ఈ టెక్నాలజీ యుగంలో మనం ఎలా ఎప్పుడు మోసపోతామో తెలియదు. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే మనకు తెలియకుండానే మన బ్యాంక్ ఖాతా ఖాళీ కావడం ఖాయం. అలాంటి కోవకు చెందిన ఒక ఉదంతమే గుర్గావ్‌లో జరిగింది. పేటీఎం పేరు చెప్పి ఏకంగా రూ.1.85 లక్షలు టోకరా వేశాడో సైబర్ దొంగ.. మరి ఆ సంగతేంటో ఎలా జరిగిందో తెలుసా!
కేవైసీ పేరు చెప్పి..
ఇప్పుడు నడుస్తోంది వ్యాలెట్ల కాలం. ఎలా పే చేయాలన్నా కూడా వెంటనే వ్యాలెట్ ఓపెన్ చేసి పే చేసేస్తున్నాం. అంతగా ఈ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌కి అలవాటుపడిపోయాం. ఇందుకోసం అమెజాన్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే లాంటి వాటికి మనకు సంబంధించిన బ్యాంక్ డిటైల్స్ ఇస్తున్నాం. అయితే ఇక్కడే మనం మోసపోతున్నాం. జెన్యూన్ అయితే ఫర్వాలేదు కానీ కొన్ని ఫేక్ సైట్ల వలలో పడితేనే ప్రాబ్లమ్ వస్తుంది. ఇలాగే గుర్గావ్‌లో ఒకతను కేవైసీ చేయిస్తానని చె ప్పి ఒక మాల్ మేనేజర్‌కు సంబంధించిన బ్యాంక్ డిటైల్స్ తీసుకున్నాడు. అతనికి సంబంధించి పేటీఎం వివరాలు కూడా తీసుకున్నాడు. కొద్దిసేపట్లోనే ఆ మాల్ మేనేజర్ అకౌంట్లోని రూ.1.85 లక్షల డబ్బులు మాయం అయిపోయాయి. అప్‌డేట్ చేస్తానని చెప్పి వివరాలు తీసుకున్న అతను దొరికిన కాడికి దోచుకుని ఉడాయించాడు
కేవైసీలతో జాగ్రత్త
నౌ యువర్ కస్టమర్ అంటే కస్టమర్ గురించి తెలిపే వివరాలు ఉండే డాక్యుమెంట్లు. ఇవి చాలా కాన్ఫిడెన్షియల్. కేవలం బ్యాంకు అధికారులు మాత్రమే వీటిని ఉపయోగిస్తారు. వాటిని సేకరించే హక్కు కూడా సంబంధింత అధికారులకే ఉంటుంది. దారిన పోయే ఎవరికీ ఈ హక్కు ఉండదు. కానీ ఇటీవల కొంతమంది పేటీఎం కేవైసీ చేస్తాం అంటూ రోడ్ల మీద బోర్డులు పెట్టుకుని మరీ తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ల దగ్గరకు మీరు వెళితే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీనే. ఏ వ్యాలెట్ అయినా తమకు సంబంధించిన ప్రతినిధిని అప్‌డేషన్ కోసం మన ఇంటికే పంపుతుంది. మన అడ్రెస్‌ను చెక్ చేసుకుంటుంది. కానీ ఇలా రోడ్ల మీద ఎక్కడపడితే అక్కడ చేయదు. పైగా మన అనుమతి లేకుండా వాళ్లు మన ఇంటికి రారు. ఒకవేళ అలా ఎవరైనా వస్తే అనుమానించాల్సిందే. వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందే.