• తాజా వార్తలు

కేవైసీ అప్‌డేట్ మెసేజ్‌తో దోచేసే హ్యాక‌ర్ల నుంచి కాపాడుకోవ‌డానికి గైడ్ మీకోసం.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మీకు అకౌంట్ ఉందా?  కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లోగానీ పీఎన్‌బీలో గానీ ఖాతా ఉందా? అయితే కేవైసీ అప్‌డేట్ చేసుకోమ‌ని వాట్సాప్‌లో మీకు ఓ మెసేజ్ రావ‌చ్చు. పొర‌పాటున కూడా దాన్ని ముట్టుకోకండి. ఎందుకంటే అప్‌డేష‌న్ కోసం ఆ మెసేజ్‌లో వ‌చ్చే లింక్ క్లిక్ చేస్తే హ్యాక‌ర్లు మీ అకౌంట్‌లోని డబ్బుల‌న్నీ క్షణాల్లో ఊడ్చేస్తారు. ఈ మోసాలు ఎలా జ‌రుగుతున్నాయో వాటి బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం ప‌దండి. వాట్సాప్‌లో కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) అప్‌డేట్‌ చేసుకోవాలని మెసేజ్‌తో బ్యాంకు ఖాతాదారుల‌ను దోచుకునే కొత్త దందాకు చైనా హ్యాక‌ర్లు తెర‌లేపారు.  ఇదే కాదు ఉచిత గిఫ్ట్‌లంటూ డ‌మ్మీ లింక్‌లు పంపి డబ్బులు కొట్టేస్తున్నారని సైబర్‌పీస్‌ ఫౌండేషన్‌, ఆటోబాట్‌ ఇన్ఫోసెక్‌ అనే సంస్థలు  హెచ్చరిస్తున్నాయి. 

ఎలా జ‌రుగుతుందంటే?
 * సైబర్‌ నేరగాళ్లు ముందు మన ఫోన్‌కు కేవైసీ వెరిఫికేషన్‌ అంటూ ఓ మెసెజ్‌ పంపిస్తారు. అందులోని లింక్‌ క్లిక్‌ చేయగానే ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ పేజ్‌లాగే ఉండే పేజీ ఓపెన్‌ అవుతుంది. 
* వెంట‌నే మీ ఫోన్‌కు ఒక ఓటీపీ వస్తుంది. 
* ఓటీపీ ఎంటర్ చేయ‌గానే మరో పేజీకి రీడైరెక్ట్‌ అవుతుంది. 
* ఆ పేజీలో మీ పేరు, మొబైల్‌ నంబరు, డేట్ ఆఫ్ బ‌ర్త్ వివరాలు అడుగుతుంది. అవి ఫిల్ చేస్తే  మళ్లీ ఓటీపీ వచ్చిన పేజీకి రీడైరెక్ట్‌ అవుతుంది. 
* ఆ పేజీలో క‌నిపించే లాగిన్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేస్తే  కేవైసీ పేజీ ఓపెన్ అవుతుంది.  
*  మీ బ్యాంకు అకౌంట్ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ అడుగుతుంది. 
* ఇవ‌న్నీ అచ్చం ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ పేజీల్లాగే ఉంటాయి కాబ‌ట్టి మీకు డౌట్ రాదు. వెంట‌నే యూజ‌ర్‌నేమ్‌, పాస్‌వ‌ర్డ్ టైప్ చేస్తారు. అంతే హ్యాక‌ర్ల‌కు మీరే తాళం చేతికిచ్చిన‌ట్లు. వాళ్లు ఈజీగా దోచుకుని పోతారు. 

గిఫ్ట్‌లంటూ ఆశ పెడ‌తారు 
హ్యాకర్లు గిఫ్ట్‌లంటూ నకిలీ లింక్‌లను కూడా ఎస్‌బీఐ ఖాతాదారులకు పంపిస్తున్నారు. ఆ లింక్‌ క్లిక్‌ చేయగానే ఎస్‌బీఐ ఫొటోతో ఓ కంగ్రాచ్యులేషన్స్‌ మెసేజ్‌ వస్తుంది.  సర్వేలో పాల్గొంటే రూ. 50లక్షల బహుమతులు గెలుచుకోవచ్చనే మెసేజ్ క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారా.. మీ ప‌ర్స‌న‌ల్ డిటెయిల్స్ అడుగుతుంది. అవి ఎంట‌ర్ చేశారా అంతే సంగ‌తులు. మీ బ్యాంక్ అకౌంట్‌కు క‌న్నం ప‌డ్డ‌ట్లే 

ఎలా కాపాడుకోవాలి?
* ఎస్‌బీఐ మాత్ర‌మే కాదు ఏ బ్యాంకు కూడా కేవైసీ అప్‌డేట్ కోసం ఎలాంటి లింకుల‌నూ మొబైల్‌కు పంప‌వు. ఇది గుర్తు పెట్టుకోండి. అలాంటి మెసేజ్ వ‌స్తే కచ్చితంగా అనుమానించండి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అందులోని లింక్‌ను క్లిక్ చేయ‌కండి. 
* యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌, ఓటీపీ, సీవీవీ ఇలా మీ బ్యాంకు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివ‌రాల‌ను ఏ బ్యాంకూ ఫోన్ చేసి గానీ, మెసేజ్ చేసి గానీ అడ‌గ‌వు. ఒక‌వేళ అలా ఎవ‌రైనా అడిగితే నిర్మొహ‌మాటంగా ఇవ్వ‌న‌ని చెప్పండి. వాళ్లు మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంద‌ని బెదిరించినా స‌రే అస్స‌లు లొంగ‌కండి. ఒక‌వేళ నిజంగా బ్యాంకు అకౌంట్ బ్లాక్ అయిపోతే బ్యాంకుకెళ్లి కేవైసీ అప్‌డేట్ చేసుకుని అకౌంట్ మ‌ళ్లీ రీయాక్టివేట్ చేసుకోవ‌చ్చు. 
* ల‌క్ష‌ల ల‌క్ష‌ల గిఫ్ట్‌లు, కోట్ల కొద్దీ లాట‌రీలు వ‌చ్చాయ‌న్న కాల్స్‌, మెసేజ్‌ల‌ను న‌మ్మ‌కండి. అలాంటి లింక్‌లు మీకు మెసేజ్‌, వాట్సాప్‌, మెయిల్ ఇలా ఏ రూపంలో వ‌చ్చినా డోంట్ ట‌చ్ ఇట్‌. చూసి న‌వ్వుకుని వ‌దిలేయండి. అలా మ‌న‌కోసం ల‌క్ష‌లు, కోట్లు ఎవ‌రూ ఊరికే ఇవ్వ‌రు. ల‌లితా జ్యూయ‌ల‌ర్స్ ఆయ‌న చెప్పిన‌ట్టు  డ‌బ్బులెవ‌రికీ ఊరికే రావు క‌దా.

జన రంజకమైన వార్తలు