యాక్సిస్ బ్యాంక్ ప్రైవేటు రంగ బ్యాంకుల్లో దేశంలోనే మూడో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు 3 వేల బ్రాంచిలున్నా అందులో ఎక్కువ శాతం నగరాలు, ప్రధాన పట్టణాల్లోనే ఉన్నాయి. నగరాలు, పెద్ద పట్టణాల్లోని చాలా పరిశ్రమలు, పెద్ద సంస్థలు తమ కార్పొరేట్ అకౌంట్లు, ఉద్యోగుల శాలరీ అకౌంట్లను యాక్సిస్ బ్యాంకులోనే తెరుస్తుంటాయి. ఖాతాదారులు ఎక్కువగా అర్బన్ ప్రజలే కావడం, పైగా ఉద్యోగులే కావడంతో నెట్ బ్యాంకింగ్ వాడే వారి శాతం బాగానే ఉంటుంది. అయితే డీమానిటైజేషన్ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ కూడా క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్‌ను మరింత ప్రోత్సహించే దిశగా ప్రయత్నిస్తోంది. యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులు నెట్ బ్యాంకింగ్‌ను ఎలా వినియోగించుకోవాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోవచ్చు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ కోసం ఎలా అప్లయ్ చేయాలి?
# యాక్సిస్ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను యాక్టివేట్ చేసుకోవడం చాలా సులువు. సేవింగ్స్, కరెంట్ అకౌంట్ ఉన్న ఖాతాదారులు ఎవరైనా ఈ సేవలను వినియోగించుకోవచ్చు.
# నెట్ బ్యాంకింగ్ కోసం రిజిస్టర్ చేసుకోవడానికి ముందుగా యాక్సిస్ బ్యాంక్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. దానిలో లాగిన్ పేజీని తెరవాలి. అక్కడ రిజిస్టర్ ఫర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. లాగిన్ ఐడీ అడుగుతుంది.
# బ్యాంకులో ఖాతా తెరిచినప్పుడు మీకు ఇచ్చే వెల్‌కం లెటర్, చెక్‌బుక్ మీద కూడా కస్టమర్ ఐడీ ఉంటుంది. ఇదే మీకు లాగిన్ ఐడీగా కూడా పని చేస్తుంది. దీనిని ఎంటర్ చేసి లోపలికి వెళ్లాలి.
# మీ అకౌంట్ నెంబర్, సెల్ నెంబర్, డెబిట్ కార్డ్ నెంబర్, పిన్ తదితర వివరాలన్నీ ఎంటర్ చేయాలి. తర్వాత కార్డు కరెన్సీ టాబ్‌లో ఉన్న ఇండియన్ రుపీ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. టర్మ్ అండ్ కండిషన్స్‌ను యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేయాలి.
# తర్వాత మీకు నచ్చిన పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలి. పాస్ వర్డ్‌ను రెండోసారి ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ పాస్ వర్డ్ వస్తుంది. ట్రాన్సాక్షన్ పాస్ వర్డ్ ఎంటర్ చేయగానే మీ సెల్ నెంబర్‌కు బ్యాంకు ఒక వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ)ని పంపుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. దీంతో మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
