• తాజా వార్తలు

1000 బ్రాండ్ల‌తో పేటీఎమ్ ఒప్పందం

ప్ర‌ముఖ ఇ-కామ‌ర్స్ సంస్థ పేటీఎమ్ రోజురోజుకూ త‌న మార్కెట్ ప‌రిథి విస్త‌రించుకుంటోంది. వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించ‌డానికి త‌న సైట్లో అన్ని ర‌కాల బ్రాండ్లు, అన్ని ర‌కాల వ‌స్తువులు దొరికేలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. దీనిలో భాగంగానే ఈ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం తాజాగా 1000 బ్రాండ్ల‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వీటిలో పూమా, శాంసంగ్‌, సెన్‌సొలైట్‌, కాసియో, లాక్మి లాంటి ప్ర‌ముఖ సంస్థ‌లు కూడా ఉన్నాయి.  ఇప్ప‌టిదాకా పేటీఎమ్‌లో చిన్న స్థాయి వ్యాపార సంస్థ‌లే ఉన్నాయి. ఐతే మార్కెట్‌ను మ‌రింత విస్తృతం చేసుకోవ‌డానికి, వినియోగ‌దారుల‌కు ఎక్కువ ప్రొడెక్ట్‌ల‌ను అందుబాటులో ఉంచ‌డానికి పేటీఎమ్ ఈ ఒప్పందం చేసుకుంది.  త‌మ ఆన్‌లైన్ స్టోర్ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే కాక వీలైనంత ఎక్కువ మంది సెల్ల‌ర్స్‌కు ఉప‌యోగ‌ప‌డాల‌నేది త‌మ ల‌క్ష్య‌మ‌ని పేటీఎమ్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ బ‌గారియా చెప్పారు. 

ఎక్కువ ప్ర‌జాద‌ర‌ణ పొందిన ఎలక్ట్రానిక్ ఉప‌క‌ర‌ణాల‌తో పాటు దుస్తుల కంపెనీల‌తో ఆన్‌లైన్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం చేసుకున్న నేప‌థ్యంలో పేటీఎమ్ ఈ ఎత్తుగ‌డ వేసింది. ఇటీవ‌లే ఫ్లిప్‌కార్ట్ సంస్థ హెచ్‌పీ, వైల్డ్‌క్రాఫ్ట్‌, పీట‌ర్ ఇంగ్లాండ్‌, బోస్క్ లాంటి కంపెనీల‌తో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం చేసుకుంది. ఫ్లిప్‌కార్టుకు వీలైనంత ఎక్కువ పోటీ ఇచ్చే ఉద్దేశంతో పేటీఎమ్ భారీ ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆన్‌లైన్ బ్రాండ్ స్టోర్ల‌కు పూర్తి స్వాతంత్రం ఉంటుంద‌ని, త‌మ ఫ్లాట్‌ఫాంలో ఉత్ప‌త్తులను అమ్ముతున్న సెల్ల‌ర్ల‌పై వీరికి పూర్తి అధికారాలు ఉంటాయ‌ని పేటీఎమ్ తెలిపింది. 

తమ సంస్థ‌కు సంబంధించిన వ‌స్తువుల‌ను త‌మ ఆన్‌లైన్ స్టోర్  ద్వారా ఆ సంస్థ‌లు ప్ర‌చారం చేసుకోవ‌చ్చ‌ని పేటీఎమ్ చెప్పింది. ఆఫ్‌లైన్ స్టోర్ల‌తో పోలిస్తే ఆన్‌లైన్‌లో పెద్ద బ్రాండ్ల‌ను కొన‌డానికి వినియోగ‌దారులు ఆస‌క్తి చూపిస్తున్నారని పేటీఎమ్ తెలిపింది. త‌మ‌కు న‌చ్చిన వ‌స్తువులు కొనుక్కోవ‌డానికి, అవి న‌చ్చ‌క‌పోతే రిట‌ర్న్ ఇవ్వ‌డానికి, సంతృప్తి ఇవ్వ‌క‌పోతే ఫీడ్‌బ్యాక్ ఇవ్వ‌డానికి ఈ ఆన్‌లైన్ స్టోర్లు వేదిక అవుతున్నాయ‌ని.. అందుకే ఆఫ్‌లైన్ క‌న్నా క‌న్నా ఇది వినియోగ‌దారుల‌కు ఎక్కువ సంతృప్తినిస్తుంద‌ని భావిస్తున్న‌ట్లు పేటీఎమ్ పేర్కొంది. 

 

జన రంజకమైన వార్తలు