• తాజా వార్తలు

జియో ఈకామ‌ర్స్ యాప్ మ‌రో విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణేనా?

రిల‌య‌న్స్ కంపెనీ ఏ రంగంలో అడుగుపెట్టినా సంచ‌ల‌న విజ‌యమే. గ‌త సంవ‌త్స‌రం జియోతో అది మ‌రోసారి ప్రూవ్ అయింది.  ఇప్పుడు ఇండియాలో బాగా వేగంగా ఎదుగుతున్న ఈకామ‌ర్స్ మీద రిల‌యన్స్ గురిపెట్టింది. అయితే మిగిలిన ఈ కామ‌ర్స్ సంస్థ‌ల్లా కాకుండా ఆఫ్‌లైన్ వ్యాపారుల‌ను కూడా ఇందులో భాగం చేయ‌డం ద్వారా ఈకామ‌ర్స్‌కు కొత్త మార్గం చూపించబోతోంది.

ఓ టూ ఓ ప‌ద్ధతిలో వ్యాపారం
జియో ఈకామ‌ర్స్‌ను కొత్త‌గా నిర్వ‌చించ‌బోతోంది. ఆన్‌లైన్ టు ఆఫ్‌లైన్ (O 2 O) ప‌ద్ధ‌తిని ఎంచుకుంటోంది. దీనిలో జియో ఒక ఈకామ‌ర్స్ యాప్‌ను రిలీజ్ చేస్తుంది. దానిలో చూసి మీరు ప్రొడ‌క్ట్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేసుకోవ‌చ్చు. ఆ ప్రొడ‌క్ట్ మీకు ద‌గ్గ‌ర‌లోని కిరాణా కొట్టు లాంటి చిన్న చిన్న స్టోర్లో ఉంటే వెళ్లి దాన్ని తెచ్చుకోవ‌చ్చు. లేదంటే డెలివ‌రీ ఇమ్మ‌న్నా వెంట‌నే ఇస్తారు. కావాలంటే ఆ షాప్‌కి వెళ్లి కొనుక్కుని రిల‌య‌న్స్ యాప్ ద్వారా పేమెంట్ చేయొచ్చు కూడా. ఇదేకాక రిల‌య‌న్స్ సూప‌ర్ మార్కెట్‌లు, మార్ట్‌లు, రిల‌య‌న్స్ ప్రెష్‌ల పేరుతో దేశ‌వ్యాప్తంగా ఉన్న 7,573 స్టోర్స్ కూడా ఇందులో భాగ‌మవుతాయి. ఇలా చేయ‌డం వ‌ల్ల  రిల‌య‌న్స్ ప్రెష్‌, స్టోర్‌, సూప‌ర్ మార్కెట్ క‌స్ట‌మ‌ర్లు, జియో యూజ‌ర్లు, చిన్న చిన్న దుకాణాలవారు అంద‌రూ కూడా ఈ నెట్‌వ‌ర్క్‌లోకి వ‌స్తారు. ఇది త‌మ ఈకామ‌ర్స్ నెట్‌వ‌ర్క్‌కి తిరుగులేని యూజ‌ర్ బేస్ అని రిల‌య‌న్స్ న‌మ్ముతోంది. 

టోకెనైజేష‌న్ .. కొత్త కాన్సెప్ట్‌
ఇక దీంతోపాటు టోకెనైజేష‌న్ అనే కొత్త కాన్సెప్ట్‌ను కూడా ప్ర‌వేశ‌పెట్టింది. అంటే జియో వాలెట్ ద్వారా యూజ‌ర్లు తాము పొందే ఎక్స్‌క్లూజివ్ టోకెన్ల‌ను జియో ఈకామ‌ర్స్ యాప్‌లో షాపింగ్‌కు వాడుకోవ‌చ్చు.  ఇలా జియోలో వ‌చ్చిన టోకెన్స్ ఈకామ‌ర్స్ యాప్‌లో కొనుగోళ్ల‌కు ఉప‌యోగించుకోవ‌డం ద్వారా త‌మ క‌స్ట‌మ‌ర్ బ‌య‌టికిపోర‌ని, మ‌నీ ఇక్క‌డే స‌ర్క్యులేట్ అవుతుంద‌న్న‌ది రిల‌య‌న్స్ ఆలోచ‌న‌. 

వ్యాపారుల‌కూ ఉప‌యోగ‌మే
మ‌ర్చంట్స్‌, యూజర్లు అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డేలా ఒకే యాప్‌ను తీసుకురాబోతోంది. ప్రయోగాత్మ‌కంగా ముంబ‌యి, అహ్మ‌దాబాద్ న‌గ‌రాల్లోని 5వేల కిరాణా దుకాణాల‌ను ఈ ఫ్లాట్‌ఫాంమీద‌కి తీసుకొచ్చింది. 

* దీనిలో దుకాణ య‌జ‌మానులు రిల‌య‌న్స్ ఈకామ‌ర్స్ యాప్‌తో పేమెంట్స్ స్వీక‌రిస్తారు.  

* వ‌స్తువు ర‌వాణా, ఆర్డ‌ర్లు స్వీక‌రించ‌డం అన్నీ ఈ యాప్‌లోనే చేసుకోవ‌చ్చు. 

* దుకాణ య‌జ‌మానులు టాక్స్‌లు ఈ యాప్‌తోనే క‌ట్టుకోవ‌చ్చు.

* ఇత‌ర దుకాణాల‌వారితో టై అప్ చేసుకుని బిజినెస్ పెంచుకోవ‌చ్చు. 

* ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు క‌స్ట‌మ‌ర్ల‌కు అందించ‌వ‌చ్చు. 

 

జన రంజకమైన వార్తలు