సోషల్ మీడియాను సక్రమంగా ఉపయోగించుకునేవారు కొందరైతే దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో.. అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్న విచక్షణ లేకుండా తాము చేసే పనిని నలుగురికీ చూపడానికి సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. తాము చేసిన పనులు ఇతరులపై దుష్ప్రభావం చూపిస్తాయని తెలిసి కూడా కొందరు ఇదే ధోరణిలో సాగుతున్నారు. తాజాగా ఛండీగఢ్ కు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటూ దాన్ని ఫేస్ బుక్ లైవ్ ఇచ్చాడు. ఆత్మహత్య చేసుకోవడమే పెద్ద నేరం కాగా దాన్ని ఫేస్ బుక్ లైవ్ ఇవ్వడం మరింత దారుణమని... ఎందరో మనసులను అది కలచివేస్తుందని.. అలాగే దుర్భలుల మనసుల్లో ఆత్మహత్యా భావనలను పెంచుతుందని అంటున్నారు మానసికవేత్తలు.
ఛండీగఢ్లోని సోనిపట్ జిల్లాలో పొరుగింటి వారి వల్ల ప్రాణభయంతో 32ఏళ్ల ఓ వ్యక్తి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీపక్ అనే వ్యక్తి తన ఆత్మహత్యకు గల కారణాన్ని ఇంటిలోకి గోడపై రాసి... స్మార్ట్ ఫోన్ ఎదురుగా పెట్టుకుని ఫేస్ బుక్ లైవ్ ఆన్ చేసి మరీ ఉరివేసుకున్నాడు. పక్కంటి వివాహిత, ఆమె ప్రేమికుడిగా భావిస్తున్న వ్యక్తి నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని వివాహిత భర్తకు చెప్పినందుకే తనపై కోపం పెంచుకున్నారని దీపక్ గోడపై రాసి ఆ తర్వాత తన ఫేస్‌బుక్ పేజీలో ఆత్మహత్యను లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాడు.
కాగా ఆ వివాహిత డిల్లీ పోలీసు విభాగంలో ఏఎస్సై గా పనిచేస్తున్నారట... ఆమె ప్రియుడు హరియాణా పోలీసు విభాగంలోని ఇన్‌స్పెక్టర్. ఈ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు దీపక్ ఆమె భర్తకు చెప్పడంతో వారు దీపక్ పై పగ తీర్చుకోవాలని చూస్తున్నారు. పలు మార్లు బెదిరించారు కూడా. దీంతో భయపడిన దీపక్ ఆ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.