ఆన్‌లైన్ మోసగాళ్లు రోజురోజుకీ పేట్రేగిపోతున్నారు. రోజుకో కొత్త రకం మోసంతో జనాల సొమ్మును దోచేస్తున్నారు. నోయిడాలో ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారి ఒకరిని ఈ-కేవైసీ పేరిట మోసం చేసి ఆయన జీవితకాలం దాచుకున్న సొమ్మంతా దోచుకున్నారు.
ఏం జరిగింది?
నీలాచల్ మహాపాత్ర ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసి రిటైరయ్యాక నోయిడాలో ఉంటున్నారు. ఆయన స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఓ డిజిటల్ వాలెట్ కంపెనీ ప్రతినిధిని అంటూ ఒక వ్యక్తి నవంబర్ 11న మహాపాత్రను సంప్రదించాడు. ఈ-కేవైసీ పూర్తి చేయాలంటే ఒక యాప్ డౌన్‌లోడ్ చేయాలన్నాడు. ఆ తర్వాత ఒక 5 రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయాలంటూ ఒక అకౌంట్ నెంబర్ చెప్పాడు. ఈ-కేవైసీ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే ఆ 5 రూపాయలు తిరిగి మీ బ్యాంక్ అకౌంట్‌కు జమవుతాయని నమ్మించాడు. ఆ మాటలు నమ్మిన మహాపాత్ర ఆ అపరిచిత వ్యక్తి చెప్పిన యాప్ డౌన్‌లోడ్ చేసి ఆ అకౌంట్‌కు 5రూపాయలు పంపారు. వెంటనే ఆ 5 రూపాయలు తిరిగి మహాపాత్ర బ్యాంక్ అకౌంట్లో జమయ్యాయి. మరుక్షణమే ఆయన అకౌంట్లో నుంచి 7 లక్షల 33 రూపాయలను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు.
ఎలా జరిగింది?
తనకున్న రెండు బ్యాంక్ అకౌంట్లు ఆ డిజిటల్ వాలెట్‌తో లింక్ అయి ఉన్నాయని మహాపాత్ర చెప్పారు. 5 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయగానే వాళ్లు తన బ్యాంక్ అకౌంట్లో నుంచి తన సేవింగ్స్ మొత్తాన్ని కొట్టేశారని ఘొల్లుమన్నాడు.
సైబర్ నిపుణులు ఏమంటున్నారు?
ఈ-కేవైసీ అంటూ అపరిచిత వ్యక్తి చెప్పిన యాప్ డౌన్‌లోడ్ చేయడమే దీనికి కారణమంటున్నారు నిపుణులు. ఇలాంటి యాప్స్ ద్వారా సైబర్ క్రిమినల్స్ మన ఫోన్ స్క్రీన్‌ను ఎక్కడి నుంచయినా చూడగలిగే రిమెట్ లొకేషన్ యాక్సెస్ సంపాదిస్తారు. వాళ్లు మన అకౌంట్‌ను హ్యాక్ చేసి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేయగానే వచ్చే ఓటీపీని వాళ్లు ఇలా రిమోట్ లొకేషన్ యాక్సెస్ ద్వారా చూడగలుగుతారు. అలా చూసి ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే ట్రాన్సాక్షన్ పూర్తయిపోతుంది. మన అకౌంట్లో డబ్బులు వాళ్ల జేబులోకి వెళ్లిపోతాయి. మహాపాత్ర విషయంలోనూ అదే జరిగిందని సైబర్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.