• తాజా వార్తలు

స్విగ్గీ, జొమాటో రూట్ మారింది.. కూర‌గాయ‌ల నుంచి లిక్క‌ర్ దాకా హోం డెలివ‌రీ!!

క‌రోనా లాక్‌డౌన్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మార్పులు తెచ్చింది. తెస్తోంది కూడా.. మ‌నుషుల అల‌వాట్లు, వ్య‌వ‌హారాలే కాదు. కంపెనీల తీరుతెన్నులు కూడా మారిపోతున్నాయి. వర్క్ ఫ్రం హోం ఐటీ, బీపీవోల‌ను దాటి మిగ‌తా రంగాలకూ వ‌చ్చేసింది. ఇప్పుడు ఈకామ‌ర్స్ సంస్థ‌ల వంతు... ప్యాష‌న్‌, ఎల‌క్ట్రానిక్ గూడ్స్ స‌ప్ల‌యి చేసే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు మొన్న‌టిదాకా ప‌ప్పులు, ఉప్పులు స‌ర‌ఫ‌రా చేశాయి. మ‌రోవైపు ఫుడ్ ఆర్డ‌ర్స్ తీసుకునే స్విగ్గీ, జొమాటోలు అంత‌కు మించి ముందుకెళుతున్నాయి. 

ఏపీలో కూరగాయ‌లు, పండ్ల స‌ర‌ఫ‌రా
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూర‌గాయ‌లు, పండ్ల రైతులు న‌ష్టపోకుండా వారి నుంచి పంట‌ల‌ను ప్ర‌భుత్వ‌మే కొంటామ‌ని ప్ర‌క‌టించింది. అయితే వీటిని వినియోగ‌దారుల‌కు అమ్మ‌డానికి లాక్డౌన్‌లో క‌ష్టం కాబ‌ట్టి  ఆర్డ‌ర్ ఇచ్చిన‌వాళ్ల‌కు హోం డెలివ‌రీ చేస్తామని చెబుతోంది. ఇందుకోసం ఇప్ప‌టికే ఫుడ్ డెలివ‌రీతో జ‌నాల‌కు ద‌గ్గ‌ర‌యిన స్విగ్గీ,జొమాటోల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. త్వ‌ర‌లోనే ఇది ప‌ట్టాలు ఎక్క‌బోతుంది. 

జొమాటోతో లిక్క‌ర్ హోం డెలివ‌రీ
మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో వైన్‌షాపులు తెరిచారు. కానీ 45 రోజులుగా మందుకు మొహం వాచిపోయిన  మ‌ద్యం ప్రియులు ఒక్క‌సారి వ‌చ్చిప‌డ‌టంతో భౌతిక దూరం పాటించ‌డం క‌ష్టంగా మారింది. దీంతో వైర‌స్ వ్యాప్తి చెందే ప్ర‌మాద‌ముంద‌ని డాక్ట‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అందుకే ప‌శ్చిమ‌బెంగాల్‌తోపాటు కొన్ని రాష్ట్ర్రాలు లిక్క‌ర్ హోం డెలివ‌రీ మొద‌లుపెట్టాయి.
 ఈ క్రమంలో జొమాటో కూడా మద్యం డెలివరీ రంగంలోకి ప్రవేశించాలని చూస్తున్నట్టు స‌మాచారం. లాక్‌డౌన్లో ఫుడ్ డెలివ‌రీ బిజినెస్ ఎలాగూ లేదు కాబ‌ట్టి డిమాండ్ ఉన్న లిక్క‌ర్‌ను హోం డెలివ‌రీ చేయాల‌ని ఆలోచించి, అందుకోసం  చర్చలు కూడా జరుపుతోంది. ఇంటర్నేషనల్‌ స్పిరిట్స్‌ అండ్ వైన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఐఎస్‌డబ్ల్యూఏఐ).. జొమాటో, ఇతర సంస్థలతో మద్యం హోం డెలివరీకి సంబంధించి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.  హోం డెలివరీతో భౌతిక‌దూరం పాటిస్తూ మద్యం అమ్మ‌కాలు చేయొచ్చని  జొమాటో సీఈవో మోహిత్‌ గుప్తా.. ఐఎస్‌డబ్ల్యూఏఐ ముందు ప్రతిపాదన పెట్టార‌ట‌.  చూద్దాం జొమాటో ఓపెన్ చేసి ఒక క్వార్ట‌ర్ మందు, రెండు బీర్లు ఆర్డ‌ర్ చేసే రోజులొస్తాయేమో!!
 

జన రంజకమైన వార్తలు