• తాజా వార్తలు

పేటీఎంలో కొత్త  స్కాం.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

మ‌నంద‌రం విస్తృతంగా వాడుతున్న పేటీఎంకి సంబంధించి మీకో వార్నింగ్‌. ఇది ఇచ్చింది ఎవ‌రో కాదు పేటీఎం వ్య‌వ‌స్థాప‌కుడైన విజ‌య‌శేఖ‌ర్ శ‌ర్మే. ఇంత‌కీ ఆ వార్నింగ్ ఏంటంటే..   పేటీఎం కేవైసీ ( నో యువ‌ర్ క‌స్ట‌మ‌ర్‌) చేయించుకోవాలంటే ఫ‌లానా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని మీకేదైనా కాల్ గానీ, మెసేజ్‌గానీ వ‌చ్చినా స్పందించ‌వ‌ద్ద‌ని శ‌ర్మ హెచ్చ‌రిస్తున్నారు. ఇంత‌కీ ఆయ‌న అలా ఎందుకు హెచ్చ‌రిస్తున్నారో చూద్దాం రండి..

ఇంత‌కీ ఏంటి క‌థ‌? 
జ‌నాల్ని మోసం చేయ‌డానికి సైబ‌ర్ నేర‌గాళ్లు రోజుకో కొత్త ప‌థ‌కం ప‌న్నుతున్నారు. తాజాగా మీ పేటీఎం అకౌంట్ బ్లాక్ అయింది, వెంట‌నే కేవైసీ చేయించుకోవాలి.. అందుకోసం  ఫ‌లానా యాప్ డౌన్‌లోడ్ చేసుకోండ‌ని మెసేజ్‌లు పెట్ట‌డం, కాల్స్ చేయ‌డం చేస్తున్నారు.  ఇలా వీళ్లు చెబుతున్న యాప్‌లు ఎనీ డెస్క్‌, టీమ్ వ్యూయ‌ర్‌, క్విక్ స‌పోర్ట్ లాంటి రిమోట్ షేరింగ్ యాప్స్‌. వీటిని మ‌నం ఒక్క‌సారి డౌన్‌లోడ్ చేసుకుని యాక్సెస్ ఇచ్చామంటే చాలు మీ ఫోన్ మొత్తం వాళ్ల కంట్రోల్‌లోకి వెళ్లిపోతుంది. మీరు మీ ఫోన్‌లో ఏం చేస్తున్నారో వాళ్లు ఎప్ప‌టిక‌ప్పుడు చూడొచ్చు. 

ఇటీవ‌ల చాలా మంది యూజ‌ర్లు తాము ఇలా మోస‌పోయిన‌ట్లు  ట్విట‌ర్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా తెలియ‌జేశారు.  ఒక యూజ‌ర్ ఇలాగే త‌న‌కు వ‌చ్చిన మెసేజ్ ప్ర‌కారం ఒక యాప్ ఓపెన్ చేశారు. అంతే న‌వంబ‌ర్ 14న ఆయ‌న‌ పేటీఎం వాలెట్‌లో ఉన్న 50,610 రూపాయ‌లను కొట్టేశారు. 9836240546 అనే నెంబ‌ర్‌కు ఈ అమౌంట్ ట్రాన్స్ ఫ‌ర్ అయిన‌ట్లు మెసేజ్ వ‌చ్చింది.  

 పేటీఎం ఏం చెబుతోంది?
పేటీఎం కేవైసీ కోసం వేరే ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసుకోమ‌ని పేటీఎం ఎప్పుడూ చెప్ప‌దు. కాబ‌ట్టి అలాంటి కాల్స్ లేదా మెసేజ్‌లు వ‌స్తే ఎట్టి ప‌రిస్థితుల్లో స్పందించ‌కండి. అలాంటి మెసేజ్‌ల్లో ఉండే లింక్స్‌ను క్లిక్ చేయకండి అని చెబుతుంది. వెంట‌నే ఆ  మెసేజ్‌లు డిలీట్ చేయ‌డం మంచిది. 

మ‌రి కేవైసీ చేయించుకోవ‌డం ఎలా?
నిజానికి పేటీఎం కేవైసీ చేయించుకోవాలంటే పేటీఎం యాప్‌లో రిక్వెస్ట్ పెడితే కంపెనీ ప్ర‌తినిధులే మీ ఇంటికి వ‌చ్చి ఆ ప్రాసెస్ పూర్తి  చేస్తారు. లేదంటే పేటీఎం యాప్‌లోనే మీకు ద‌గ్గ‌ర‌లో ఉన్న పేటీఎం ఆథ‌రైజ్డ్ కేవైసీ సెంట‌ర్ల వివ‌రాలుంటాయి. అక్క‌డికి వెళ్లి చేయించుకోవ‌చ్చు. 
 

జన రంజకమైన వార్తలు