• తాజా వార్తలు

యాపిల్ + వాట్సాప్ vs ఎఫ్.బి.ఐ + అమెరికా ప్రభుత్వం

నేర పరిశోదనకు ఐ.టి కంపెనీలు సహకరించకపోతే తరువాయి

పరిణామం సిలికాన్ వాలీ vs అమెరికా ప్రభుత్వం

ఫోన్ ను అన్ లాక్ చేసే విషయంలో యాపిల్ సంస్థతో తలపడుతున్న అమెరికా న్యాయ శాఖ ఇప్పుడు వాట్సాప్ పైనా దృష్టి సారించింది. ఎన్ క్రిప్టెడ్ మెసేజెస్ విషయంలో వాట్సాప్ తోనూ వివాదం తలెత్తిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటివి  పదేపదే తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న కోణంలో అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ మెసేజింగ్ సర్వీస్ అయిన వాట్సాప్ తో అమెరికాలోని ఓ కోర్డుకు ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది.  మొబైల్ సెక్యూరిటీ, ప్రైవసీ విషయంలో తలెత్తుతున్న ఇలాంటి వివాదాలకు ముగింపు పలకడానికి ఒబామా ప్రభుత్వంతో కలిసి పరిష్కారం వెతికే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా యాపిల్, ఫేస్ బుక్ కు చెందిన వాట్సాప్ వంటి సంస్థలతో వివాదాలు ఏర్పడుతుండడంతో ఇది సిలికాన్ వ్యాలీ వర్సెస్ అమెరికన్ గవర్నమెంటుగా మారనుంది. అయితే... ఇంతవరకు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు మాత్రం వెలువడలేదు.

ఫేస్ బుక్ కే చెందిన మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ ఇంటర్నెట్ ఆధారంగా మెసేజిలు పంపించుకోవడానికి, కాల్సు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. గత ఏడాది ఆ సంస్థ తన సర్వీసు ఆధారంగా చేసుకునే మెసేజిలకు ఎన్ క్రిప్షన్ సదుపాయం కల్పించింది. దీంతో వాటిని థర్డ్  పార్టీలు చదివే అవకాశం ఉండదు.  కానీ... ఇది అమెరికాలో నేర పరిశోధనకు ఆటంకంగా మారుతోంది. అక్కడ ఇప్పటికే అత్యంత సురక్షితమైన ఐఫోన్ లను నేరగాళ్లు వినియోగిస్తు చట్టాలు, శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే వివాదం నడుస్తోంది. తాజాగా వాట్సాప్ ఆధారంగా జరిపిన సంభాషణలు పంపుకున్న చిత్రాలు, వీడియోలు, కాల్ డేటా కూడా పొందడానికి అవకాశం లేకపోవడంతో దర్యాప్తు సంస్థలు కేసుల విచారణలో ముందడుగు వేయలేకపోతున్నాయి. ఈ లొసుగును గుర్తించిన నేరగాళ్లు తమ నేర ప్రణాళికల అమల్లో ఐఫోన్లు, వాట్సాప్ సర్వీసులను విరివిగా వాడుకుంటున్నారు. కోర్టుల సహాయంతో కూడా దర్యాప్తు సంస్థులు, పోలీసులు ఆ డాటాను పొందలేకపోతున్నాయి.

కాగా తాజా పరిస్థితులపై అమెరికాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దశాబ్దాల కిందటి చట్టాలను మారిస్తే తప్ప ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడే అవకాశం లేదని న్యాయ నిపుణులు, సైబర్ నిపుణులు, ప్రభుత్వ విభాగాలు పేర్కొంటున్నాయి. చట్ట సవరణలతోనే దీనికి అడ్డుకట్ట వేయగలమని చెబుతున్నారు. దీంతో ఈ దిశగా చర్యలు మొదలవుతున్నాయి.

జన రంజకమైన వార్తలు