1599 రూపాయలకే ఫోన్ అని యూసీ బ్రౌజర్‌లో మీకేదన్నా యాడ్ కనిపించిందా? అది ఫ్లిప్‌కార్ట్, పేటీఎంల పేరున్న ఈ-కామర్స్ వెబ్‌సైట్లే కదా.. తక్కువ ధరకే ఫోన్ ఇస్తామంటున్నారు కదా అని కంగారుపడి కొనేస్తున్నారా? ఆగండాగండి.. ఇది మోసం. ఎందుకంటే అవి అసలు ఒరిజినల్ సైట్లే కావు. ఫ్లిప్‌కార్ట్, పేటీఎంల పేరిట నకిలీ సైట్లు తెరిచి జనం దగ్గర డబ్బులు కొట్టేస్తున్న ముఠాల పని అది.
ఇలా బయటపడింది..
టెక్నాలజీ ఎక్స్‌పర్ట్ కార్తీక్ రక్రా ఇటీవల ఓ ట్వీట్ చేశారు. తమ ఇంట్లో పని చేసే ఓ 20 ఏళ్ల కుర్రాడు వచ్చి ఫ్లిప్‌కార్ట్‌లో ఏదో వస్తువు కొనబోతే పేమెంట్ మెథడ్‌లో ఓన్లీ పేటీఎం మాత్రమే కనిపిస్తుందేమిటి అని అడిగాడని, దాంతో అనుమానం వచ్చి లోతుగా పరిశీలిస్తే అది ఫేక్ సైట్ అని తేలిందని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ పేరు చెప్పి ఫోన్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్కువ డిస్కౌంట్‌కు అమ్ముతామని ఆఫర్ పెడుతున్నారు. ముందుగానే పేటీఎం ద్వారా మనీ చెల్లించాలంటున్నారు. తర్వాత ఆ డబ్బులు కొట్టేస్తున్నారు. ప్రొడక్ట్ మాత్రం పంపడం లేదని గుర్తించానంటూ కార్తీక్ ట్వీట్ చేశాడు. ఈ మాట చెప్పగానే ఆ కుర్రాడు తన వాట్సాప్ స్టేటస్‌లో ఇది స్కామ్ అని పెట్టాడు. వెంటనే చాలామంది తాము కూడా ఇలా మోసపోయామంటూ రిప్లై ఇచ్చారు.
స్కామ్ ఎలా జరుగుతుందంటే?
యూసీ బ్రౌజర్ యాడ్స్‌లో ఫ్లిప్‌కార్ట్ డీల్ ఆఫ్ ద డే అని యాడ్స్ పెడుతున్నారు. శాంసంగ్, రెడ్‌మీ, ఒప్పో లాంటి ప్రసిద్ధ కంపెనీల ఫోన్లు 1599 రూపాయలకే అందుబాటులో ఉన్నాయని యాడ్స్ పెడుతున్నారు. ముఖ్యంగా డిజిటల్ ట్రాన్సాక్షన్లకు కొత్తవారిని, రూరల్ ఏరియాల్లో వారిని టార్గెట్ చేసుకుని ఈ యాడ్స్ పెడుతున్నారు. కొత్తవారు కాబట్టి పేమెంట్ మెథడ్‌లో ఓన్లీ పేటీఎం అని ఉన్నా పెద్దగా పట్టించుకోరని, వాళ్లు మనీ పే చేస్తే కొట్టేయచ్చన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు.
ఫ్లిప్‌కార్ట్, పేటీఎం ఏమంటున్నాయి?
ఈ సమస్యను తాము గుర్తించామని, 2018లోనే దీని మీద కస్టమర్లకు అవేర్‌నెస్ కల్పిస్తూ బ్లాగ్‌లో ప్రచురించినట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అంతేకాదు ఇలాంటి ఫిషింగ్ సైట్ల గురించి తరచూ చెక్ చేస్తున్నామని చెప్పింది. సోషల్ మీడియా సైట్లలో ఇలాంటి ఫేక్ వెబ్‌సైట్ల ద్వారా ఫ్లిప్‌కార్ట్ పేరు చెప్పి ప్రొడక్ట్‌లు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ గుర్తించింది. గత ఏడాది కాలంలో ఇలాంటి ఫిర్యాదులు చాలానే వచ్చాయని ప్రకటించింది.
భవిష్యత్తులోనూ అయినా రక్షణ ఉంటుందా?
ఇండియాలో మూడో అతిపెద్ద ఈకామర్స్ సంస్థ అయిన స్నాప్‌డీల్ జనవరి 20న ఢిల్లీ హైకోర్టు ద్వారా మంచి రక్షణ పొందింది. స్నాప్‌డీల్‌ను పోలి ఉన్న 1200 ఫేక్ లింక్స్‌ను ట్విటర్ నుంచి తొలగించాలంటూ కోర్డ్ ఆర్డర్స్ ఇచ్చింది. ఇలాగే మిగిలిన ఈకామర్స్ కంపెనీలు కూడా గట్టి చర్యలు తీసుకుంటే కస్టమర్ల డబ్బుకు, ఈకామర్స్ సంస్థల పేరుకు రక్షణ.