భారత్‌లో ఇ-కామర్స్ ఇంత వేగంగా విస్తరిస్తుందో తెలియంది కాదు. ప్రస్తుతం ఉన్న ఇ-కామర్స్ సైట్లతో పాటు కొత్త కొత్త సైట్లు వినియోగదారుల కోసం పుడుతున్నాయి. స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా పథకాల్లో భాగంగా ఇ-కామర్స్ సైట్ల సంఖ్య ఇబ్బుడిముబ్బుడిగా పెరిగిపోయింది. సమయం, శ్రమ కలిసి వస్తుండటంతో ఎక్కువమంది ఇంటర్నెట్ యూజర్లు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికే ఇష్టపడుతున్నారు. ఇక అమ్మకందారులకు ఆన్‌లైన్ సైట్లు కల్పతరువుగా మారాయి. ఈ నేపథ్యంలో ఇ-కామర్స్ ఆదాయం కూడా ఊహించలేనంత వేగంగా పెరిగింది. తాజా లెక్కల ప్రకారం 2016 ఏడాది ఆఖరికి భారత్‌లో ఇ-కామర్స్ ఆదాయం రూ.2 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. ఈ విషయాన్ని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తన సర్వే ద్వారా తెలిపింది. డిసెంబర్ 2011 నుంచి డిసెంబర్ 2015 మధ్య కాలంలో భారత్‌లో ఇ-కామర్స్ వ్యాపారం 30 శాతం పెరిగింది ఈ సర్వే పేర్కొంది. ఈ మధ్య కాలంలో రూ.1,25,732 కోట్ల వ్యాపారం జరిగిందట. ముఖ్యంగా ఈ ఆన్‌లైన్ వ్యాపారంలో ఎక్కువశాతం ఆదాయం ఆన్‌లైన్ ట్రావెల్స్ పరిశ్రమల నుంచి వచ్చాయట. డొమెస్టిక్ ఎయిర్ టిక్కెట్స్‌తో పాటు రైల్వే బుకింగ్స్, బస్ బుక్సింగ్ ద్వారా ఇ-కామర్స్ సైట్లు లాభాలను ఆర్జించాయి. కేవలం ఆన్‌లైన్ ట్రావెల్స్ ద్వారానే ఇ-కామర్స్ ఆదాయం 40 శాతం పెరిగిందని ఈ సర్వే తెలిపింది. ఆన్‌లైన్ ట్రావెల్స్ ద్వారా రూ.1,22,815 కోట్ల ఆదాయం సమకూరిందట. అంతేకాదు డిసెంబర్ 2015లో హోటల్ బుకింగ్ బిజినెస్ కూడా ఊపందుకుంది. ఈ రంగంలో రూ.5200 కోట్ల ఆదాయం వచ్చిందట. రైల్వే టిక్కెట్లకు కూడా వినియోగదారులు బాగానే ఖర్చు చేశారు. రూ.21,708 కోట్లు రైల్వే ఆన్‌లైన్ టిక్కెట్ల ద్వారా ఆదాయం వచ్చింది. అంతేకాదు మొబైల్ ఫోన్లు, మొబైల్ యాక్ససరీస్, కంప్యూటర్లు, కంజ్యుమర్ ఎలక్ట్రానిక్స్, అపీరెల్ కొనడానికి వినియోగదారులు ఆన్‌లైన్ సైట్లను ఎక్కువగా ఉపయోగించరట. ఇ-టెయిలింగ్ సెగ్మంట్ ఇ-కామర్స్ ఆదాయంలో 49 శాతం సంపాదించిపెట్టిందట. ఆన్‌లైన్‌లో ఇలా కొనుగోళ్లు చేసిన వినియోగదారుల్లో ఎక్కువమంది చిన్న నగరాలకు చెందినవారేనట. వీరు 16 నుంచి 34 వయసు మధ్య వారు. ఈ సెగ్మంట్‌లో రూ.7142 కోట్లు ఆదాయం వచ్చిందట. 2016 ఏడాది ఆఖరికి ఈ ఆదాయం రూ.72,639 కోట్లకు చేరుకునే అవకాశం ఉందట. |