• తాజా వార్తలు

అక్ష‌య‌ తృతీయ.. ఆన్‌లైన్‌లోనైనా అమ్ముకుందామంటున్న జ్యువెల‌రీ షోరూమ్‌లు

భార‌తీయుల‌కు బంగారం అంటే ఎంత మోజో చెప్ప‌క్లర్లేదు.  వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్ లెక్క‌ల ప్ర‌కారం 2019లో ఇండియాలో 690  టన్నుల బంగారం అమ్ముడైందంటే మన వాళ్ల మోజు ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. ఇక అక్షయ తృతీయ అంటే మ‌న దేశంలో ప్ర‌తి ఇల్లాలు ఒక గ్రాము అయినా బంగారం కొనుక్కోవాల‌ని క‌ల‌లుగంటారు. అందుకే ఆ రోజు బంగారం షాపుల ముందు జ‌నాలు క్యూలు క‌ట్టేస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితివేరు.  లాక్‌డౌన్‌తో అన్నీమూత‌ప‌డ్డాయి. ఈ పరిస్థితుల్లో రేపు అంటే ఏప్రిల్ 26న రాబోతున్న అక్ష‌య తృతీయ‌కు ఆన్‌లైన్‌లోనే బంగారం అమ్ముకోవాల‌ని కంపెనీలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.

ఆన్‌లైన్ ఒక్క‌టే మార్గం
షాపులు మూసి ఉన్న పరిస్థితుల్లోబంగారం కొనాలంటే ఇప్పుడు ఆన్‌లైన్‌ మినహా మరో మార్గం లేదు. ఇప్ప‌టికే పేరు మోసిన చాలా జువెల్లరీ కంపెనీలు ఆన్‌లైన్ అమ్మ‌కాలు ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించాయి. పేటీఎం లాంటి పేమెంట్ సంస్థ‌లూ ఇదే బాట ప‌ట్టాయి. వీటి ద్వారా ఆన్‌లైన్‌లో బంగారం లేదంటే ఆభ‌ర‌ణాలు కొనుక్కోవ‌చ్చ‌ని చెబుతున్నాయి. లాక్డౌన్ ముగిశాక వాటిని అందుకోవ‌చ్చ‌ని క‌స్ట‌మ‌ర్ల‌ను కోరుతున్నాయి.  

ఇప్పటికే ఆన్‌లైన్‌లో బంగారం అమ్ముతున్న కంపెనీలే కొద్దో గొప్పో అక్ష‌య తృతీయ అమ్మ‌కాలు చేసుకోగ‌ల‌వ‌ని అంచ‌నా వేస్తున్నారు.ఈ లిస్ట్‌లో క‌ల్యాణ్‌ జువెల్లర్స్, లలితా జువెల్లర్స్, జోయాలుక్కాస్, జోస్‌ ఆలుక్కాస్, మలబార్, ఖజానా, తనిష్క్, బ్లూస్టోన్‌ వంటి కంపెనీలు ఆన్‌లైన్ వేదిక‌గా  అక్షయ తృతీయ అమ్మ‌కాల‌కు  పోటీపడుతున్నాయి. జ‌నాల ద‌గ్గ‌ర డ‌బ్బులు లేక‌పోయినా డిస్కౌంట్లు ఇచ్చి క‌స్ట‌మ‌ర్ల‌ను ఆకట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి.
మ‌ల‌బార్ గోల్డ్ 30% డిస్కౌంట్
అక్షయ తృతీయను పురస్కరించుకుని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ షోరూమ్‌లో బంగారు ఆభరణాల కొనుగోలు కోసం ఆన్‌లైన్‌ అమ్మకాలను ప్రారంభించినట్లు హైదరాబాద్‌లోని హబ్సిగూడ షోరూమ్‌ ఇన్‌చార్జి ఎండి అహ్మద్‌ సోఫీ తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌లో ఆభరణాలను కొనుగోలు చేయవచ్చన్నారు.  బంగారు ఆభరణాల ధరలో 30 శాతం, వజ్రాభరణాలపై 20 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నామ‌ని చెప్పారు.
జోయ్ అలుక్కాస్ తగ్గింపు ధ‌ర‌ల‌తోపాటు ఎస్‌బీఐ కార్డ్‌ల ద్వారా కొంటే అద‌నంగా 5%ఎక్స్‌ట్రా క్యాష్‌బ్యాక్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది.

అమెజాన్‌లోనూ ఆఫ‌ర్లు
ఈకామ‌ర్స్ కంపెనీ అమెజాన్ 22 క్యారట్ల బంగారు ఆభ‌ర‌ణాలపై 5 నుంచి 20%, డైమండ్ జ్యూయ‌ల‌రీ మీద 20 నుండి 60%, గోల్డ్‌
ప్లేటెడ్ జ్యూయ‌ల‌రీ మీద 60 శాతం వ‌ర‌కు డిస్కౌంట్లు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. జోయ్ అలుక్యాస్‌, మ‌ల‌బార్ గోల్డ్‌, టీబీజెడ్ లాంటితోపాటు ప‌లు మ‌ల్టీ నేష‌న‌ల్ బంగారు కంపెనీల ఆభర‌ణాలు అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌లో
మ‌రో ఈకామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కూడా ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. చెవి రింగులు 5వేల నుంచి, చైన్లు 10 వేల నుంచీ అందుబాటులో ఉంటాయ‌ని ప్ర‌క‌టించింది.
ఇంకా ఇలా చాలా జ్యుయ‌ల‌రీ షోరూమ్‌లు ఆఫ‌ర్లు ఇచ్చాయి.

ఎలా కొనుక్కోవాలంటే..
* కస్టమర్లు ఆన్‌లైన్‌లో ఆభ‌ర‌ణాల‌మ్మే  కంపెనీల వెబ్‌సైట్లో తమకు కావాల్సిన నగలు, కాయిన్స్‌ను ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు.

* ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి పేమెంట్‌ యాప్స్‌ ద్వారా కూడా బుక్‌ చేసుకోవచ్చు.  

*లాక్‌డౌన్‌ ముగిశాక నిర్దేశిత రోజుల్లో దుకాణానికి వెళ్లి వాటిని  తెచ్చుకోవచ్చు.

* లాక్‌డౌన్ పూర్త‌య్యాక కస్టమర్ కావాలంటే ఇంటికే డెలివరీ చేస్తారు.

టార్గెట్ రీచ్ అవ‌డం క‌ష్ట‌మే
దేశంలో బంగారం అమ్మ‌కాల్లో 30 నుంచి 40 శాతం అక్ష‌య తృతీయ రోజునే అమ్ముతారని అంచ‌నా.  అయితే క‌రోనా లాక్‌డౌన్‌తో జ‌నాల ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవు. బాగా డ‌బ్బుండి, అక్ష‌య తృతీయ రోజున త‌ప్ప‌కుండా  బంగారం కొనుక్కోవాల‌న్న సెంటిమెంట్ ఉన్న‌వాళ్లే ఆన్‌లైన్‌లో కొంటార‌ని భావిస్తున్నారు. ఈ లెక్క‌న  మొత్తం వినియోగదార్లలో ఒక 20 నుండి 30 శాతం మంది ఆన్‌లైన్లో బంగారం కొంటార‌ని కంపెనీలు ఆశ‌ప‌డుతున్నాయి. కానీ వాస్త‌వ పరిస్థితులు చూస్తే అంత అమ్మే ప‌రిస్థితి కూడా క‌నిపించడం లేద‌ని బిజినెస్ వ‌ర్గాలు అంచ‌నా క‌డుతున్నాయి.    

 

 

జన రంజకమైన వార్తలు