ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ తన వినియోగదారులకు నిత్యావసర వస్తువులకు లోన్ ఇచ్చే అమెజాన్ పే లేటర్‌తో ఇండియన్ మార్కెట్‌లో కొత్త చర్చకు తెర లేపింది. క్రెడిట్ కార్డులున్నవాళ్లకు మాత్రమే ఉండే ఈ అవకాశం ఇప్పుడు అమెజాన్ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చినట్లయింది. అయితే ఎంత వరకు లోన్ ఇస్తారో ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం అమెజాన్ నిర్ణయిస్తుంది. ఇక తాజాగా సోషల్ మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్ కూడా ఇదే బాటలోకి రాబోతుందని తెలుస్తోంది. వాట్సాప్ లోన్స్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది.
వాట్సాప్‌కు ఇండియాలో దాదాపు 40 కోట్ల మంది యూజర్లున్నారు. ఇందులో లోన్ తీసుకుని రీపేమెంట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నావాళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇలాంటి వారినే టార్గెట్‌గా కొత్త బిజినెస్ మాడ్యూల్‌లోకి వెళ్లాలని వాట్సాప్ భావిస్తోంది. అర్హులైన వాట్సాప్ యూజర్లు అందరికీ రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏప్రిల్ మొదటివారంలో చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
పేమెంట్స్‌కే ఇంకా పర్మిషన్ రాలేదు
అయితే ఇండియాలో బ్యాంకింగ్ వ్యాపారం చేయాలంటే చాలా రూల్స్ ఉంటాయి. నాన్ బ్యాంకింగ్ కంపెనీలు ఇలాంటివి ఏవైనా చేయాలంటే బ్యాంకులతో పార్టనర్‌షిప్ పెట్టుకుని ముందుకెళ్లాల్సిందే. ఇప్పటికే వాట్సాప్ లక్షల మంది వినియోగదారులతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సర్వీస్ ప్రారంభించింది. వాట్సాప్ పేమెంట్స్ అని దీనికి పేరు కూడా పెట్టింది. అయితే రెగ్యులేషన్ రూల్స్ ఇంకా పూర్తి చేయనందున ప్రస్తుతానికి వాట్సాప్ పేమెంట్స్ కూడా అగిపోయింది. కోటి మంది వినియోగదారులకు వాట్సాప్ చెల్లింపులు చేస్తామని ఫిబ్రవరిలో వాట్సాప్ పేర్కొంది. అయితే ఇప్పటికి ఇంకా అది పట్టాలెక్కలేదు.
యూజర్ బేసే బలం
వాట్సాప్‌కు ఇండియాలో 40 కోట్ల మందికిపైగా వినియోగదారులున్నారు. ఇప్పటికే డిజిటల్ చెల్లింపుల రంగంలో ఉన్న పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వినియోగదారులందరినీ కలిపినా ఇంతమంది ఉండరని అంచనా. సో వాట్సాప్ యూజర్ బేసే దానికి పెద్ద ఆస్తి. అందుకే వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తోంది.