టోల్‌గేట్ దగ్గర టోల్ ఫీ కట్టడానికి ఆగే పని లేకుండా తీసుకొచ్చిన ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్ ఫాస్టాగ్. ఫాస్టాగ్ తీసుకున్న వాహనానికి ఓ స్టిక్కర్ ఇస్తారు. ఆ స్టిక్కర్ అంటించుకున్న వాహనం వచ్చినప్పుడు ఆర్ఎఫ్ఐడీ టెక్నాలజీ ద్వారా దూరం నుంచే టోల్ గేట్‌లో ఉన్న సెన్సర్ గుర్తించి ఆటోమేటిగ్గా గేటు పైకెత్తి దారి వదులుతుంది. దీనివల్ల చాలా టైమ్ సేవ్ అవుతుంది. అయితే ఈ ఫాస్టాగ్‌లోనూ మన సైబర్ నేరగాళ్లు అవకాశాన్ని వెతుక్కున్నారు. బెంగళూరులో ఓ ఫాస్టాగ్ యూజర్‌ను బురిడీ కొట్టించి రూ.50వేలకు టోపీ పెట్టేశారు.
ఎలా కొట్టేశారో తెలుసా?
బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి అంటూ ఒక కాల్ వచ్చింది. ఫాస్టాగ్ ఆఫర్ చేస్తున్నామని, ఇందుకోసం ఆన్‌లైన్‌లో ఓ ఫాం పంపుతున్నాం ఫిల్ చేయమని ఆ కాల్ సారాంశం. ఫాంలో కస్టమర్ బ్యాంకు యూపీఐ ఐడీ కూడా అడిగారు. ఆ వివరాలన్నీ తీసుకున్నాక ఓటీపీ వస్తుంది. అది చెబితే మీ ఫాస్టాగ్ వాలెట్ కన్ఫర్మ్ అవుతుంది అని నమ్మించారు. ఆ వ్యక్తి దాన్ని నమ్మి ఓటీపీ కూడా చెప్పేశాడు. అంతే యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తున్నానని నమ్మించిన సైబర్ క్రిమినల్ ఆ వ్యక్తి అకౌంట్‌లో నుంచి రూ. 50 వేలు కొట్టేశాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు .
ఫాస్టాగ్ పేరిట మోసపోకుండా ఏం చేయాలి?
ఇప్పుడు అందరూ ఫాస్టాగ్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి సైబర్ క్రిమినల్స్ కూడా దాని పేరుతో మోసం చేయడానికి రెడీ అయ్యారు. బెంగళూరులో 50వేలు పోగొట్టుకున్నవ్యక్తే దీనికి ఉదాహరణ. కాబట్టి మోసపోకుండా ఉండటానికి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి.
* మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ డిటెయిల్స్ ఎవరికీ చెప్పొద్దు. అలాగే యూపీఐ పిన్‌ను కూడా ఎవరికీ బహిర్గతం చేయొద్దు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామన్నా, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌ని అన్నా నమ్మొద్దు.
* మీరు ఫాస్టాగ్ తీసుకోవాలంటే MyFASTag యాప్‌లోకి వెళ్ల్లి తీసుకోండి.
* యాక్సిస్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు ఫాస్టాగ్ సేవలు అందిస్తున్నాయి. మీ కస్టమర్ ఐడీతో ఆయా బ్యాంకు వెబ్‌సైట్‌లోకి వెళ్లి లేదా మొబైల్ యాప్‌లోకి వెళ్లి ఫాస్టాగ్ తీసుకోండి.
* పేటీఎం, అమెజాన్‌లో కూడా ఫాస్టాగ్ అందుబాటులో ఉంది.
* అయితే ఇవన్నీ డైరెక్ట్‌గా వెబ్‌సైట్ లేదా యాప్‌లోకి వెళ్లి బుక్ చేసుకునేవే అని గుర్తు పెట్టుకోండి.
* వీటి నుంచి ఎవరూ మీకు ఫోన్ కాల్స్ చేసి ఫాస్టాగ్ తీసుకోమని అడగరు. అలా అడిగినా మీ యూపీఐ ఐడీ, కార్డ్ డిటెయిల్స్, పిన్ వంటివేవీ అడగరని మర్చిపోకండి.