అక్షయ తృతీయ బంగారం అంటే ఎంతో మోజుపడే భారతీయ మహిళలు కొంతకాలంగా అక్షయ తృతీయకు ఎంతో కొంత బంగారం కొనడం మొదలుపెట్టారు. దీంతో అక్షయ తృతీయ రోజున ఆకట్టుకునే ఆఫర్లతో జ్యూయలరీ షాపులు ఏడాదిలో చేసే బిజినెస్‌లో 30 శాతం వరకు ఆ ఒక్కరోజే చేసేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం అక్షయ తృతీయను లాక్‌డౌన్ చావుదెబ్బ కొట్టింది. షాపులు తీసే సీన్ లేదు కనీసం ఆన్‌లైన్‌లోనైనా అమ్ముకుందామని ప్రయత్నించిన కంపెనీలకు తీవ్ర నిరాశే మిగిలింది.
95% ఢమాల్
నెల రోజులుగా లాక్‌డౌన్.. అదీ పెళ్లిళ్ల సీజన్ బంగారం వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. అక్షయ తృతీయ రోజున ఆన్‌లైన్ అమ్మకాలతో ఎంతోకొంత గట్టెక్కుదామనుకున్నారు. అయితే ఆదివారం నాడు బంగారం, ఆభరణాల విక్రయాలు జస్ట్ 5 శాతం మాత్రమే జరిగాయని ఏఐజీజేడీసీ చైర్మన్ అనంత పద్మనాభన్ చెప్పారు. అమ్మకాలు 95 శాతం పడిపోవడంతో తీవ్ర నిరాశే మిగిలిందని చెప్పారు.
ఎన్ని ఆఫర్లు ఇచ్చినా
కొనుగోలుదారులకు ఆకర్షించేందుకు చాలా కార్పొరేట్ నగల దుకాణాలు ప్రత్యేక ఆఫర్లతో ఆన్‌లైన్ సేల్స్ ప్రకటించాయి. కానీ జనం మాత్రం డబ్బులు బయటికి తీయడానికి ఇష్టపడలేదు. ఉన్న కాస్త డబ్బులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోకపోతే ఈ కష్టకాలంలో మరింత కష్టపడతామని భావించి ఎవరూ బంగారం జోలికి వెళ్లలేదు. సెంటిమెంట్ కంటే పొదుపుకే ఓటేయడంతో ఆన్‌లైన్ అమ్మకాలు 10 శాతం కూడా జరగలేదని కల్యాణ్ జువెలర్స్ సీఎండీ కల్యాణరామన్ చెప్పారు.