• తాజా వార్తలు

అయ్యా.. జెఫ్ బిజోస్ విన్నావా మీ అలెక్సా చేస్తున్న తుంట‌రి ప‌నులు

అలెక్సా..అమెజాన్ వాయిస్ అసిస్టెంట్‌. స్మార్ట్ హోమ్‌లో దీన్ని పెట్టుకుంటే అమెజాన్ ఎకో స్పీకర్స్ ద్వారా మ్యూజిక్ ప్లే చేయ‌డం, స్టాప్ చేయడం, హీటింగ్‌, లైటింగ్ ఆన్ ఆఫ్‌, సెక్యూరిటీ సిస్ట‌మ్‌ను యాక్టివేట్ చేయ‌డం వంటి ప‌నుల‌న్నీ మీరు వాయిస్ క‌మాండ్ ఇస్తే చేయ‌డం ఈ అలెక్సా ప్ర‌త్యేక‌త‌. అయితే ఇలా స్మార్ట్ గ్యాడ్జెట్‌గా వచ్చిన అలెక్సా మ‌న సంభాష‌ణ‌ల‌ను ప్రైవేట్‌గా విని ఎవ‌రికైనా పంపేస్తే..అబ్బే మ‌నం వాయిస్ క‌మాండ్స్ ఇవ్వ‌కుండా ప‌ని చేయ‌దు అనుకుంటున్నారా? అలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే అమెరికాలో ఓ జంట వ్య‌క్తిగ‌తంగా (బ‌హుశా బెడ్‌రూమ్‌లో) మాట్లాడుకుంటుంటే అలెక్సా దాన్ని రికార్డ్ చేసి ఆ జంట‌లో పురుషుడి ద‌గ్గ‌ర ప‌నిచేసే ఎంప్లాయి ఒకరికి ఆ వాయిస్ మెసేజ్‌ను పంపించేసింది. అత‌ను వెంట‌నే వాళ్ల‌కు కాల్ చేసి మీ అమెజాన్ అలెక్సాను ఆఫ్ చేయండి. అది  హ్యాక్ అయిన‌ట్లుంది.. మీ వ్య‌క్తిగ‌త సంభాష‌ణ‌ల‌తో నాకు మెసేజ్ వ‌చ్చింది అని చెప్పాడు.వెంట‌నే  ఆ మ‌హిళ దీనిమీద అమెజాన్‌కు  కంప్ల‌యింట్ చేసింది. అంతేకాదు ఇంకెప్పుడూ అలెక్సాను స్విచ్ ఆన్‌చేయ‌న‌ని తేల్చిచెప్పేసింది.
 

ఎలా జ‌రిగి ఉంటుంది?
ఇలా జ‌ర‌గ‌డం చాలా అరుద‌ని అమెజాన్ చెప్పింది. దీనికి కార‌ణం ఏమై ఉంటుందో కూడా విశ్లేషించింది. ఆ జంట మాట‌ల్లో భాగంగా అలెక్సా అనే సౌండ్ వ‌చ్చేలా ఏదో ప‌దం మాట్లాడి ఉంటారు. దానితో అది యాక్టివేట్ అయిపోయి ఉంటుంది. వాళ్ల మాట‌ల‌న్నీ వాయిస్ కమాండ్స్ అనుకుని రికార్డ్ చేసుకుంది. ఈ మెసేజ్‌ను ఎవ‌రికైనా సెండ్ చేయాలా అని అడిగి ఉంటుంది. వాళ్లు దాన్ని ప‌ట్టించుకోకుండా త‌మ మాట‌ల్లో ఏదో పేరు ప‌లికి ఉంటారు. అది వాళ్ల‌కు పంపాల‌నుకుని వాళ్ల మాట‌ల‌న్నీవాయిస్ మెసేజ్‌గా వాళ్ల‌కు పంపేసి ఉంటుంద‌ని అమెజాన్ వివ‌రించింది.

భ‌ద్ర‌త‌కు ముప్పు?
అమెరికాలో దాదాపు 6 కోట్ల మంది ఇలాంటి వాయిస్ అసిస్టెంట్స్ వాడుతున్నారు. అందులో 4 కోట్లు అమెజాన్ అలెక్సాలే.  చిన్న‌చిన్న ప‌నుల్ని చ‌క్క‌బెట్టుకోవ‌డానికి పెట్టుకున్న అలెక్సా లాంటి ప‌రిక‌రాలు మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న చ‌ర్య‌ల్ని రికార్డు చేసే గూఢ‌చారిలా ప‌నిచేయ‌డం ప్ర‌మాద‌క‌ర‌మే. ఇది మ‌న సెక్యూరిటీకి సంబంధించి కాబ‌ట్టి చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.యంత్రం త‌ప్పుచేయ‌దు అనే భావ‌న వ‌దిలిపెట్టి వాటిని కూడా అప్పుడ‌ప్పుడూ ప‌రిశీలిస్తుండాల‌నేదాన్ని ఈ సంఘ‌ట‌న మ‌నంద‌రికీ చెప్పిందని సైబ‌ర్ క్రైమ్ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు..

జన రంజకమైన వార్తలు