# 15 నిముషాల తర్వాత మీ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో నెట్‌బ్యాంకింగ్ అకౌంట్‌ను వాడుకోవచ్చు.
మీకు యూజర్ ఐడీ లేకపోతే ఇంటర్నెట్ నుంచి యాక్సిస్ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫాంను డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదా ఏదైనా యాక్సిస్ బ్యాంక్ బ్రాంచికి వెళ్లి ఫాం తీసుకోవచ్చు. అందులో మీ అకౌంట్, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ, పేరు, చిరునామా వంటి వివరాలన్నీ నింపాలి. తర్వాత దగ్గరలో ఉన్న ఏదైనా యాక్సిస్ బ్యాంక్ బ్రాంచిలో సమర్పించాలి. వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత బ్యాంకు మీ ఈ మెయిల్ ఐడీకి పాస్‌వర్డ్‌ను పంపిస్తుంది. లాగిన్ ఐడీ, ఈ పాస్‌వర్డ్ నమెదు చేస్తే మీకు ట్రాన్సాక్షన్ పాస్‌వర్డ్ వస్తుంది. అంతకు ముందే రిజిస్టర్ ఫర్ నెట్ సెక్యూర్ అనే ఆప్షన్ కనిపిస్తుది. దాన్ని క్లిక్ చేయాలి. తర్వాత మీ సెల్‌నెంబర్ అడుగుతుంది. సెల్‌నెంబర్ (మీరు బ్యాంకులో మీ ఖాతా ఓపెన్ చేసేటప్పుడు ఇచ్చిన నెంబర్) నమోదు చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీరు ఇక నెట్‌బ్యాంకింగ్ సేవలు అందుకోవడానికి సిద్ధమైనట్టే.
# వెబ్‌సైట్ డాష్‌బోర్డులో టాప్‌లోనే లాగిన్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి పర్సనల్‌లోకి వెళ్లి మీ లాగిన్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు హోం పేజీ వస్తుంది. మీ అకౌంట్ బ్యాలెన్స్ వంటి వివరాలన్నీ ఇక్కడ వివిధ ఆప్షన్లలో పొందుపరచబడి ఉంటాయి. వాటిని క్లిక్ చేసి ఎలాంటి వివరాలు కావాలన్నా తెలుసుకోవచ్చు.
మనీ ట్రాన్స్‌ఫర్ ఇలా..
ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే ముందుగా మీరు వెబ్‌సైట్‌లో పైవైపున ఉన్న పేమెంట్ సెక్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ ట్రాన్స్‌ఫర్ ఫండ్స్ అని ఉన్న ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. మీరు డబ్బులు పంపాల్సిన వ్యక్తిది యాక్సిస్ బ్యాంక్ అకౌంటా. లేదా ఇతర బ్యాంకుల అకౌంటా అని అడుగుతుంది.
న్యూ పేయీని ఎలా యాడ్ చేయాలి?
మీరు డబ్బులు పంపాలనుకున్న వ్యక్తి లేదా సంస్థ అకౌంట్ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్‌పైన ఇతర బ్యాంకు అకౌంట్ అయితే అదర్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్‌పైన క్లిక్ చేయాలి.
అకౌంట్ నెంబర్, పేరు, ఏ బ్యాంకు, బ్రాంచి, ఐఎఫ్ఎస్సీ కోడ్, అడ్రస్ వంటి వివరాలన్నీ యాడ్ న్యూ పేయీ అనే ఆప్షన్ కింద ఉన్న బాక్సుల్లో ఎంటర్ చేయాలి. నెట్‌సెక్యూర్ కోడ్ కూడా ఎంటర్ చేస్తే మీ పేయీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఇలా ఎంత మంది పేయీలనైనా యాడ్ చేసుకోవచ్చు.
మనీ ట్రాన్స్‌ఫర్ ఎలా చేయాలి?
యాడ్ చేసుకున్న పేయీ ఎవరికైనా డబ్బులు ఆన్‌లైన్‌లో పంపాలంటే రెండు మార్గాలుంటాయి. నెఫ్ట్ ( NEFT) లేదా ఐఎంపీఎస్ (IMPS) పద్ధతిలో పంపవచ్చు.
నెఫ్ట్‌లో డబ్బులు ఎలా పంపాలి?
నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీ. దీనిద్వారా మీరు ఎవరైనా పేయీకి డబ్బులు ఆన్‌లైన్లో పంపొచ్చు. ఇందుకోసం మీరు నెట్ బ్యాంకింగ్ లోకి లాగిన్ కావాలి. పేమెంట్ టాబ్‌లోకి వెళ్లి మీరు డబ్బు పంపాలనుకున్న పేయీ పేరును బెనిఫిషరీ లిస్ట్‌లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. బిగిన్ పేమెంట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఎమౌంట్ ఎంటర్ చేసి కన్‌ఫర్మ్ చేయాలి. అప్పుడు మీ నెట్‌సెక్యూర్ కోడ్ అడుగుతుంది. దాన్ని ఎంటర్ చేయగానే మీ ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది.
