• తాజా వార్తలు

బాహుబలి-2 లీక్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్


బాహుబలి-2 సినిమా ఎంత సెన్సేషనో వేరేగా చెప్పనవసరం లేదు. ఇండియన్ సినీ ఇండస్ర్టీలో సరికొత్త రికార్డ్ బ్రేకింగ్ మూవీ ఇది. అయితే, ఈ సినిమాను పైరసీ భూతం పట్టుకుంది. అది నెట్ పైరసీ భూతం. సైబర్ క్రిమినల్స్ ఈ సినిమాను ఇంటర్నెట్ లో పెట్టేస్తామంటూ నిర్మాతలను బెదిరించడమే కాకుండా అలా చేయకుండా ఉండాలంటే తాము కోరినంత మొత్తం ఇవ్వాలంటూ డిమాండ్లు చేశారు. ఈ కేసు పోలీసుల వరకు చేరడంతో వారు తెలివిగా సైబర్ క్రిమినల్స్ ను పట్టుకున్నారు. అయితే... పైరసీ చేయడం నుంచి.. నిర్మాతలను బెదిరించడం.. చివవరకు దొరికిపోవడం వరకు సైబర్ క్రిమినల్స్ ఆడిన గేమ్ అంతా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించేలా ఉంది.

ఇదీ సినిమా టెక్నికల్ ప్రాసెస్

మామూలుగా ఒక సినిమా తీయడం పూర్తయిన తరువాత తొలుత దాన్ని సాఫ్ట్‌కాపీ రూపంలోకి మారుస్తారు. దీన్ని బ్రాడ్‌కాస్టర్లకు అందించడంతో వారి సర్వర్‌లో సేవ్ చేస్తారు. ఈ బ్రాడ్‌కాస్టర్లు సినిమా సాఫ్ట్‌కాపీని ఎన్‌క్రిప్ట్ చేస్తారు. మళ్లీ దాన్ని థియేటర్లలో ప్రదర్శించేందుకు వీలుగా డీక్రిప్షన్‌ చేసేందుకు ఒక కీ ఉంటుంది. ఆ కీని థియేటర్ల యాజమాన్యాలకు ఇస్తే వారు డీ క్రిప్ట్ చేసి సినిమా ఆడిస్తారు.

సర్వర్ కు ల్యాప్ టాప్ కనెక్ట్ చేసి కొట్టేశారు


ఈ ప్రాసెస్ లో ఉన్న చిన్న లోపం కారణంగా సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగి డబ్బులు డిమాండ్ చేశారు. బాహుబలి–2 నిర్మాతలు మొత్తం ఆరుగురు బ్రాడ్‌కాస్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో యూఎండబ్ల్యూ డిజిటల్‌ సర్వీసెస్‌ ఒకటి. గతంలో ఈ సంస్థలో అంకిత్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశాడు. థియేటర్‌లోని సర్వర్‌లో సినిమా కాపీ అవుతుందన్న సంగతి ఆయనకు తెలుసు. దీంతో బాహుబలి–2కు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవాలని బిహార్‌కు చెందిన దివాకర్‌ హెల్ప్ తీసుకుని అతడి థియేటర్‌లోనే సర్వర్‌కు ఓ ల్యాప్‌టాప్‌ కనెక్ట్ చేసి హెచ్‌డీ ప్రింట్‌ను వాటర్‌మార్క్‌తో పాటు కాపీ చేసేశాడు. ఇక అక్కడి నుంచి బెదిరింపుల పర్వం మొదలైంది.

బాహుబలి-1 పైరసీ కూడా వారి పనే..


వీరికి పాట్నాకు చెందిన చందన్ తోడయ్యాడు. గతంలో బాహుబలి -1 పైరసీ చేసి దొరికిపోయిన నేరస్థులను కాంటాక్ట్ చేశాడు. వారంతా మధ్య ప్రదేశ్ , ఢిల్లీకి చెందినవారు. అందులో కీలకమైన రాహుల్ మెహతా ఇప్పుడు కూడా ఈ పైరసీ కాపీతో ఎలా డబ్బులు సంపాదించాలో ప్లాన్ చేశాడు. హైదరాబాద్‌ కు చేరుకుని బాహుబలి నిర్మాతల్లో ప్రధానమైన అర్కా మీడియాను సంప్రదించాడు. తన వద్ద చిత్రం హెచ్‌డీ ప్రింట్‌ ఉందని.. సినిమా ప్రదర్శితమైనన్ని రోజులూ వారానికి రూ.15 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. ఏ వారానికి చెల్లించకపోయినా వెంటనే ఇంటర్నెట్‌లో పెట్టేస్తానంటూ బెదిరించాడు. దాంతో నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైం పోలీసులు పాత నేరస్థులపై కన్నేసి ఢిల్లీ, బిహార్‌ల్లో వరుసదాడులు చేసి రాహుల్ సహా సైబర్ క్రిమినల్స్ అందరినీ పట్టుకున్నారు.

జన రంజకమైన వార్తలు