• తాజా వార్తలు

పేటీఎమ్ వాడేవారు గమనించారా , మీ అకౌంట్లో డబ్బులు మాయమవుతున్నాయి 

భారతదేశపు ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ ఫారం పేటీఎం ఇతర డిజిటల్ వాల్లెట్లకు సవాల్ విసురుతూ దూసుకుపోతోంది. అయితే ఇది కూడా సైబర్ భారీన చిక్కుకుంది. ఈ నేపథ్యంలో పేటీఎం వాడే వారికి కంపెనీ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. పేటీఎం వాలెట్ ఉపయోగించేవారు కేవైసీ అప్‌డేట్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. లేదంటే ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాల బారినపడే అవకాశముందని పేర్కొంటోంది. ఇందులో భాగంగా పేటీఎం తన కస్టమర్లకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. 

మీరు ఒకవేళ మొబైల్ వ్యాలెట్‌కు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా మీ అకౌంట్‌లో డబ్బులు మాయమవుతాయని హెచ్చరిస్తోంది. ఎవరైనా మీకు ఫోన్ చేసి మీ పేటీఎం కేవైసీ ప్రాసెస్ పూర్తి చేస్తామని, అకౌంట్‌లో సమస్యలు ఉన్నాయని చెబితే అస్సలు నమ్మొద్దని హెచ్చరిస్తోంది. అలాగే ఎనీ డెస్క్, క్విక్స్ పోర్ట్ వంటి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దని తెలిపింది. కేవైసీ వివరాల అప్‌డేట్ సమయంలో ఇలాంటి యాప్స్‌ను ఉపయోగించవద్దని సూచించింది. 

మీ ఫోన్‌లో స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసి నేరగాళ్లు సులువుగా డబ్బు కాజేస్తారు.ఈ ఏడాది ఆరంభంలోనే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రిమోట్ యాప్స్‌కు సంబంధించిన నిబంధలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ యాప్స్ సాయంతో మోసగాళ్లు మీ ఫోన్ లేదా కంప్యూటర్‌ను వారి ఆధీనంలోకి తెచ్చుకుంటారు. దీంతో మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, పిన్, పాస్‌వర్డ్ వంటి వివరాలను తెలుసుకుంటారు. వీటితో మోసగాళ్లు మీ అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తారు. 

బ్యాంకులు, యూపీఐ ప్లాట్‌ఫామ్స్ కూడా యూజర్లను అప్రమత్తం చేస్తున్నాయి. ఎనీడెస్క్ లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ అస్సలు ఇన్‌స్టాల్ చేయొద్దని సూచిస్తున్నాయి.ఇలాంటి మోసాలు మాల్వేర్ ఫిషింగ్ అటాక్స్ కిందకు వస్తాయని ఢిల్లీకి చెందిన సైబర్ క్రైమ్ నిపుణుడు పవన్ దుగ్గాల్ తెలిపారు. బ్యాంకర్లు ఎవరైనా ఇలాంటి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని అడగరని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా ఇలాంటి కాల్స్ చేస్తే రెస్పాండ్ కావొద్దని, పోలీసులకు వివరాలు అందించాలని తెలిపారు.

జన రంజకమైన వార్తలు