కరోనా ఎఫెక్ట్‌తో బాగా దెబ్బతిన్న రంగాల్లో ఈ-కామర్స్ కూడా ఒకటి. తెలుగువారింటి ఉగాది పండగ సేల్స్‌కు లాక్‌డౌన్ పెద్ద దెబ్బే కొట్టింది. ఇక సమ్మర్ వస్తే ఏసీలు, ఫ్రిజ్‌లు, కూలర్ల వంటివి ఈకామర్స్ సైట్లలో జనం బాగా కొంటారు. ఇప్పుడు వాటన్నింటికీ గండిపడిపోయింది. విధిలేని పరిస్థితుల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈకామర్స్ లెజెండ్స్ ఉప్పులూ, పప్పులూ కస్టమర్లకు అందిస్తూ కాలం గడుపుతున్నాయి. అసలు గ్రాసరీ సెక్షనే లేని మింత్రా, టాటాక్లిక్ వంటి సైట్లయితే నో ఆర్డర్ అని బోర్డులు పెట్టేశాయి. అయితే ఏప్రిల్ 20వతేదీ నుంచి కొన్ని వెసులుబాట్లు ఇస్తామని కేంద్రం ప్రకటించిన పరిస్థితుల్లో ఈ-కామర్స్ సంస్థల మీద ఓ లుక్కేద్దాం.
20 తర్వాత
ఏప్రిల్ 20 తర్వాత నిత్యాసర వస్తువులతోపాటు ఆ కేటగిరీ కాని వస్తువులను కూడా డెలివరీ చేసేందుకు ఈకామర్స్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, పేటీఎం మాల్ లాంటి ఈ కామర్స్ కంపెనీలు ఏప్రిల్ 20 వతేదీ నుంచి నిత్యావసరేతర వస్తువులను కూడా డెలివరీ చేసేందుకు అనుమతించారు.
* లాక్‌డౌన్‌తో విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. కాబట్టి పిల్లలకు కొత్త ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్, స్టేషనరీని ఆన్‌లైన్ లో ఆర్డరు చేయవచ్చని ఈకామర్స్ కంపెనీలు ప్రకటించాయి.
* పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రోడ్డు, రైలు మార్గాల్లో కూడా అన్ని రకాల సరకుల రవాణాకు అనుమతులిచ్చారు.
* కోల్డ్ స్టోరేజీలు, వేర్ హౌసింగ్ గోదాములు తెరిచేందుకు అనుమతించారు. దీంతో టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు లాంటి వస్తువులు అమ్ముకోవడానికి వెసులుబాటు వచ్చినట్లే.
మెడిసిన్స్ డెలివరీలోకి ఉబెర్
మరోవైపు జనం బయటికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో క్యాబ్ అగ్రిగేటర్లు ఈగలు తోలుకోవాల్సి వస్తోంది. ఓలా, ఉబెర్‌ల మీద ఆధారపడిని లక్షలాది మంది డ్రైవర్లు ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంటింటికీ తిరిగి మెడిసిన్స్ డెలివరీ చేసే సేవలను ఉబర్ ప్రారంభించింది. ఈ-హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్ మెడ్‌లైఫ్‌తో ఒప్పందం చేసుకుంది. . హైదరాబాద్, కోల్‌కతా, జైపూర్, లఖ్‌నవ్, పుణె నగరాల్లో ఈ సేవలు అందించనున్నట్లు ఉబర్ జనరల్ మేనేజర్ శివ శైలేంద్రన్ చెప్పారు.