్తాయని, అయితే స్టూడెంట్స్, తక్కువ కాన్ఫిగరేషన్‌తో పనిచేసుకోగల యూజర్లకు ఇవి సరిపోతాయని రిపోర్ట్ చెబుతోంది.
ఇండియాలోనే తయారీ
ఈ ల్యాప్‌టాప్‌లను ఇండియాలోనే తయారుచేస్తారని, ఎక్కువగా ప్లాస్టిక్ బాడీతోనే రావచ్చని రిపోర్ట్ కథనం. అయితే క్రోమ్ బుక్స్ కాకుండా విండోస్ 10 (హోం) ఆపరేటింగ్‌సిస్టమ్స్‌తో రావచ్చని తెలుస్తోంది. 14 అంగుళాల స్క్రీన్‌తో వచ్చే రెడ్‌మీ ల్యాప్‌టాప్స్ జులై ఆఖరులోగానీ, ఆగస్టు మొదటివారంలోగానీ ఇండియాలో లాంచ్ అవకాశాలున్నాయట. అదే నిజమైతే రెడ్‌మీ సిరీస్‌లో వచ్చే తక్కువ ధర ఫోన్లలాగే ఇవి కూడా ఇండియన్ బడ్జెట్ యూజర్లకు ఆకట్టుకునే అవకాశాలున్నాయని రిపోర్ట్ చెప్పింది.