• తాజా వార్తలు

నగదు రహిత జీవితానికి సంపూర్ణ మార్గ దర్శిణి 19 - ఎస్‌బీఐ... నెట్ బ్యాంకింగ్ గైడ్

 

ప్రైవేటు, ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌న్నింటిలో దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).  న‌గ‌దు కొర‌త ఇంత‌గా ఉన్న రోజుల్లోనూ ఎక్కువ మందికి అవ‌స‌రాలు తీర్చ‌గ‌లిగింది ఎస్‌బీఐయే అని నిస్సందేహంగా చెప్పొచ్చు.  14 వేల బ్రాంచిల‌తో ల‌క్ష‌లాది మంది క‌స్ట‌మ‌ర్ల‌తో కొలువై ఉన్న ఈ బ్యాంకింగ్ రంగ దిగ్గ‌జం కూడా  క్యాష్‌లెస్ ట్రాన్సాక్ష‌న్స్ కోసం క‌స్ట‌మ‌ర్ల‌ను  ప్రోత్స‌హిస్తోంది.  ఇంత భారీ స్థాయిలో ఖాతాదార్లు ఉంటారు కాబ‌ట్టి ఎస్‌బీఐ బ్రాంచులు ఎప్పుడు చూసినా కిట‌కిట‌లాడుతుంటాయి.  గంట‌ల త‌ర‌బ‌డి లైన్‌లో నిల‌బ‌డే ప‌ని లేకుండీ మీ ఇంటి ద‌గ్గ‌ర నుంచే సుర‌క్షితంగా, వేగంగా, అత్యంత సులువుగా  లావాదేవీల‌ను జ‌రుపుకోవ‌డానికి నెట్ బ్యాంకింగ్ మీకు వెసులుబాటు క‌ల్పిస్తుంది.  

 

ఎస్‌బీఐ అకౌంట్ ఉండి నెట్ బ్యాంకింగ్ సౌక‌ర్యం లేనివారి దాన్ని ఎలా పొందాలో తెలుసుకోండి.  

* ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ కోసం ఎలా అప్ల‌య్ చేయాలి?

* ఇది చాలా సుల‌భ‌మైన ప్ర‌క్రియ‌. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేష‌న్  ఫాంను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

* ఈ ఫాంను క‌చ్చిత‌మైన వివ‌రాల‌తో నింపాలి. దీన్ని మీ ఖాతా ఉన్న ఎస్‌బీఐ బ్రాంచిలో అంద‌జేయాలి.

* బ్యాంక్ సిబ్బంది ఈ వివ‌రాల‌న్నీ స‌రిచేసి అంతా స‌రిగా ఉంద‌నుకుంటే మీకు ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ కిట్ ఇస్తారు. దీనిలోనే మీ యూజ‌ర్‌నేమ్, పాస్‌వ‌ర్డ్ ఉంటాయి. మీరు కొత్త‌గా అకౌంట్ తీసుకునేవారైతే అకౌంట్ ఓపెన్ చేసేట‌ప్పుడే నెట్ బ్యాంకింగ్‌కు అప్లై చేసి తీసుకోవ‌చ్చు.

 

నెట్ బ్యాంకింగ్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి?

* http://www.onlinesbi.com/లోకి వెళ్లాలి. 

ప‌ర్స‌న‌ల్ బ్యాంకింగ్ లాగిన్ ఐకాన్‌ను క్లిక్ చేయాలి. సంస్థ‌ల ఖాతాల‌యితే కార్పొరేట్ లాగిన్ ఉంటుంది. 

 

* త‌ర్వాత పేజీలో మీకు సెక్యూరిటీ మెజ‌ర్స్ క‌నిపిస్తాయి. మీ క‌నెక్ష‌న్ సుర‌క్షితంగా ఉంద‌ని మీరు భావిస్తే అక్క‌డున్న కంటిన్యూ టు లాగిన్ బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి.