నెఫ్ట్ పద్ధతిలో ఆదివారాలు, సెలవుదినాల్లో మనీ ట్రాన్స్‌ఫర్ చేయలేం. మీరు మనీ ట్రాన్స్‌ఫర్ చేసినా తర్వాత పని దినమే ఆ అమౌంట్ మీ అకౌంట్‌లో నుంచి కట్ అయి మీ పేయీ ఎకౌంట్‌కు చేరుతుంది.
ఐఎంపీఎస్‌లో డబ్బులు పంపవచ్చు ఇలా...
ఐఎంపీఎస్ అంటే ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్. దీని ద్వారా ఆదివారాలు, సెలవుదినాలతో సహా ఎప్పుడైనా క్షణాల మీద డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. అయితే పేయీ కూడా ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు తీసుకునే సౌకర్యం కలిగి ఉండాలి.
# దీని ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే లాగిన్ అయి ట్రాన్స్‌ఫర్ ఫండ్స్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. మీ బెనిఫిషరీ లిస్ట్‌లో నుంచి పేయీని సెలెక్ట్ చేసుకోవాలి. (రిజిస్టర్ న్యూ బెనిఫిషరీ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని అప్పటికప్పుడే కొత్త పేయీని కూడా యాడ్ చేసుకోవచ్చు). * పంపాలనుకున్న మొత్తాన్ని ఎంటర్ చేసి పే ఇన్‌స్టంట్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. మీ లాగిన్ ఐడీ, నెట్‌సెక్యూర్ కోడ్ (ఎస్ఎంఎస్‌లో వచ్చింది), ట్రాన్సాక్షన్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
# వాలిడేట్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్‌ను యాక్సెప్ట్ చేస్తే ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది.
# మొబైల్ నెంబర్, బ్యాంకు ఇచ్చే ఏడంకెల ఎంఎంఐడీ ( MMID) నెంబర్ను ఉపయోగించి కూడా ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
ఇతర సేవలూ ఉన్నాయ్..
# హోం పేజీలో గ్రాబ్ డీల్స్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మీకు హోటల్ లో డైనింగ్ ఆఫర్స్, బస్ టికెట్ ఆఫర్స్ వంటివి కనిపిస్తాయి.
# మేక్ పేమెంట్ ఆప్షన్ లోకి వెళితే గ్యాస్, మొబైల్, ఎలక్ట్రిసిటీ, ల్యాండ్‌లైన్, క్రెడిట్ కార్డ్ బిల్లులు పే చేసుకోవచ్చు.
# బ్యాంక్ స్మార్ట్ ఆప్షన్ కింద ఈ స్టేట్‌మెంట్ తో సహా బ్యాంక్ ఖాతాకు సంబంధిన సేవలు పొందవచ్చు.
# అప్లై నౌ ఆప్షన్‌ను క్లిక్ చేసి కార్ లోన్, హోం లోన్, క్రెడిట్ కార్డ్ వంటి బ్యాంకు సంబంధిత సేవలక వేటికైనా అప్లయి చేసుకోవచ్చు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
# మీ నెట్‌బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ రహస్యంగా ఉంచాలి.
# వీలైనంత వరకు వ్యక్తిగత కంప్యూటర్ లేదా లాప్‌టాప్‌లోనే నెట్ బ్యాంకింగ్‌ను వాడుకోవాలి. ఒకవేళ బయట నెట్ సెంటర్లు లేదా ఆఫీసు కంప్యూటర్‌లో నుంచి పంపాల్సి వస్తే వర్చువల్ కీ బోర్డును వాడుకోవడం సురక్షితం.
# ఫండ్ ట్రాన్స్‌ఫర్, పేయీని యాడ్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు వివరాలన్నీ చెక్ చేసుకున్నాకే ట్రాన్సాక్షన్ చేసుకుంటే ఇబ్బందులుండవు.
"