సందట్లో సడేమియా అంటే ఇదే.. ఓ పక్క ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాప్తి గురించి భయపడి చస్తుంటే ఆ వైరస్ ఉనికిని చాటే మ్యాప్స్ పేరిట కొంత మంది మీ డేటా కొట్టేస్తున్నారు.. కరోనా వైరస్ వ్యాప్తిని తెలియజెప్పే డాష్‌బోర్డులు చాలా అందుబాటులోకి వచ్చాయి. హ్యాకర్లు దీని ద్వారా మీ పీసీలు, ల్యాపీల్లోకి మాల్‌వేర్ ప్రవేశపెట్టి మీ పర్సనల్ డేటా మొత్తం కొట్టేస్తున్నారని షై అల్ఫాసీ అనే సెక్యూరిటీ రీసెర్చర్ గుర్తించారు. మొత్తం డాష్ బోర్డుల్లో ఇలాంటి మాల్‌వేర్ చొప్పించేవి 50 శాతానికి పైనే ఉన్నాయని చెక్ పాయింట్ రీసెర్చ్ అనే సంస్థ ప్రకటించింది.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) కరోనా వైరస్ మహమ్మారిగా గుర్తించింది. ప్రపంచమంతా దీని తీవ్రతకు భయపడి స్కూళ్లు, కాలేజీలు మూసేశారు. జనం బయటికి రావడానికే భయపడి చస్తున్నారు. కరోనా వైరస్ ఉధృతి ఎలా ఉంది? పర్ పంచవ్యాప్తంగా అలాగే మనం ఉండే దేశంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి.. ఎంత మంది చనిపోయారు లాంటి వివరాలను తెలియజెప్పే డాష్‌బోర్డులు ఆన్‌లైన్‌లో ఇప్పుడు వందల సంఖ్యలో ఉన్నాయి. ఇవి డబ్ల్యూహెచ్‌వో డేటానే తీసుకుని మనకు రియల్‌టైమ్‌లో అందిస్తున్నాయి.
వీటి చాటునే మోసం
అయితే ఇలాంటి డాష్‌బోర్డుల ద్వారా మీ పీసీల్లో మాల్‌వేర్‌ను చొప్పిస్తున్నారని అల్ఫాసీ గుర్తించారు. దీని ద్వారా మీ పీసీ లేదా ల్యాపీల్లో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే పాస్‌వర్డ్‌లు, కార్డ్ డిటైల్స్, పర్సనల్ డాక్యుమెంట్స్ లాంటివన్నీ యాక్సెస్ చేయగలుగుతున్నారు. ప్రస్తుతానికి హ్యాకర్లు విండోస్ డివైస్‌లను మాత్రమే ఇలా హ్యాక్ చేయగలుగుతున్నారని అల్ఫాసీ అంటున్నారు. అయితే త్వరలో ఇతర డివైస్‌లకు కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశాలున్నాయని ఆయన హెచ్చరించారు.
అజోరల్ట్ అనే సాఫ్ట్‌వేర్‌తో హ్యాకింగ్
ఇలా కరోనా మ్యాప్స్‌తో మాల్‌వేర్‌ను మన పీసీల్లోకి ఇంజెక్ట్ చేయడానికి హ్యాకర్లు వాడే సాఫ్ట్‌వేర్ పేరు అజోరల్ట్ (AZORult). దీన్ని 2006లో క్రియేట్ చేశారు. పీసీల్లోకి, ల్యాపీల్లోకి చొరబడి బ్రౌజింగ్ హిస్టరీ, కుకీస్, ఐడీలు, పాస్‌వర్డ్‌లు, క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్లు వంటివన్నీ క్యాప్చర్ చేసేస్తుంది. రష్యాలో చీకటి సంస్థలు ఈ సాఫ్ట్‌వేర్‌ను ఎక్కువగా వాడుతుంటాయి. ఇప్పుడు దీన్నే హ్యాకర్లు వాడి కరోనా మ్యాప్స్ మాటున మీ డేటా కొట్టేస్తున్నారన్నమాట.
మరి మనమేం చేయాలి?
* వెరిఫైడ్ కరోనా వైరస్ డాష్‌బోర్డ్‌నే వాడండి. ఎందుకంటే ఆన్‌లైన్‌లో కొన్నివందల ఫేక్ డాష్‌బోర్డులు ఉన్నాయి.
* చాలాసార్లు ఏది ఫేక్, ఏది వైరిఫైడ్ డాష్‌బోర్డు అనేది గుర్తించడం కష్టం. అలాంటప్పుడు ఆ డాష్‌బోర్డు యూఆర్ఎల్ చెక్ చేయండి. ఫేక్ డాష్‌బోర్డు అయితే దాని స్పెల్లింగ్‌లోనో గ్రామర్‌లోనో ఎర్రర్ కనిపిస్తుంది. స్టైల్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది.
* డాష్‌బోర్డు డెవలపర్స్ మరియు డొమైన్ నేమ్ కూడా చెక్ చేయండి. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేయండి. ఇవన్నీ ఉంటే అవి దాదాపు వెరిఫైడ్ లేదా ఒరిజినల్ వెబ్‌సైట్లన్నమాట.
* డాష్‌బోర్డులో ఉన్న మ్యాప్స్‌ను క్లోజ్‌గా గమనించండి. ఒరిజినల్ మ్యాప్స్‌తో పోల్చితే ఇవి కచ్చితంగా తేడాగా ఉంటాయి. ఆ తేడా మీరు గుర్తించగలరు కూడా.