 

* త‌ర్వాత పేజీలో యూజ‌ర్ నేమ్‌, పాస్‌వ‌ర్డ్  న‌మోదు చేయాలి.  బ్యాంకు వారు కిట్‌లో ఇచ్చిన యూజ‌ర్ నేమ్‌, పాస్‌వ‌ర్డ్ తో లాగిన్ అయ్యాక వాటిని మార్చుకోమ‌ని వెబ్‌సైటే సూచిస్తుంది. మీకు న‌చ్చిన యూజ‌ర్‌నేమ్‌, పాస్‌వ‌ర్డ్ పెట్టుకోవ‌చ్చు. ఇది మీకు మాత్ర‌మే తెలిసేలా పెట్టుకోండి.  బ‌ర్త్‌డేలు, పిల్ల‌ల పేర్లు వంటివ‌యితే తెలిసిన వారు ఎవ‌రైనా హ్యాక్ చేయ‌వ‌చ్చ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అలాగే ఆరు నెల‌ల‌కోసారి క‌చ్చితంగా మీ పాస్‌వ‌ర్డ్‌ను మార్చుకోవాలి. ఇది మీ అకౌంట్ భ‌ద్ర‌త‌కు చాలా అవ‌స‌రం.  ఇదే పేజీలో కింద వ‌ర్చువ‌ల్ కీ బోర్డు అనే ఆప్ష‌న్ ఉంటుంది. ఇది కావాల‌నుకుంటే టిక్ చేస్తే వ‌ర్చువ‌ల్ కీ బోర్డు వ‌స్తుంది. మీరు కంప్యూట‌ర్ కీ బోర్డుతో కాకుండా వ‌ర్చువ‌ల్ కీ బోర్డు మీద మౌస్‌తో క్లిక్ చేయ‌డం ద్వారా కూడా లాగిన్ కావ‌చ్చు. ఇది కూడా భ‌ద్ర‌తాప‌ర‌మైన ఏర్పాటే.

* యూజ‌ర్ నేమ్‌, పాస్‌వ‌ర్డ్‌తో లాగిన్ అయ్యాక  ప్రొఫైల్  పాస్‌వ‌ర్డ్ అడుగుతుంది. అది కూడా ఎంట‌ర్ చేస్తేనే మీరు కొత్త‌గా డ‌బ్బులు పంపేందుకు పేయీని యాడ్ చేసుకోగ‌లుగుతారు. మీరు ఒక‌వేళ పాస్‌వ‌ర్డ్  మార్చుకోవాల‌న్నా కూడా ప్రొఫైల్ పాస్‌వ‌ర్డ్ త‌ప్ప‌నిస‌రిగా న‌మోదు చేయాలి.

* మీరు ఇప్ప‌డు హోంపేజీకి వెళ‌తారు.  దీనిలో డాష్ బోర్డు ఉంటుంది. మై అకౌంట్స్‌లోకి వెళితే అకౌంట్ స్టేట్‌మెంట్‌,  ఇన్‌కంటాక్స్ స్టేట్‌మెంట్‌, ఆధార్ లింకేజీ, గ్యాస్ సబ్సిడీ లింకేజీ వంటి వివ‌రాల‌న్నీ లభ్య‌మ‌వుతాయి. 

 

 

ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్ ( మీ ఖాతా నుంచి వేరొక‌రికి డ‌బ్బులు పంప‌డం) ఎలా?

డాష్‌బోర్డులో ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్ ఆప్ష‌న్‌ను  క్లిక్ చేయాలి.  కొత్త‌గా పేయీని యాడ్ చేయాలంటే యాడ్ పేయీ ఆప్ష‌న్‌ను క్లిక్ చేస్తే ఒక ఫాం వ‌స్తుంది. అత‌ను ఎస్‌బీఐ వినియోగ‌దారుడా లేదా లేక ఇత‌ర బ్యాంకు ఖాతాదారా అనే రెండు ఆప్షన్లు క‌నిపిస్తాయి. దాన్ని బ‌ట్టి  మీరు డ‌బ్బు పంపాల్సిన వ్య‌క్తి పేరు, అకౌంట్ నెంబ‌ర్‌, బ్రాంచి పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, అడ్ర‌స్ న‌మోదు చేయాలి.  స‌బ్మిట్ చేయ‌గానే మీకు మెసేజ్ వ‌స్తుంది. దానిలో ఉన్న నెంబ‌రును ఎంట‌ర్ చేస్తే బెనిఫిషరీ రిజిస్ట‌ర్ అవుతారు. ఒక‌సారి రిజిస్ట‌ర్ అయితే త‌ర్వాత ఎన్నిసార్ల‌యినా నేరుగా వారికి న‌గ‌దు పంపొచ్చు. 

