ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకుంటోంది. వాటిలో ఏటీఎంలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. భారత్‌లో పని చేస్తున్న ఏటీఎంలు కన్నా పని చేయని ఏటీఎంల సంఖ్యే ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు. డీమానిటైజేషన్ తర్వాత నోట్లు మార్చడం వల్ల చాలా ఏటీఎంలు అప్‌డేషన్ లేక మూత పడ్డాయి. ఎక్కడి వెళ్లినా నో క్యాష్ బోర్డులే కనిపించేవి. అందుకే అయితే ఉన్న ఏటీఎంలనైనా కాపాడుకోవాలని రిజర్వ్ బ్యాంక్ అనుకుంటోంది. దీనికి సంకేతంగా ఇటీవలే ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఏటీఎంలో డబ్బులు లేకపోతే ఆ బ్యాంకుకు పెనాల్టీ విధించాలని ఆర్‌బీఐ భావిస్తోంది.
డబ్బులు ఉంచకపోతే..
ఏటీఎంలు నిర్వహించడం అంటే వాటిని అలంకారప్రాయంగా ఉంచడం కాదని డబ్బులు ఉంచాలని ఆర్‌బీఐ బ్యాంకులను కోరుతోంది. అందుకే ప్రతి ఏటీఎంలో కచ్చితంగా మనీ ఉండి తీరాలని.. రోజుల రోజుల పాటు ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తే కచ్చితంగా ఆ ఏటీఎంలకు సంబంధించిన బ్యాంకులపై పెనాల్టీ విధించాలని ఆర్‌బీఐ విధి విధానాలను రూపొందించింది. అయితే ఈ చట్టం ఇంకా అమల్లోకి రాకపోయినా త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
3 గంటలే సమయం
ఒక ఏటీఎంలో డబ్బులు లేకపోతే మళ్లీ డబ్బుని నింపడానికి ఆ బ్యాంకుకు కేవలం 3 గంటలే సమయం ఇవ్వనుంది ఆర్‌బీఐ. ఏ మాత్రం లేట్ అయినా కస్టమర్లు ఇబ్బందిపడినట్లు తెలిసినా ఆయా బ్యాంకులకు భారీగా జరిమానా విధిస్తామని ఆర్‌బీఐ చెబుతోంది. ఇందుకోసం ప్రతి ఏటీఎంలో సెన్సార్లు బిగిస్తామని డబ్బులు నిండుకున్న వెంటనే ఆయా బ్యాంకులకు సమాచారం వెళుతుందని వెంటనే వాళ్లు స్పందించి డబ్బులు నింపాలని ఆర్‌బీఐ చెబుతోంది.
కమిటీ వేసింది
ఆర్‌బీఐ ఇందుకోసం ఆరుగురు సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీని వేసింది. ఆ కమిటీ ఏటీఎంలకు ఏఏ అవసరాలు ఉంటాయి.. డబ్బులు అయిపోయిన తర్వాత నింపడానికి ఎంత సమయం పడుతుంది లాంటి విషయాలను ప్రాక్టీకల్‌గా తెలుసుకోనుంది. ప్రస్తుతం ప్రతి బ్యాంకు తమ కస్టమర్లకు విత్‌డ్రాయిల్ లిమిట్ పెట్టాయి. ఆ లిమిట్ దాటితే ఛార్జ్‌లు విధిస్తున్నాయి. కస్టమర్ల పట్ల అంత కఠినంగా ఉంటున్న బ్యాంకులు ఏటీఎంలు ఎలా ఖాళీగా ఉంచి వారికి ఇబ్బందులు కలిగిస్తాయని ఆర్‌బీఐ ప్రశ్నిస్తోంది.