మీరు వ్యాపారం చేస్తుంటారా? లేకపోతే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏమన్నా నడుపుతారా? అయితే మీకు జీఎస్టీ, ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్స్ బకాయిలు ఉంటే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మీకు ఐటీ రిఫండ్స్ పేరుతో మెయిల్స్ వస్తే మాత్రం కంగారుపడి ఓపెన్ చేయకండి. ఎందుకంటే అవి పిషింగ్ మెయిల్స్. మీరు ఓపెన్ చేస్తే లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అది మీ సిస్టమ్‌లో మాల్వేర్‌ను ఎంటర్ చేసే ప్రమాదముంది. లేదంటే మీ బ్యాంక్ అకౌంట్‌కో ఎక్కడికో చోటకు డైరెక్ట్ చేసి మీ డబ్బులో, డేటానో కొట్టేసే ప్రమాదం ఉంది. జాగ్రత్త అని జీఎస్టీఎన్, ఐటీ శాఖ హెచ్చరించాయి.
భారీగా రిఫండ్స్ చెల్లింపులు
కరోనా నేపథ్యంలో ఆర్థికంగా దెబ్బతిన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపార వర్గాల వారికి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రిఫండ్, ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్స్ బకాయిలు ఉంటే వెంటనే చెల్లించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 8 నుంచి 20 తేదీల మధ్య వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, హెచ్‌యూఎఫ్స్, యాజమాన్య సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్ కంపెనీలు, ఎంఎస్ఎంఈలకు 14 లక్షల రిఫండ్స్ ఇచ్చామని ఐటీ శాఖ పేర్కొంది. వీటి విలువ 9వేల కోట్ల రూపాయలు. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) కూడా ఏప్రిల్ 8 నుంచి 23 మధ్య 10,700 కోట్ల రూపాయల విలువైన రిఫండ్స్ చేసింది.
క్లిక్ చేస్తే బుక్కవుతారు.
అయితే ఇదే అదనుగా రిఫండ్ల పేరుతో నకిలీ ఈ-మెయిల్ సందేశాలు వస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఐటీ శాఖ హెచ్చరించింది. పన్ను చెల్లింపుదారులూ, తస్మాత్ జాగ్రత... రిఫండ్ హామీతో వచ్చిన నకిలీ మెయిల్ లింక్‌ను క్లిక్ చేయకండి. అవి పిషింగ్ మెసేజ్‌లు. ఐటీ శాఖ అలాంటివి పంపదు అని ఒక ట్వీట్ కూడా చేసింది. తాము కూడా అలాంటి మెయిల్స్ పంపబోమని సీబీఐసీ కూడా ట్వీట్ చేసింది. రిఫండ్స్ సమాచారం కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని చెప్పింది.