దేశంలో డిజిటల్ చెల్లింపుల్ని ప్రోత్సహించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తీసుకుంటున్న చర్యలతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. అయితే వాటి విలువ మాత్రం తగ్గుతుందని ఆర్‌బీఐ ప్రకటించింది. గత ఐదేళ్లలో డిజిటల్ పేమెంట్స్ ఏటా యావరేజ్‌న 55.1 శాతం పెరిగాయి. 2016 మార్చి నాటికి 593.61 కోట్లున్న డిజిటల్ లావాదేవీలు ఈ ఏడాది మార్చి నాటికి ఏకంగా 3,434.56 కోట్లకు చేరాయి. కరోనా, లాక్‌డౌన్ల కారణంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగినా అందులో పాలు, ఉప్పు , పప్పులు కొనడానికి చేసే చిన్న పేమెంట్స్ ఎక్కువగా ఉండటంతో వాటి విలువ మాత్రం తగ్గిపోతోంది.
అదే దెబ్బకొట్టింది
గత ఆర్థిక సంవత్సరం (2019-20) డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు 2,343.40 కోట్ల నుంచి 3,434.56 కోట్లకు పెరిగినా.. లావాదేవీల విలువ మాత్రం రూ.1,638.52 లక్షల కోట్ల నుంచి రూ.1,623.05 లక్షల కోట్లకు పడిపోయింది. ఆర్థిక మందగమనంతో పెద్ద ఎత్తున జాబ్స్ పోవటంతో ప్రజలు ఖర్చులు తగ్గించుకోవడం ఇందుకు కారణమని ఆర్‌బీఐ భావిస్తోంది.
డీమానిటైజేషన్ నుంచి మొదలైన ఊపు
పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్)తో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో ఊపందుకున్నాయి. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఈసీఎస్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. పేటీఎం, ఫోన్ పే లాంటి యాప్స్‌తోపాటు గూగుల్ పే లాంటి యూపీఐ బేస్డ్ పేమెంట్స్‌తో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగాయి. ఈలోగా కరోనా రావడంతో ప్రజలు నగదు లావాదేవీల కంటే యాప్స్ , యూపీఐ పేమెంట్స్ మీద ఎక్కువగా ఆధారపడటం కూడా డిజిటల్ పేమెంట్స్ పెరగడానికి కారణమైంది.