ఆన్‌లైన్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. బాగా చదువుకున్నవాళ్ళు కూడా ఈ మోసాలకు దెబ్బతినడం చూస్తుంటే సైబర్ క్రిమినల్స్ ఎంత తెలివిమీరిపోయారో అర్థమవుతుంది. ఆన్‌లైన్ మోసాలకు పేటీఎం కొత్త అడ్రస్‌గా మారింది. ఇటీవల కాలంలో చాలా ఆన్‌లైన్ స్కాములు పేటీఎం పేరుమీద జరిగాయి. ముఖ్యంగా పేటీఎం కేవైసీ చేస్తామంటూ యూజర్లను దోచుకునే మోసాలు ఎక్కువవుతున్నాయి. లేటెస్ట్ గా బెంగళూరులో ఓ డాక్టర్ ఇలాగే పేటీఎం కేవైసీ అప్డేట్ చేయబోయి 50 వేలు పోగొట్టుకున్నారు.
10 రూపాయలు యాడ్ చేయమని
ఈ నెల 11న బెంగళూరులో ఉంటున్న ఓ సీనియర్ డాక్టర్ మొబైల్ ఫోన్‌కి ఓ ఎస్ఎంఎస్ వచ్చింది. మీ పేటీఎం కేవైసీ ఈ రోజు ఎక్స్‌పైర్ అవుతుంది. కాబట్టి వెంటనే కస్టమర్ కేర్ నెంబర్ 8389888499 కి కాల్ చేయండి. లేకపోతే మీ పేటీఎం ఎకౌంటు 24 గంటల్లో బ్లాక్ అయిపోతుంది అని ఆ మెసేజ్‌లో ఉంది. డాక్టర్ ఆ నెంబర్‌కి కాల్ చేశారు. ఓ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి తన పేరు రాకేష్ అగర్వాల్ అని, పేటీఎం కన్స్యూమర్ కేర్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌నని చెప్పారు. మీ పేటీఎం ఎకౌంటు కేవైసీ అప్డేట్ చేయడానికి పేటీఎం యాప్ ఓపెన్ చేసి పది రూపాయలు యాడ్ చేయమన్నారు. డాక్టర్ తను డెబిట్ కార్డుతో ఏటీఎం అకౌంట్‌లో పది రూపాయలు యాడ్ చేశారు. వెంటనే అవతలి వ్యక్తి డాక్టర్ ఫోన్‌కు ఒక లింక్‌ను ఎస్ఎంఎస్ చేశారు. దాన్ని క్లిక్ చేయమన్నారు. అలా చేయగానే డాక్టర్ గారి అకౌంట్ నుంచి 4,891 రూపాయలు కట్ అయ్యాయి. తర్వాత మూడు నిమిషాల్లో మొత్తం 50వేలు ఆ అకౌంట్‌లో నుంచి డెబిట్ అయిపోయాయి.
ఎలా జరిగిందో తెలుసా?
ఈ సైబర్ క్రైమ్ ఎలా జరిగిందో సైబర్ డిపార్ట్‌మెంట్ నిపుణులు వివరించారు. ఇలా ఆన్‌లైన్ ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎనీ డెస్క్ లాంటి రిమోట్ యాక్సెస్ టూల్స్‌ను వాడతారు. ఒకసారి వారు పంపిన లింక్‌ను క్లిక్ చేస్తే ఈ రిమోట్ యాక్సెస్ టూల్స్ ద్వారా మీ మొబైల్ లేదా కంప్యూటర్ డెస్క్‌టాప్ మీద ఏం జరుగుతుందో వాళ్ళు ఎక్కడి నుంచైనా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కేసులో కూడా అలాగే anydesk ద్వారా రిమోట్ యాక్సెస్ తీసుకుని డాక్టర్ మొబైల్ యాప్ లో ఏం పాస్‌వర్డ్ టైప్ చేస్తున్నారా చూసి అదే పాస్‌వర్డ్‌తో ఆయన ఎకౌంట్ నుంచి డబ్బు కొట్టేశారు.