ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకాల్చుకోవడానికి నిప్పు అడిగాడట మరొకడు అలా ఉంది సైబర్ నేరగాళ్ల పని. ఒక పక్క కరోన భయంతో ప్రపంచదేశాలన్నీ గజగజ వణికిపోతుంటే మరోవైపు ఇలాంటి సైబర్ క్రిమినల్స్ మాత్రం ఇంట్లో నుంచి కదలకుండానే తమ పని తాము చక్కబెట్టేసుకుంటున్నారు. స్టే ఎట్ హోమ్ సూత్రాన్ని చక్కగా పాటిస్తూనే ఆన్‌లైన్‌లో తమ పని కానిచ్చేస్తున్నారు. కరోనా సమయంలో బయటికెళ్లలేక ఆన్‌లైన్ పేమెంట్స్ చేద్దామనుకుంటున్నవారిని నిలువునా ముంచేసి అందినకాడికి దోచేస్తున్నారు.
అన్నింటికీ ఆన్‌లైనే
లాక్‌డౌన్‌తో బయటికి వెళ్లే వీల్లేక చాలా మంది కూరగాయలు, పప్పులు, ఉప్పులు, పాలు, పెరుగు లాంటివన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తున్నారు. అందుకే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈకామర్స్ పెద్ద తలకాయలు కూడా ఇప్పుడు అన్ని సర్వీసులూ కట్టిపెట్టి కేవలం ఇలాంటి సరకులే అమ్మడం మొదలుపెట్టాయి. ఏదోరకంగా ధైర్యం చేసుకుని బయటికి వెళ్లిన జనం కూడా చేతిలో నుంచి డబ్బులు ఇవ్వడం లేదు. గూగుల్‌పే, పేటీఎం, ఫోన్‌పే లాంటి వాటి ద్వారా పేమెంట్లు చేస్తున్నారు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు వాళ్ల అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బులు దోచుకుంటున్నారు.
ఇలా జాగ్రత్తపడండి
1. ఆన్‌లైన్ పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు డెబిట్ కార్డ్ కంటే క్రెడిట్ కార్డ్ వాడటం మేలు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్‌కు ప్రొటెక్షన్ ఉంటుంది. డెబిట్ కార్డులో అయితే వెంటనే మనీ కట్ అయిపోతుంది. అదే క్రెడిట్ కార్డులో అయితే మనీ ట్రాన్సాక్షన్ పూర్తవగానే మీకు మెసేజ్ వస్తుంది. అదిమీరు చేసింది కాకపోతే వెంటనే ఆమెసేజ్‌లో ఉన్న నెంబర్‌ను కాంటాక్ట్ చేయొచ్చు.
2. https: అని మొదలయ్యే వెబ్‌సైట్లలోనే ట్రాన్సాక్షన్లు చేయండి. http: అని మొదలయ్యేవాటిలో చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ఎస్ అంటే సెక్యూర్డ్ సాకెట్ లేయర్. ఇది మీ పేమెంట్స్‌కి అదనపు రక్షణ ఇస్తుంది.
3. పబ్లిక్ వైఫై కనెక్షన్ వాడుతున్నప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ చేయకండి. మీ సొంత సెక్యూర్డ్ వైఫై కనెక్షన్ ఉంటేనే ముందుకెళ్లండి.
మీ సిస్టంతో జాగ్రత్త
1. మీరు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు చేస్తున్న సిస్టం కూడా రక్షణ కలిగి ఉండాలి. లేటెస్ట్ యాంటీ వైరస్ అప్‌డేట్ చేసుకోండి.
2 ఆన్‌లైన్ వెబ్‌సైట్లు, ఈ కామర్స్ సైట్లు మీ కార్డ్ నెంబర్ సేవ్ చేసుకుంటామని అడుగుతాయి. వాటికి నో చెప్పండి. లేదంటే అవి మిస్ యూజ్ అయ్యే ప్రమాదం ఉంది.
ట్రాన్సాక్షన్ పూర్తయ్యాక
మీరు ట్రాన్సాక్షన్ ఆఫీస్‌లో లేదా ఇతర షేరింగ్ సిస్టమ్స్‌లో కనుక చేస్తే వెంటనే ట్రాన్సాక్షన్ హిస్టరీ, కుకీస్ అన్నీ డిలీట్ చేయడం మర్చిపోకండి.
ఒకవేళ మీరు ఫ్రాడ్‌కు గురయితే..
1. వెంటనే మీ బ్యాంక్‌కు కాల్ చేసి ఆ కార్డ్‌ను బ్లాక్ చేయమని చెప్పండి.
2. నెట్ బ్యాంకింగ్ లేదా పేమెంట్ యాప్‌తో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏదైనా మెసం జరిగితే వెంటనే ఆ బ్యాంక్‌కు లేదా యాప్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయండి. ప్రూఫ్స్ కూడా యాడ్ చేయండి.
3. పోలీస్ కంప్లయింట్ కూడా ఇవ్వండి. లేదంటే సైబర్ క్రైమ్ స్టేషన్‌లో సంప్రదించండి.
4. ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం ఇలాంటి కేసుల్లో బ్యాంకులు మీరు పోగొట్టుకున్న డబ్బును 90 రోజుల్లో తిరిగివ్వాలి. అప్పటికీ ఇవ్వకపోతే మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించి యాక్షన్ తీసుకోవచ్చు.