కరోనా పాజిటివ్ రోగి దగ్గరకు మీరు వెళ్లినా, ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చినా అలర్ట్ చేసే యూనిక్ ఫీచర్‌తో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్‌ను డిజైన్ చేయించింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ స్టోర్లలో దీన్ని పెట్టించండి. కేవలం 13 రోజుల్లోనే 5 కోట్ల డౌన్‌లోడ్స్‌తో రికార్డులు సృష్టించిందీ యాప్. తాజాగా ఈ యాప్ మరోమారు వార్తల్లోకి వచ్చింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఇకపై తన డెలివరీ బాయ్స్ అందరూ స్మార్ట్‌ఫోన్లలో తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఉండాల్సిందేనని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చేసింది.
మా బాయ్స్ సేఫ్టీ కోసం
మా డెలివరీ పార్టనర్స్ (డెలివరీ పర్సన్స్) అందరూ వాళ్ల స్మార్ట్‌ఫోన్లలో మస్ట్‌గా ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకుని దానికి కావాల్సిన పర్మిషన్లన్నీ ఇవ్వాలని చెప్పాం అని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ప్రకటించారు. మేం ఆరోగ్యసేతు యాప్ వాడటం వల్ల రెండు రకాల లాభాలున్నాయి. ఒకవేళ కరోనా పాజిటివ్ కేసు దగ్గరకు మేం డెలివరీకి వెళితే అధికారులు ఈజీగా మమ్మల్ని ట్రేస్ చేయొచ్చు. దీనివల్ల మా డెలివరీ బాయ్స్‌ను ఐడెంటిఫై చేయడం, ఐసోలేట్ చేసి పరీక్షలు చేయడం సులువవుతుంది. పరీక్షల్లో ఏమీ లేకపోతే క్వారంటైన్ చేయడం ఉంటే చికిత్స చేయడం వెంటనే జరుగుతుంది అని గోయల్ చెప్పారు.
కస్టమర్‌కు భరోసా
ఇక మేం ఆరోగ్యసేతు యాప్ వాడుతున్నామంటే కస్టమర్‌కు కూడా మా డెలివరీ పర్సన్ మీద నమ్మకం కలుగుతుంది. వీళ్లు ఇంత కేర్‌గా ఉన్నారంటే వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకునే ఉంటారని వారికి భరోసా ఏర్పడుతుంది అని గోయల్ అంటున్నారు.
తొలిసారి బలవంతం చేశాం
మేం మా డెలివరీ పార్టనర్స్‌ను చాలా గౌరవంగా చూస్తాం. ఎందుకంటే మా విజయానికి వారే మూలసూత్రధారులు. అందుకే వాళ్లను మేం ఎప్పుడూ ఏ విషయంలోనూ బలవంతపెట్టలేదని గోయల్ మీడియాతో చెప్పారు. ఆఖరికి మా ట్రేడ్‌మార్క్ డ్రెస్ అయిన జొమాటో రెడ్ టీ షర్ట్ వేసుకోమని కూడా మేం ఎప్పుడూ వాళ్లను బలవంతపెట్టలేదు. కానీ ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యసేతు యాప్ మాత్రం మా వాళ్ల ఫోన్‌లో ఉండాల్సిందేనని కచ్చితంగా చెప్పాం అని గోయల్ అంటున్నారు. మొత్తానికి మంచి ప్రయత్నమే.