డిజిటల్ వాలెట్లు పేటీఎం, ఫోన్ పే ఇప్పుడు దేశవ్యాప్తంగా తమ లావాదేవీలను విస్తరించాయి. పాన్ షాప్ నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద మాల్స్ వరకు కూడా వీటి ద్వారా పేమెంట్లు చేయగలుగుతున్నాం. వీటిని వాడే వ్యాపారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాయి ఆ సంస్థలు. వినియోగం పెరిగే కొద్దీ వీటి ద్వారా జరిగే మోసాల గురించి రోజూ వార్తల్లో చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో పేటీఎం, ఫోన్ పే కూడా తమ యూజర్లను అప్రమత్తం చేశాయి.
పేటీఎం ఏం చెప్పింది?
పేటీఎంలో ప్రధానంగా ఈ కేవైసీ పేరుతో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పేటీఎంలో క్యాష్‌బ్యాక్స్, ఇతర ఆఫర్లు ఏం రావాలన్నా ఈకేవైసీ తప్పనిసరి. ఈకేవైసీ చేస్తామంటూ మోసగాళ్లు మీకు కాల్ చేస్తారు. మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు అడుగుతారు. పిన్ నెంబర్ చెప్పమంటారు. అవేమీ చేసి మోసపోవద్దని పేటీఎం హెచ్చరిస్తోంది.
* పేటీఎం ఈకేవైసీ వెరిఫికేషన్ కోసం ఎలాంటి మెసేజ్‌లు పంపదు. లేదా ఫలానా యాప్ డౌన్‌లోడ్ చేసుకోండని చెప్పదు. అలాంటివేవైనా వస్తే ఆ మెసేజ్‌లో ఉన్న లింక్‌ను క్లిక్ చేయడం చేయొద్దని పేటీఎం ఫౌండర్ విజయశేఖర్ శర్మ ట్వీట్ చేశారు.
* పేటీఎం ఈకేవైసీ చేయకపోతే మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుందని మిమ్మల్ని కంగారుపెట్టేలా మెసేజ్‌లు వస్తే జాగ్రత్తగా ఉండండి.
* పేటీఎం ఈకేవైసీ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లలోనే చేస్తారు. లేదంటే పేటీఎంకు మీరు కాల్ చేస్తే వాళ్ల ప్రతినిధిని మీ ఇంటికి పంపిస్తారు.
ఫోన్ పే యూజర్లకు హెచ్చరిక
ఫోన్‌పే కూడా ఈ సంవత్సరం మొదట్లోనే తన యూజర్లను ఇలాంటి మోసాలు జరిగే ప్రమాదముందని హెచ్చరించింది. క్వికర్, ఓఎల్ఎక్స్ లాంటి సైట్లలో మీరు ఏదైనా వస్తువును అమ్మకానికి పెట్టినప్పుడు ఆ వస్తువు కొనుక్కుంటామని కొంత మంది కాల్ చేస్తుంటారు. ఆన్‌లైన్ మోసగాళ్లు కూడా దీన్నే వాడుకుంటున్నారు. మేం ఆ వస్తువును కొనాలనుకుంటున్నామని, కానీ వచ్చి డబ్బులివ్వలేమని. . మనీ ట్రాన్స్ఫర్ చేస్తామని ఫోన్ పే వివరాలు అడుగుతారు. ఆ వివరాలు చెపితే మీ అకౌంట్లు ఖాళీ చేస్తారని హెచ్చరించింది. తాము పోలీసులమని, ఆర్మీలో పని చేస్తున్నామని చెప్పి ఇలాంటి మోసాలకు ఎక్కు మంది పాల్పడుతున్నట్లు ఫోన్ పే యూజర్లను హెచ్చరించింది.