* ఫండ్  ట్రాన్స్‌ఫ‌ర్ అనే పేజీలో నెఫ్ట్ / ఆర్టీజీఎస్  అని కనిపిస్తాయి. సెల‌వు రోజుల్లో కూడా పంపాలంటే ఐఎంపీఎస్ వాడుకోవాలి. 

*  పేయీ లిస్టులోంచి మీరు డబ్బు పంపాలనుకున్న వ్యక్తి పేరును సెలెక్ట్ చేసి ఎంత పంపాల‌నే వివ‌రాలు న‌మోదు చేసి స‌బ్మిట్ చేయాలి. 

*  తర్వాత పేజీలో మీరు పే చేయబోతున్న వివరాలన్నీ కనిపిస్తాయి. ఓకే అనుకుంటే కన్ ఫర్మ్ చేయాలి.

 

 

* అప్పుడు మీ సెల్ నెంబర్ కు నెట్ సెక్యూర్ కోడ్ (ఓటీపీ వంటిదే) నెంబర్ వస్తుంది. అది నమోదు చేసి సబ్మిట్ కొడితే మీ ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్  పూర్తవుతుంది.  వెంటనే మీకు తెరపై కూడా మెసేజ్ వస్తుంది. మీ సెల్ కు కూడా మెసేజ్ వస్తుంది.

 

ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి

* మీరు ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్ చేయాల‌నుకుంటే మీ యూజ‌ర్ నేమ్‌, పాస్‌వ‌ర్డ్ ర‌హ‌స్యంగా ఉంచాలి.

* ఆఫీసు లేదా ఇంట‌ర్నెట్ సెంట‌ర్ల‌లో సాధ్య‌మైనంత వ‌ర‌కు వీటిని ఉప‌యోగించి ట్రాన్సాక్ష‌న్ చేయ‌కుండా ఉండ‌డ‌మే మంచిది. మీ ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ లేదా లాప్‌టాప్‌లో కూడా ఎలాంటి యాడ్‌వేర్‌, మాల్‌వేర్ లేదా అనుమానాస్ప‌దంగా ఉండే సాఫ్ట్ వేర్‌ల‌ను ఉంచ‌కండి. అది మీ నెట్ బ్యాంకింగ్ యూజ‌ర్ నేమ్‌, పాస్‌వ‌ర్డ్ వంటివాటిని దొంగిలించే ప్ర‌మాదం ఉంది.

* మీ ఓటీపీ నెంబ‌ర్‌ను కూడా ఎవ‌రికీ చెప్పొద్దు. ఎందుకంటే సాధారణంగా  ఓటీపీ 15 నిముషాల వ‌ర‌కు ప‌నికివ‌స్తుంది. ఒక‌వేళ మీరు ఏదైనా కార‌ణం చేత దాన్ని వాడుకోలేక‌పోతే ఈలోగా మీ యూజ‌ర్‌నేమ్‌, పాస్‌వ‌ర్డ్ ఎవ‌రైనా తెలుసుకుంటే ఈ ఓటీపీని ఉప‌యోగించి మీ అకౌంట్‌ను దుర్వినియోగం చేసే ప్ర‌మాదం ఉంది.

* ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్, పేయీని యాడ్ చేసేట‌ప్పుడు ఒక‌టికి రెండుసార్లు వివ‌రాల‌న్నీ చెక్ చేసుకున్నాకే ట్రాన్సాక్ష‌న్ చేసుకోవ‌డం మంచిది.

* మీ  సెల్‌నెంబ‌ర్ లేదా మెయిల్ ఐడీని మార్చితే వెంట‌నే బ్యాంకు అకౌంట్‌లో కూడా అప్‌డేట్ చేసుకోవాలి. 

* మేం బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం . మీ యూజ‌ర్ నేమ్‌, పాస్ వ‌ర్డ్ చెప్ప‌మ‌ని ఎవ‌రైనా అడిగినా చెప్పొద్దు. ఎందుకంటే ఎస్‌బీఐయే కాదు ఏ బ్యాంకు కూడా ఆ వివ‌రాలు అడ‌గ‌వు.

 

 

జన రంజకమైన వార్తలు